ఏపీలో లిండే ఇండియా రూ. 500 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశ్రమలకు అవసరమైన వాయువులను (గ్యాస్) ఉత్పత్తి చేస్తున్న లిండే ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్‌తోపాటు ఎయిర్ సెపరేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద ఈ ల్యాబ్ రానుంది. మొత్తంగా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ప్రతిపాదిత ప్రాజెక్టులకు ఏడాది చివరికల్లా ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి కానుందని కంపెనీ ఎండీ మొలాయ్ బెనర్జీ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు.
వీటిని రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో 7 ఎయిర్ సెపరేషన్ సైట్లు, 13 బాట్లింగ్ ప్లాంట్లను లిండే నెలకొల్పింది. ఇందుకు రూ.2,500 కోట్లు వెచ్చించింది. కాగా, లిండే ఇంటిగ్రేటెడ్ వాల్వ్ పేరుతో భారత్‌లో తొలిసారిగా తేలికైన మెడికల్ ఆక్సిజన్ సిలిండర్‌ను విడుదల చేసింది. బరువు 5 కిలోలు. బిల్ట్ ఇన్ రెగ్యులేటర్ దీని ప్రత్యేకత. ట్యూబ్‌ను నేరుగా అనుసంధానించి రోగికి ఆక్సిజన్ అందించవచ్చు.