బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. మొత్తం 28 స్థానాలకు గాను 26 నియోజక వర్గాలకు పేర్లును ఖరారు చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో శుక్రవారం పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర విలేకరులతో మాట్లాడుతూ జాబితా సిద్ధమైందని, దానిని అధిష్టానం ప్రకటిస్తుందని వెల్లడించారు.
చిత్రదుర్గ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయను అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన తొలి నుంచీ విముఖంగా ఉన్నారు. ఎవరిని అభ్యర్థిగా నిలిపినా గెలిపించే పూచీ తనదేనంటూ భరోసా ఇచ్చినా అధిష్టానం ససేమిరా అన్నట్లు తెలిసింది. బెంగళూరు ఉత్తర నియోజక వర్గం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్న అధిష్టానం ఆయనను ఢిల్లీకి పిలిపించింది. అయితే ఇదే నియోజక వర్గంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి పోలింగ్ నిర్వహించడానికి పార్టీ సమాయత్తమవుతోంది.
శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగగా, ముగ్గురు ఆశావహుల నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ఇక ఓటింగ్ జరపాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో అధిష్టానం కృష్ణ బైరేగౌడ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. బెల్గాం జిల్లా చిక్కోడి నుంచి మంత్రి ప్రకాశ్ హుక్కేరిని పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇంకా పలువురు మంత్రులను బరిలోకి దింపాలనుకుంటున్నా, వారి నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు. కేంద్రంలో ఎటూ అధికారంలోకి రాబోమని తెలుసుకున్న మంత్రులు, ఒక వేళ గెలిచినా అక్కడ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని గ్రహించ బట్టే విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. చివరి క్షణంలో మార్పులు జరగకపోతే అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉండవచ్చని సమాచారం.
1. బెంగళూరు దక్షిణ నందన్ నిలేకని
2. బెంగళూరు సెంట్రల్ సీకే. జాఫర్ షరీఫ్
3. బెంగళూరు గ్రామీణ డీకే. సురేశ్
4. చిక్కబళ్లాపురం వీరప్ప మొయిలీ
5. కోలారు కేహెచ్. మునియప్ప
6. మండ్య రమ్య
7. మైసూరు హెచ్. విశ్వనాథ్
8. చామరాజ నగర ధ్రువ నారాయణ
9. ఉడిపి-చిక్కమగళూరు జయప్రకాశ్ హెగ్డే
10. హాసన ఎస్‌ఎం. ఆనంద్
11. తుమకూరు ఎస్‌పీ. ముద్దు హనుమే గౌడ
12. దావణగెరె ఎస్‌ఎస్. మల్లిఖార్జున
13. ఉత్తర కన్నడ బీకే. హరిప్రసాద్
14. శివమొగ్గ మంజునాథ్ భండారీ
15. రాయచూరు బీజీ. నాయక్
16. బళ్లారి ఎన్‌వై. హనుమంతప్ప
17. కొప్పళ అమరేగౌడ బయ్యాపుర
18. బీదర్ ధరం సింగ్
19. గుల్బర్గ మల్లిఖార్జున ఖర్గే
20. బిజాపుర ప్రకాశ్ రాథోడ్
21. హావేరి సలీం అహమద్
22. దక్షిణ కన్నడ జనార్దన పూజారి
23. బెల్గాం లక్ష్మీ హెబ్బాళ్‌కర్
24. చిక్కోడి ప్రకాశ్ హుక్కేరి
25. బాగలకోట అజయ్ కుమార్ సర్నాయక్
26. ధార్వాడ డీఆర్. పాటిల్