The list of candidates
-
అమ్మపై అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక ఎన్నికల్లో పోటీకి అన్నాడీఎంకే అవకాశం ఇవ్వలేదంటూ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. అమ్మ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళనకు దిగారు. ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరిమిత స్థానాల వల్ల అగ్రనేతలకు మాత్రమే అవకాశం లభిస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ మొదలుకుని గ్రామ పంచాయతీ వరకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అవసరం కాబట్టి అన్నాడీఎంకేలోని ఔత్సాహికులంతా ఆశపడ్డారు. అమ్మ ప్రకటించే అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూశారు. ఈనెల 26వ తేదీన అన్నాడీఎంకే విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో హతాశులయ్యారు. చెన్నై టీ నగర్ 132 వార్డుకు ప్రకటించిన అభ్యర్థిఆనంది మరో వార్డుకు చెందిన మహిళా అంటూ అగ్రహించిన కార్యకర్తలు అన్నాడీఎంకే దక్షిణ కార్యాలయాన్ని, రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. తిరుచ్చిరాపల్లి కార్పొరేషన్‌లోని పలువురు అన్నాడీఎంకే కౌన్సిలర్లపై ముందుగానే అసంతృప్తి నెలకొని ఉండగా, వారిలోని కొందరికి మళ్లీ అవకాశం రావడంతో ప్రత్యర్థులు భగ్గుమన్నారు. ఈ విషయంపై తాడోపేడో తేల్చుకోవాలని సుమారు 500 మంది కార్యకర్తలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. మార్గమధ్యంలో మంత్రి వెల్లమండి నటరాజన్ కారులో ఎదురురావడంతో ముట్టడించారు. కారును రాళ్లతోనూ, చెప్పులతోనూ కొట్టారు. డబ్బులు పుచ్చుకుని సీటిచ్చారని, పార్టీ ద్రోహి అంటూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి కారు నుంచి దిగి చర్చలు జరిపారు. కోయంబత్తూరు, దిండుగల్లు జిల్లాల్లో సైతం పార్టీ కార్యాలయాల ముట్టడి చేశారు. ఆత్మహత్యా యత్నం: తిరువళ్లూరుకు చెందిన సిట్టింగ్ అభ్యర్థి సెల్వకుమారి పోటీ కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. తనకు అవకాశం వస్తుందని ప్రజల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే జాబితాలో పేరు లేకపోవడంతో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చెన్నై చేపాక్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. తీవ్రగాయాలకు గురైన ఆమెను చెన్నై కీల్పాక్ ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే తిరువళ్లూరుకు చెందిన తమిళ్ సెల్వి టికెట్ ఆశించి భంగపడ్డారు. తన భార్యకు అవకాశం రాలేదని ఆవేదన చెందిన భర్త రజనీరవి సోమవారం రాత్రి తన చేతిని కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. తీవ్రరక్తస్రావం అవుతుండగా గుర్తించిన ఆయన భార్య అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.అలాగే చెన్నై విరుగంబాక్కం వార్డు కార్యదర్శి ఆర్ శేఖర్ తనకు అవకాశం రాలేదని తెలుసుకుని మంగళవారం తెల్లవారుజాము 5.45 గంటలకు 20 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అన్నాడీఎంకే నామినేషన్లు:అన్నాడీఎంకే అభ్యర్థులు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లలోని 919 వార్డు స్థానాలకు, పంచాయతీల్లోని 638 స్థానాలకు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. అందరూ సరిగ్గా మధ్యాహ్నం 12.05 నుంచి ఒంటి గంటలోగా నామినేషన్లు వేయడం పూర్తి చేశారు. అలాగే చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డులకు మండల కార్యాలయాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులులు నామినేషన్లు వేశారు. బందోబస్తులో లక్ష పోలీసులు:స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, శాంతి భద్రతల నడుమ పూర్తయ్యేలా లక్ష మంది పోలీసులను బందోబస్తు పెడుతున్నట్లు డీజీపీ టీకే రాజేంద్రన్ మంగళవారం ప్రకటించారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలో మొత్తం 7 వేల పోలింగ్ బూతులు ఉండగా వీటిల్లో 300 సమస్యాత్మక పోలింగ్ బూతులను గుర్తించి 12 వేల మంది పోలీసులను బందోబస్తు పెట్టినట్లు తెలిపారు. అలాగే చెన్నై నగర పరిధిలో ముందు జాగ్రత్త చర్యగా 10వేల మంది రౌడీలపై నిఘా పెట్టామని చెప్పారు. తుపాకీ లెసైన్సు దారులు తమ ఆయుధాలను స్వచ్చందంగా అప్పగించాలని ఆయన కోరారు. -
పోస్ట్.. లైక్.. షేర్.. కామెంట్!
