త్వరలో ఇంటికో జెట్ విమానం!
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... అనుకునే వారికి శుభవార్త! ప్రతి ఇంటికీ బైక్, కారు మామూలైపోయిన ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ జెట్ విమానం అన్న నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఏఎస్) అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు త్వరలోనే మొట్టమొదటి వ్యక్తిగత జెట్ విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంట్లో కారును వాడినట్లుగానే ఈ కొత్త జెట్ ఫ్లైట్ ను వాడుకునేందుకు వీలుగా దీన్ని వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ పద్ధతిలో రూపొందిస్తోంది.
నలుగురు మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, డాక్టోరల్ విద్యార్థులు స్థాపించిన లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ, వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తిగత విహంగాలను అభివృద్ధి చేస్తోంది. జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ వీటీవోఎల్ జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గా ఉండి, తక్కువ శబ్దంతోనూ, హెలికాప్టర్లకన్నా సులభంగా ఎగిరే కొత్త తరహా జెట్ విమానాలను 2018 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నూతన ఆవిష్కరణలో విమానాలను... హెలికాప్టర్ల మాదిరిగానే భూమినుంచి నిలువుగా టేకాఫ్ అవ్వడంతో పాటు, నిలువుగా ల్యాండింగ్ అయ్యే వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (వీటివోఎల్) విధానంతో రూపొందిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్యను కొంత అధిగమించే అవకాశం కనిపిస్తోంది. అయితే కార్లు, టూ వీలర్స్ అయితే ఇంట్లోని సెల్లార్, లేదా పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేస్తాం. కానీ ఈ జెట్ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కేవలం ఓ చిన్నగది సైజు స్థలం ఉంటే సరిపోతుంది.
వీటివోఎల్ జెట్ ఎగిరేందుకు దీనిలో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అయితే దీనికి ధర వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. లిల్లుమ్ ఏవియేషన్ ఈ జెట్ విమానాన్ని ప్రజలకు సరసమైన ధరకు అందుబాటులోకి తెస్తే ఇక భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణ విధానమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది.