నౌక మునక : 13 మంది మృతి
మనగ్వా : నికరాగ్వా లిటిల్ కర్న్ ద్వీపం సమీపంలోని కరేబియన్ సముద్రంలో పర్యాటకులను తీసుకు వెళ్తున్న చిన్ననౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది కోస్టరికన్స్ మరణించారు. ఈ మేరకు నికరాగ్వా అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. నౌకలో మొత్తం 32 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. వారిలో పలువురిని రక్షించి... సమీపంలోని బిగ్ కార్న్ ద్వీపానికి తరలించినట్లు చెప్పారు. పర్యాటకులంతా యూఎస్‌కి చెందినవారని పేర్కొన్నారు.
మృతుల్లో తొమ్మిది మంది కోస్టరికా పౌరులు ఉన్నారని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే ఇద్దరు యూఎస్ వాసులని చెప్పారు. బలమైన గాలులు వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంది. అయితే నౌక కెప్టెన్‌ను అరెస్ట్ చేసి... విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.