హై‘టెక్’ ప్రచారం! గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా శుక్రవారం సాయంత్రం వెల్లడైంది. ఇక పోలింగ్ మార్చి 6వ తేదీ ఆదివారం జరగనుంది. అంతకు ఒకరోజు ముందే 4వ తేదీ సాయంత్రం ప్రచారం నిలిపివేయూల్సి ఉంటుంది. అంటే మధ్యలో సోమవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు అంటే కచ్చితంగా ఐదు రోజుల సమయమే మిగులుతుంది. ఈ సమయంలో డివిజన్లోని ప్రతీ ఓటరును కలవడం అభ్యర్థులకు అసాధ్యమేనని చెప్పాలి. ఎందుకంటే 8వేల నుంచి 14వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఇంతమందిని తక్కువ సమయంలో కలుసుకోవడం సాధ్యం కాదని గుర్తించిన అభ్యర్థులు రకరకాల ఉపాయూలు ఆలోచిస్తున్నారు. ఇందులో నుంచి పుట్టుకొచ్చిందే హై‘టెక్’ ప్రచారం! యువతపైనే దృష్టి ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ప్రచారంలో ఎప్పటికప్పుడు కొత్త విధానం అవలంబించడం మనం చూస్తూనే ఉంటాం. అరుుతే, ఓటర్ల ఇంటికి వెళ్తే ఉద్యోగస్తులు, గృహిణులను కలుసుకోవడం సాధ్యమవుతుంది. కానీ యువతరాన్ని పట్టుకోవాలంటే కొంత కష్టమే. దీనికి విరుగుడుగా వారి మార్గంలోకే వెళ్లి ప్రచారం చేసేం దుకు ‘గ్రేటర్’ అభ్యర్థులు సిద్ధమయ్యూరు. ఇందులో భాగంగా ఇప్పటి యువతరం ఎక్కువగా ఫాలో అయ్యే ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. ఈ ప్రచారం ద్వారా అటు యువతరమే కాదు.. ఆండ్రారుుడ్ ఫోన్లు అందరి చేతుల్లో కనిపిస్తున్నందున మిగతా వర్గాల వారికి కూడా చేరువ కావొచ్చన్నది అభ్యర్థుల భావన. అన్ని వర్గాలకు అనుగుణంగా... జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇందులో సగానికి పైగా నగర పరిధిలో ఉంటారని చెప్పొచ్చు. ఈ మేరకు ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాలు తరచుగా వాడే వారిని కలవడం వీలు కాని పక్షంలో ఆయూ మాధ్యమాల్లో పోస్టులు చేయడం ద్వారా ప్రచారం సులువవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని సోషల్ నెట్వర్క్ సైట్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ ద్వారా తమ ఫొటో, ఏ డివిజన్ నుంచి ఏ పార్టీ ద్వారా పోటీలో ఉన్నాం, తమను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి చేయనున్న కృషిని వివరిస్తూ అభ్యర్థులు పోస్టులు అప్డేట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలు, గ తంలో చేసిన సేవా కార్యక్రమాలు, ఉద్యమంలో పాల్గొన్న ఫొటోలు, తమ పార్టీ గురించి సైతం సోషల్ నెట్ వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు. తమ బయోడేటా మొదలుకుని పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ లైక్‌లు, షేరింగ్‌లు, కామెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికోసం తమ వర్గంలోని యువతను ప్రత్యేకంగా నియమించుకుంటుండడం విశేషం. సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని వారు సైతం తమ కుటుంబంలో ఉన్న యువతీయువకుల సహాయంతో అకౌంట్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ హై‘టెక్’ ప్రచారం అభ్యర్థులకు బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి. అందరికి చేరువయ్యేందుకు... ఇప్పటి యువతీ, యువకుల్లో ఫేస్బుక్ అకౌంట్లు లేని వారు ఉండరు. ప్రచారంలో భాగంగా మేం అందరి గృహాలకు వెళ్లినా యువత దొరకడం లేదు. దీంతో ఫేస్బుక్, వాట్సప్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రచార సరళి, మమ్మల్ని గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ప్రచారానికి సమయం కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా చేసే ప్రచారం చేస్తున్నాం. -
సోనియా చేతిలో... పెద్దల జాబితా
రేపు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు వెల్లడి! సోమవారం నామినేషన్లకు చివరి రోజు కేపీసీపీ చీఫ్‌ను రాజ్యసభకు పంపేలా సీఎం వ్యూహం సమ్మతించని దిగ్విజయ్ సింగ్ శాసన మండలి వైపే పరమేశ్వర మొగ్గు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. బహుశా శనివారం అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. శాసన సభ నుంచి శాసన మండలికి ఏడు స్థానాలు, రాజ్యసభకు నాలుగు స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్ల దాఖలు ఘట్టం సోమవారం ముగియనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు సోనియా గాంధీతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో గురువారం చర్చించారు. అభ్యర్థుల జాబితాను సోనియాకు అందజేశామని, ఎంపికపై ఆమె తుది నిర్ణయం తీసుకుంటారని సీఎం ఢిల్లీలో తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ జాబితా వెలువడుతుందని పరమేశ్వర చెప్పారు. రాజ్యసభకు పరమేశ్వర? ముఖ్యమంత్రితో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పైకి ఎన్ని మాటలు చెబుతున్నా, వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. పరమేశ్వరను శాసన మండలికి పంపడం ద్వారా ఉప ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలోని ఓ వర్గం బలంగా డిమాండ్ చేస్తోంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే, రాష్ట్రంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని సీఎం ఆందోళన చెందుతున్నారు. కనుక పరమేశ్వరను రాజ్యసభకు పంపాలని ఆయన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ వద్ద ప్రస్తావించినప్పుడు, ఆయన సమ్మతించలేదని సమాచారం. పరమేశ్వర కూడా శాసన మండలికే వెళ్లాలనుకుంటున్నారు. మొత్తం ఏడు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ నాలుగు స్థానాలను సునాయాసంగా గెలుచుకోవచ్చు. బీజేపీ, జేడీఎస్‌లకు చెరో స్థానం దక్కే అవకాశాలున్నాయి. ఈ పార్టీల సహకారంతో మరో అభ్యర్థి కూడా ఎగువ సభకు ఎన్నిక కావచ్చు. వేరే రాష్ట్రాల వారికి స్థానం లేదు రాజ్యసభలో నాలుగు స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ సులభంగా రెండు స్థానాలను గెలుచుకోనుంది. బీజేపీ ఓ స్థానాన్ని చేజిక్కించుకోనుంది. కాంగ్రెస్, జేడీఎస్‌ల మద్దతుతో మరో అభ్యర్థి రాజ్యసభలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తమ అభ్యర్థి పోటీలో ఉంటారని జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ప్రకటించారు. కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో తెలిపారు. మ రో వైపు బీజేపీ కూడా కర్ణాటక వాసినే ఎగువ సభకు పంపాలని యోచిస్తోంది. తొలుత కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపిక చేయాలనుకుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ కర్ణాటక వ్య వహారాలను కూడా పర్యవేక్షించే వారు. ఇప్పటికే ఇతర రా ష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పా టు ఆర్. రామకృష్ణలను ఎన్నుకున్నందున, ఈసారి స్థానికులను ఎంపిక చేయాలని పార్టీపై ఒత్తిడి పెరిగింది. కనుక ప్రస్తుతం రిటైర్ కానున్న ప్రభాకర్ కోరెను తిరిగి ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కాగా కాంగ్రెస్ కూడా ప్రస్తుతం రిటైర్ కానున్న ఎస్ఎం. కృష్ణ, బీకే. హరిప్రసాద్‌లను తిరిగి రాజ్యసభకు పంపాలనుకుంటోంది. ఇద్దరికి అభ్యర్థిత్వాలు ఖరారైనట్లేనని చెబుతున్నప్పటికీ, కృష్ణ విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు ఆప్తుడైన కేంద్ర మాజీ మంత్రి సీఎం. ఇబ్రహీంను ఎంపిక చేయించాలని ప్రయత్నిస్తున్నారు. -
రాజకీయం.. గరం గరం..
అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు నామినేషన్ల కోసం సన్నాహాలు చేసుకుంటున్న నేతలు పతాకస్థాయికి చేరిన ప్రచారాలు సమరోత్సాహంతో వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యర్థుల వెతుకులాటలో కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరుపున బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. దీంతో మహాసంగ్రామంలో తలపడే అభ్యర్థులెవరో తేలిపోయింది. జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్లకు సన్నాహాలు చేసుకుంటూనే గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. సమరోత్సాహంలో వైఎస్సార్ సీపీ జిల్లా వ్యాప్తంగా కడప, రాజంపేట లోక్‌సభ, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ఇంతకుమునుపే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు (ప్రస్తుతం పార్టీ అభ్యర్థులు) గడప గడపకు వైఎస్సార్ సీపీ ద్వారా ఓటర్లకు చేరువయ్యారు. సమస్యలపై ఆందోళనలు చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు. దీంతో సొసైటీ, పంచాయతీ ఎన్నికల్లో తమ అనుచరులను గెలిపించుకుని పట్టు సాధించారు. అలాగే మున్సిపల్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరుపున ప్రచారంలో పాల్గొని సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకున్నారు. దీంతో 10 నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు సమరోత్సాహంతో విజయదుందుభి మోగిం చేందుకు సిద్ధమవుతున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి ఈనెల 16వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో ఈనెల 17న అసెంబ్లీస్థానానికి నామినేషన్ వేయనున్నారు. చతికిలపడిన టీడీపీ జిల్లాలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సొసైటీ, పంచాయతీ ఎన్నికల్లో సైతం పార్టీ బొక్కా బోర్లా పడింది. ఆ సమయంలో కార్యకర్తలకు నేతలు వెన్నుదన్నుగా నిలవకపోవడంతో జిల్లాలో పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఒకటి, రెండు నియోజకవర్గాలు తప్ప పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నేతలు ఇప్పటివరకు ప్రచారం చేసిన దాఖలాలు లేవు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కార్యకర్తలకు భరోసా కల్పించి ముందుకు నడపడంలో నేతలు విఫలమయ్యారు. దీంతో సార్వత్రిక ఎన్నికల రంగంలో నిలబడే అభ్యర్థులు ఆపసోపాలు పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపోల్స్‌లో సైతం వైఎస్సార్సీపీదే పైచేయి కావడంతో ఈ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలని తలలు పట్టుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటనలో సైతం జాప్యం టీడీపీ అభ్యర్థులకు శాపంగా మారింది. అయ్యోపాపం కాంగ్రెస్: జిల్లాలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అథః పాతాళానికి వెళ్లింది. పార్టీ తరుపున పోటీ చేసేందుకు నేతలు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికీ పార్టీలోని కొంతమంది వలసబాట పట్టారు. దీంతో కొత్తముఖాలను వెతుక్కోవలసిన దుస్థితి నెలకొంది. కనీసం అభ్యర్థులను నిలబెట్టుకునేందుకు పడరానిపాట్లు పడుతోంది. కడప ఎంపీ స్థానానికి పోటీచేసేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వెతుకులాటలో పడింది. -
ఎంత అన్యాయం ‘బాబూ’
