పోలింగ్‌కు తరలిన సీమాంధ్ర ఓటర్లు
- ప్రత్యేక బస్సులు నడిపిన ఏపీఎస్ ఆర్టీసీ
- పలు బస్సులు ఎన్నికల విధులకు
- ఉన్న బస్సుల్లోనే నిలబడి స్వస్థలాలకు
బెంగళూరు, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో బుధవారం పోలింగ్‌ను పురస్కరించుకుని ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో సొంత ఊర్లకు తరలి వెళ్లారు. మంగళవారం ఉదయం నుంచే గమ్య స్థానాల వైపు పయనమయ్యారు. మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, తంబళ్లపల్లి, పలమనేరు, శ్రీకాళహస్తి, హిందూపురం, కడప, ప్రొద్దుటూరు, కావలి, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రొద్దుటూరుకు ఆరు (మూడు కడప మార్గం, మూడు కదిరి మార్గం), నంద్యాల -2, విజయవాడ-5, నెల్లూరు-5, ఒంగోలుకు-1 చొప్పున రిజర్వేషన్ సౌకర్యంతో ప్రత్యేక బస్సులను నడిపింది.
వీటితో పాటే కదిరి, అనంతపురం, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాలకు 40 ప్రత్యేక సర్వీసులు నడిపామని ఏపీఎస్ ఆర్టీసీ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్ర నాథ రెడ్డి తెలిపారు. ఎక్కువ బస్సులను ఎన్నికల విధులకు తరలించినందున ప్రయాణికులకు సరిపడా బస్సులను సమకూర్చడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. చాలా మంది నిలబడే వెళ్లారని చెప్పారు. ఎన్నికలు అదనుగా ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలను అమాంతం పెంచేశారు. ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండటం, ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు ఎక్కువ కావ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.