వైకల్యంతో పుట్టిందని.. కడతేర్చాలని చూశాడు
హైదరాబాద్: ఐదు రోజుల పసికందును కడతేర్చాలని చూశాడో కసాయి దండ్రి. తల్లికి తెలియకుండానే కడతేర్చాలని చూశాడు. ఆడ పిల్ల పుట్టిందని అందులోను అవిటి (పోలీయో) అయిందని గ్రహించిన ఆ తండ్రి ఎలాగైనా బిడ్డను వదిలించుకుందామనుకున్నాడు. ఐదు రోజుల బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా తల్లి పోత్తిళ్ల నుంచి తీసుకొచ్చి ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఎదురుగా గల నాలాలో పడేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. సరూర్‌నగర్ కర్మాన్‌ఘాట్‌కు చెందిన జిల్లా జగదీశ్వర్(35) నాంపల్లి ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రతిమ(30) వీరికి ఒక బాబు ఉన్నాడు.
కాగా ఈ నెల 21వ తేదీన ప్రసవం కొరకు చైతన్యపురిలోని స్వప్న ఆస్పత్రిలో జాయిన్ అయింది. అదే రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆడపిల్ల అవిటిగా (పోలీయో ఎఫెక్ట్) తో పుట్టడంతో ఎలాగైనా వదిలించుకుందామనుకున్నాడు ఆ తండ్రి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం బిడ్డను ఆస్పత్రి నుండి తీసుకొని బస్సులో ఉప్పల్ ఏషియన్ థియేటర్‌కు చేరుకున్నాడు. పొత్తిళ్ల బిడ్డను మూసి కాలువలో పడేయడానికి తండ్రి జగదీశ్వర్ ప్రయత్నిస్తుండగా ఈ విషయాన్ని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పసిగట్టి 100కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆ లోపు స్థానికులను పోగు చేసిన ఉద్యోగి అతడిని పట్టుకొని పోలీసులు వచ్చేవరకు నిలువరించాడు. పోలీసులు వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకొని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.