టీడీపీ రాజంపేట అభ్యర్థిగా మేడా... రైల్వేకోడూరుకు వెంకటసుబ్బయ్య నమ్ముకున్నవారికి హ్యాండిచ్చిన చంద్రబాబు రాయచోటి, ప్రొద్దుటూరుకు ఖరారుకాని ‘దేశం’ అభ్యర్థులు టీడీపీ జిల్లా అధ్యక్షుడి టిక్కెట్టుపై తేల్చని చంద్రబాబు ‘వరద’కు ఇప్పించేందుకు సీఎం రమేశ్ ప్రయత్నాలు బాబు తీరుపై మథనపడుతున్న నేతలు టీడీపీ అసెంబ్లీ బరిలోని అభ్యర్థుల జాబితాను మూడు విడతలుగా విడుదల చేసినా 10స్థానాలకు ఖరారు కాలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేరు ఖరారు కాలేదు. ఇతనికి టిక్కెట్టు దక్కకుండా ఇటీవలే ‘పచ్చకండువా’ వేసుకున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఇప్పించేందుకు ఎంపీ సీఎం రమేశ్ ప్రయత్నిస్తున్నారు. రమేశ్ మాయలో పడిన చంద్రబాబు కూడా పార్టీని నమ్ముకున్న లింగారెడ్డిని కాదని ‘వరద’వైపు చూస్తున్నారు. ‘‘లింగారెడ్డిని ‘మ్యానేజ్’ చేసుకో టిక్కెట్టు నీకే’’ అని ‘వరద’తో చెప్పినట్లు తెలిసింది. లింగారెడ్డి, వరద మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది. అచ్చం ఇదే పంచాయతీ రాయచోటిలోనూ జరుగుతోంది. ప్రతిపక్షంలోనూ పార్టీని కాపాడుతూ వచ్చిన పాలకొండ్రాయుడును కాదని ఇటీవల ‘సైకిల్’ ఎక్కిన మాజీ ఎమ్మెల్యే రమేశ్‌రెడ్డికి టిక్కెట్టు దాదాపు ఖాయమైనట్లు తెలిసింది. రమేశ్ సోదరుడు వాసుకు కడప ఎంపీ టిక్కెట్టు ఇచ్చి, తిరిగి రమేశ్‌కు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలనే నిర్ణయంపై పాలకొండ్రాయుడు మండిపడుతున్నారు. పార్టీని నమ్ముకున్న తనకు కాకుండా స్వార్థం కోసం పార్టీలోకి చేరిన రమేశ్‌రెడ్డి కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్లు ఇవ్వడంపై అనుచరుల వద్ద చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీని నమ్మున్న నాయకులకే బాబు న్యాయం చేయలేకపోతే, సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డబ్బుంటునే ‘పచ్చ’ టిక్కెట్టు: మూడో విడత జాబితాలో రాజంపేట, రైల్వేకోడూరు అభ్యర్థులుగా మేడా మల్లిఖార్జునరెడ్డి, ఎస్, వెంకటసుబ్బయ్య పేర్లను బాబు ప్రకటించారు. ప్రభుత్వ లెక్చరర్‌గా ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన అజయ్‌బాబు రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా పార్టీ ఉన్నతి కోసం పాటుపడుతున్నారు. అయితే అజయ్‌బాబు ఆర్థికంగా బలంగా లేరనే కారణంతో ‘డబ్బే’ ప్రామాణికంగా డాక్టర్ వెంకటసుబ్బయ్య(అనస్తీషియా)పేరును ప్రకటించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో ఈయన పేరు కూడా చాలామందికి తెలీదని ఇలాంటి వారికి టిక్కెట్టు ఎలా ఇస్తారని అజయ్‌బాబుతో పాటు ఆయన భార్య సునంద మండిపడినట్లు తెలిసింది. పార్టీని నమ్ముని వస్తే ‘బాబు’ మంచిన్యాయం చేశారని...ఇలాంటి పార్టీలో ఉండాల్సిన పనిలేదని తన భర్తకు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన సునంద మాటలు చూస్తుంటే వారు టీడీపీని వీడే పరిస్థితి ఉందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాజంపేటలో కూడా మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్యకు ఎన్నికల వ్యయాన్ని భ రించే సత్తా లేదని, మేడా మల్లిఖార్జునరెడ్డి అయితే డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెడతారని సీఎం రమేశ్ చెప్పిన మాటల వల్లే ఇక్కడ కూడా ‘మేడా’కు టిక్కెట్టు దక్కింది. దీంతో బ్రహ్మయ్య బోరుమంటున్నారు. తమ్ముళ్ల వైరం...