Likud Party
-
ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్(పార్లమెంట్)లో గురువారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడి నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కొత్తగా సంకీర్ణంలో లికుడ్ పార్టీతోపాటు ఛాందసవాద షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్ పార్టీలున్నాయి. -
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. -
నెతన్యాహూకే మళ్లీ పట్టం!
ఇజ్రాయెల్ ఎన్నికల్లో లికుడ్ పార్టీ విజయం జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహూ మరోసారి కొనసాగనున్నారు. బుధవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఇప్పటికే మూడు సార్లు వరుసగా ప్రధాని పదవిని చేపట్టిన నెతన్యాహూ.. మరోసారి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆ దేశంలో పార్లమెంట్ సభ్యుల పదవీకాలం మూడేళ్లు మాత్రమే. దీంతో ఇప్పటికే 9 ఏళ్లు ప్రధానిగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికైతే ఆ దేశ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధాని పీఠాన్ని అధిష్టించిన నేతగా రికార్డు సృష్టిస్తారు. పార్లమెంట్ లో 120 స్థానాలుండగా... పోటా పోటీగా సాగిన ఈ ఎన్నికల్లో 29 స్థానాలను లికుడ్ సాధించింది. జియోనిస్ట్ యూనియన్‌కు 24, అరబ్ పార్టీల కూటమికి 14 స్థానాలు దక్కాయి. ఎన్నికలకు ముందు రెండు రోజుల వరకు జియోనిస్ట్ యూనియన్ ముందంజలో ఉంది. పలు సర్వేలు కూడా వారికే అనుకూలంగా కనిపించాయి. కానీ ఎన్నికలకు ముందు రోజు పాలస్తీనా అంశంలో ఏమాత్రం వెనక్కితగ్గబోమని, కఠినంగా వ్యవహరిస్తామని నెతన్యాహూ చేసిన ప్రకటనతో పరిస్థితి ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల కోసం చిన్న పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు లికుడ్ నేతలు వెల్లడించారు.