కొంత రిస్క్ఉన్నా.. లిక్విడ్ స్కీమ్స్ బెస్ట్
నా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తంలోనే సొమ్ములున్నాయి. ఈ సొమ్ములను మంచి రాబడులు వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఉండాలి. ఎలాంటి పన్నుల భారం ఉండకూడదు, లేదంటే తక్కువ పన్నులుండాలి. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసుకునేలా ఉండాలి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నాకు తగిన సూచనలివ్వండి.
- చక్రవర్తి, గుంటూరు
తక్షణం అవసరం లేని పక్షంలో బ్యాంక్‌లో డిపాజిట్ల రూపంలో ఇంత పెద్ద మొత్తం ఉంచుకోవడం సరైనది కాదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ డిపాజిట్లపై వచ్చే రాబడులు పెద్దగా ఉండవని చెప్పవచ్చు. పైగా బ్యాంక్ డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇప్పటికిప్పుడు అవసరం లేని డబ్బులను మంచి రాబడులు వచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని, కాలాన్ని, మీరు భరించగలిగే రిస్క్‌ను పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి.
మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న కాలం మూడేళ్లలోపు ఉంటే, డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎంచుకోవాలి. ఐదేళ్లు, అంతకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షేర్లలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. బ్యాంకు డిపాజిట్లలోలాగా భద్రంగా, లిక్విడిటీతో ఉండే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు దాదాపు లేవు. లిక్విడిటీ, భద్రత కావాలనుకుంటే, మీ సొమ్ములను బ్యాంక్ డిపాజిట్లలోనే కొనసాగించండి. కొంత రిస్క్ తీసుకోగలిగితే, లిక్విడ్ స్కీమ్స్‌ను పరిశీలించవచ్చు. లిక్విడ్ స్కీమ్స్ మరీ ఏమంత రిస్క్‌గా ఉండవనే చెప్పవచ్చు. ఒక్క రోజులోనే డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్కెట్ రాబడులే వచ్చే అవకాశాలున్నాయి. ఒక ఏడాది పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆల్ట్రా షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
నాకు వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌కు మాత్రమే అర్హత ఉందని ఒక బీమా సంస్థ పేర్కొంది. నేను రూ. కోటి టర్మ్ పాలసీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినా కూడా రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే ఇస్తామని ఆ కంపెనీ తెలిపింది. నేను రూ.50 లక్షల టర్మ్ పాలసీలను రెండు తీసుకుందామనుకుంటున్నాను. అలా తీసుకోవచ్చా? ఇలా తీసుకున్న పక్షంలో క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయా?
- సాగర్, వరంగల్
ఆ బీమా సంస్థను కాకుండా మరో బీమా సంస్థను సంప్రదించండి. టర్మ్ ప్లాన్‌కు దరఖాస్తు చేసేపటప్పుడు ఏ బీమా సంస్థ అయినా ప్రస్తుతం మీ దగ్గరున్న బీమా పాలసీల గురించి వాకబు చేస్తాయి. అప్పుడు మీరు మీ బీమా పాలసీల గురించి చెప్పండి. మీరు రూ.50 లక్షల టర్మ్ పాలసీ తీసుకొని ఉండి కూడా, మరో రూ.50 లక్షల టర్మ్ పాలసీ కోసం దరఖాస్తు చేస్తే, ఇవ్వాలా, వద్దా అనేది సదరు బీమా సంస్థ నిర్ణయించుకుంటుంది. ఇక క్లెయిమ్‌ల విషయానికొస్తే, క్లెయిమ్ సరిఅయినది అయితే, నామినీకి రెండు బీమా సంస్థలు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉండకూడదనుకుంటే, మీకు తెలిసిన అన్ని వివరాలను బీమా పాలసీ తీసుకునేటప్పుడు వెల్లడించడం మంచిది.
నేను ఇటీవలనే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే స్వల్ప, దీర్ఘకాలిక లాభాలపై పన్నులు ఎలా ఉంటాయి. పన్నులు ఆదా చేస్తూ పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను ఎలా ఏర్పాటు చేసుకోవాలో సూచిస్తారా ? - శ్రీవల్లి, హైదరాబాద్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే రాబడులపై విధించే పన్నులకు, డెట్ ఫండ్స్ ద్వారా వచ్చే రాబడులపై విధించే పన్నులకు తేడా ఉంటుంది. డెట్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు అధికంగా లభిస్తాయని చెప్పవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏడాదికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.
ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు. ఒకవేళ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఏడాదిలోపే విక్రయిస్తే వాటిని స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ విషయానికొస్తే మూడేళ్లలోపు ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మీ ఆదాయపు పన్ను స్లాబ్నునుసరించి ఈ పన్ను ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లు మించితే, 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఇండెక్సేషన్‌తో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు డివిడెండ్లపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే డివిడెండ్లకు సంబంధించి పన్నులు చెల్లించాల్సిన బాధ్యత మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఉంటుంది. ఆ మేరకు రాబడులపై ప్రభావం ఉంటుంది.
మూడేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి డెట్ ఫండ్స్‌లోనూ, ఐదేళ్లకు మించిన ఇన్వెస్ట్మెంట్ కాలానికి ఈక్విటీ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా పొందవచ్చు. ఎలాంటి పన్నులు చెల్లించకపోవడం, ఒకవేళ పన్నులు చెల్లించాల్సి ఉంటే, వీలైనంత తక్కువగా పన్నులు చెల్లించడం.. మంచి ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల్లో ఒకటి. అయితే పన్నులు ఆదా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఉండకూడదు. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు భరించగలిగే రిస్క్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.