జగన్ సైన్యానికి అదనపు లాభం: ఎలాంటి అసంతృప్తులు, విభేదాలు లేకుండా ఆందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చాలాచోట్ల టీడీపీలోని అసమ్మతిపోరు వైఎస్సార్సీపీకి లాభించనుంది. కమలాపురంలో ఇన్నాళ్లూ ఉప్పు,నిప్పుగా ఉన్న పుత్తా, వీరాశివా వర్గాలు ఇంకా కుదురుకోలేదు. ‘నువ్వు చెప్పినా పుత్తాకు చేసేది లేదు. నష్టపోయింది మేం. నువ్వుకాదు. అని వీరాశివా అనుచరులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.’ దీంతో వీరశివా రాక పుత్తాకు మేలు కంటే కీడే కలుగజేసేలా ఉంది. ఇది వైఎస్సార్సీపీ అభ్యర్థి రవీంద్రనాథరెడ్డికి లాభించనుంది. రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేటలో కూడా అజయ్‌బాబు, పాలకొండ్రాయుడు, బ్రహ్మయ్యలుకూడా తమను కాదని టిక్కెట్లను దక్కించుకున్నవారికి మద్ధతిచ్చే సూచనలు కన్పించడం లేదు. ఈ పరిణామం కూడా కొరముట్ల, ఆకేపాటి, గడికోటలకు మేలు చేయనుంది. ప్రొద్దుటూరులో మాత్రం లింగారెడ్డికి టిక్కెట్టు ఇస్తే...వరద, ‘వరద’కు ఇస్తే లింగారెడ్డి మద్దతు ఇచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో ఇక్కడా వైఎస్సార్సీపీకి మరింత మేలు చేకూరనుంది. డీఎల్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న ‘పుట్టాసుధాకర్‌యాదవ్’ డీఎల్ యూటర్న్‌తో కుదేలైపోయాడు. ఇక్కడ రఘురామిరెడ్డి ఎలాంటి ఆటంకాలు లేకుండా దూసుకుపోనున్నారు. -
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం
వైఎస్సార్ సీపీ జాబితాపై వాసిరెడ్డి పద్మ వెల్లడి హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రకటించిన సీమాంధ్ర లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా చాలా స్పష్టంగా ఉందని, పార్టీకి, ప్రజలకు సేవలందించే అభ్యర్థులకే చోటు లభించిందని చెప్పారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితాలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా తమ నాయకుడు అందరికీ ప్రాధాన్యం లభించేలా చూశారన్నారు. తొలినుంచి ఊహించినట్టుగానే జాబితాలో అభ్యర్థుల పేర్లున్నాయన్నారు. ఈ జాబితాలో ఇటీవల పార్టీలో చేరిన కరణం ధర్మశ్రీ, బూరగడ్డ వేదవ్యాస్, తాజా మాజీ మంత్రి పార్థసారథిలకు ప్రాధాన్యత లభించిందన్న విలేకరుల ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ప్రజలకు సేవలందించే క్రమంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్లనే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఒకరిద్దరు తప్పితే అంతా పాతవాళ్లకే టికెట్లు లభించాయన్నారు. ఇంకా మిగిలివున్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుకు కూడా త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించటం జరుగుతుందన్నారు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పోటీ చేయటం గురించి ప్రస్తావించగా.. విశాఖ ప్రజలు విజయమ్మ పోటీ చేయాలని పట్టుబట్టారని, అందువల్లే ఆమె అక్కడినుంచి పోటీ చేస్తున్నారని పద్మ వివరించారు. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు ఈ జాబితాలో చోటు దక్కలేదన్న విలేకరుల ప్రశ్నకు పద్మ సమాధాన మిస్తూ ఈ విషయం ఇదివరకే షర్మిల స్పష్టం చేశారని, తన కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువు నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరని చెప్పారని తెలిపారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు రామకృష్ణ తమ్ముడు కొణతాల రఘును బరిలోకి దింపామన్నారు. ఒకేసారి దాదాపు అన్ని స్థానాలకూ జాబితా విడుదల చేయటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం తమ పార్టీదేనన్నారు. -
26 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా!
