అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు నామినేషన్ల కోసం సన్నాహాలు చేసుకుంటున్న నేతలు పతాకస్థాయికి చేరిన ప్రచారాలు సమరోత్సాహంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభ్యర్థుల వెతుకులాటలో కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరుపున బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. దీంతో మహాసంగ్రామంలో తలపడే అభ్యర్థులెవరో తేలిపోయింది. జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్లకు సన్నాహాలు చేసుకుంటూనే గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు.
సమరోత్సాహంలో వైఎస్సార్ సీపీ
జిల్లా వ్యాప్తంగా కడప, రాజంపేట లోక్‌సభ, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ఇంతకుమునుపే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు (ప్రస్తుతం పార్టీ అభ్యర్థులు) గడప గడపకు వైఎస్సార్ సీపీ ద్వారా ఓటర్లకు చేరువయ్యారు. సమస్యలపై ఆందోళనలు చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు. దీంతో సొసైటీ, పంచాయతీ ఎన్నికల్లో తమ అనుచరులను గెలిపించుకుని పట్టు సాధించారు. అలాగే మున్సిపల్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరుపున ప్రచారంలో పాల్గొని సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకున్నారు. దీంతో 10 నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు సమరోత్సాహంతో విజయదుందుభి మోగిం చేందుకు సిద్ధమవుతున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి ఈనెల 16వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో ఈనెల 17న అసెంబ్లీస్థానానికి నామినేషన్ వేయనున్నారు.
చతికిలపడిన టీడీపీ
జిల్లాలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సొసైటీ, పంచాయతీ ఎన్నికల్లో సైతం పార్టీ బొక్కా బోర్లా పడింది. ఆ సమయంలో కార్యకర్తలకు నేతలు వెన్నుదన్నుగా నిలవకపోవడంతో జిల్లాలో పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఒకటి, రెండు నియోజకవర్గాలు తప్ప పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నేతలు ఇప్పటివరకు ప్రచారం చేసిన దాఖలాలు లేవు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కార్యకర్తలకు భరోసా కల్పించి ముందుకు నడపడంలో నేతలు విఫలమయ్యారు. దీంతో సార్వత్రిక ఎన్నికల రంగంలో నిలబడే అభ్యర్థులు ఆపసోపాలు పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపోల్స్‌లో సైతం వైఎస్సార్‌సీపీదే పైచేయి కావడంతో ఈ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలని తలలు పట్టుకుంటున్నారు.
అభ్యర్థుల ప్రకటనలో సైతం జాప్యం టీడీపీ అభ్యర్థులకు శాపంగా మారింది. అయ్యోపాపం కాంగ్రెస్: జిల్లాలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అథః పాతాళానికి వెళ్లింది. పార్టీ తరుపున పోటీ చేసేందుకు నేతలు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికీ పార్టీలోని కొంతమంది వలసబాట పట్టారు. దీంతో కొత్తముఖాలను వెతుక్కోవలసిన దుస్థితి నెలకొంది. కనీసం అభ్యర్థులను నిలబెట్టుకునేందుకు పడరానిపాట్లు పడుతోంది. కడప ఎంపీ స్థానానికి పోటీచేసేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వెతుకులాటలో పడింది.
రాజకీయం.. గరం గరం..
Published Tue, Apr 15 2014 3:49 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement