నెతన్యాహూకే మళ్లీ పట్టం!
- ఇజ్రాయెల్ ఎన్నికల్లో లికుడ్ పార్టీ విజయం
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహూ మరోసారి కొనసాగనున్నారు. బుధవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఇప్పటికే మూడు సార్లు వరుసగా ప్రధాని పదవిని చేపట్టిన నెతన్యాహూ.. మరోసారి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆ దేశంలో పార్లమెంట్ సభ్యుల పదవీకాలం మూడేళ్లు మాత్రమే. దీంతో ఇప్పటికే 9 ఏళ్లు ప్రధానిగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికైతే ఆ దేశ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధాని పీఠాన్ని అధిష్టించిన నేతగా రికార్డు సృష్టిస్తారు.
పార్లమెంట్ లో 120 స్థానాలుండగా... పోటా పోటీగా సాగిన ఈ ఎన్నికల్లో 29 స్థానాలను లికుడ్ సాధించింది. జియోనిస్ట్ యూనియన్‌కు 24, అరబ్ పార్టీల కూటమికి 14 స్థానాలు దక్కాయి. ఎన్నికలకు ముందు రెండు రోజుల వరకు జియోనిస్ట్ యూనియన్ ముందంజలో ఉంది. పలు సర్వేలు కూడా వారికే అనుకూలంగా కనిపించాయి. కానీ ఎన్నికలకు ముందు రోజు పాలస్తీనా అంశంలో ఏమాత్రం వెనక్కితగ్గబోమని, కఠినంగా వ్యవహరిస్తామని నెతన్యాహూ చేసిన ప్రకటనతో పరిస్థితి ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల కోసం చిన్న పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు లికుడ్ నేతలు వెల్లడించారు.