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. మొత్తం 28 స్థానాలకు గాను 26 నియోజక వర్గాలకు పేర్లును ఖరారు చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో శుక్రవారం పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర విలేకరులతో మాట్లాడుతూ జాబితా సిద్ధమైందని, దానిని అధిష్టానం ప్రకటిస్తుందని వెల్లడించారు. చిత్రదుర్గ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయను అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన తొలి నుంచీ విముఖంగా ఉన్నారు. ఎవరిని అభ్యర్థిగా నిలిపినా గెలిపించే పూచీ తనదేనంటూ భరోసా ఇచ్చినా అధిష్టానం ససేమిరా అన్నట్లు తెలిసింది. బెంగళూరు ఉత్తర నియోజక వర్గం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్న అధిష్టానం ఆయనను ఢిల్లీకి పిలిపించింది. అయితే ఇదే నియోజక వర్గంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి పోలింగ్ నిర్వహించడానికి పార్టీ సమాయత్తమవుతోంది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగగా, ముగ్గురు ఆశావహుల నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ఇక ఓటింగ్ జరపాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో అధిష్టానం కృష్ణ బైరేగౌడ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. బెల్గాం జిల్లా చిక్కోడి నుంచి మంత్రి ప్రకాశ్ హుక్కేరిని పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇంకా పలువురు మంత్రులను బరిలోకి దింపాలనుకుంటున్నా, వారి నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు. కేంద్రంలో ఎటూ అధికారంలోకి రాబోమని తెలుసుకున్న మంత్రులు, ఒక వేళ గెలిచినా అక్కడ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని గ్రహించ బట్టే విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. చివరి క్షణంలో మార్పులు జరగకపోతే అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉండవచ్చని సమాచారం. 1. బెంగళూరు దక్షిణ నందన్ నిలేకని 2. బెంగళూరు సెంట్రల్ సీకే. జాఫర్ షరీఫ్ 3. బెంగళూరు గ్రామీణ డీకే. సురేశ్ 4. చిక్కబళ్లాపురం వీరప్ప మొయిలీ 5. కోలారు కేహెచ్. మునియప్ప 6. మండ్య రమ్య 7. మైసూరు హెచ్. విశ్వనాథ్ 8. చామరాజ నగర ధ్రువ నారాయణ 9. ఉడిపి-చిక్కమగళూరు జయప్రకాశ్ హెగ్డే 10. హాసన ఎస్ఎం. ఆనంద్ 11. తుమకూరు ఎస్పీ. ముద్దు హనుమే గౌడ 12. దావణగెరె ఎస్ఎస్. మల్లిఖార్జున 13. ఉత్తర కన్నడ బీకే. హరిప్రసాద్ 14. శివమొగ్గ మంజునాథ్ భండారీ 15. రాయచూరు బీజీ. నాయక్ 16. బళ్లారి ఎన్వై. హనుమంతప్ప 17. కొప్పళ అమరేగౌడ బయ్యాపుర 18. బీదర్ ధరం సింగ్ 19. గుల్బర్గ మల్లిఖార్జున ఖర్గే 20. బిజాపుర ప్రకాశ్ రాథోడ్ 21. హావేరి సలీం అహమద్ 22. దక్షిణ కన్నడ జనార్దన పూజారి 23. బెల్గాం లక్ష్మీ హెబ్బాళ్కర్ 24. చిక్కోడి ప్రకాశ్ హుక్కేరి 25. బాగలకోట అజయ్ కుమార్ సర్నాయక్ 26. ధార్వాడ డీఆర్. పాటిల్