మద్యం వ్యాపారంలో వాటాలకోసం పోటీ
తమ మాట వినని వారి దుకాణాలకు తాళం
అధికారం అండతో అధికారులపై ఒత్తిళ్లు
సతమతమవుతున్న ఎక్సైజ్ శాఖ సిబ్బంది
అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతి పనిలోనూ వాటాలకు పోటీపడుతున్నారు. తమ మాట వినని వారిని తమదైన శైలిలో బెదరిస్తున్నారు. అవసరమైతే అధికారులతో ఒత్తిళ్లు తెప్పించి తమ దారికి తెచ్చుకుంటున్నారు. అప్పటికీ మాట వినకపోతే వ్యాపారం చేసుకోకుండా అడ్డుతగుతున్నారు. కళ్యాణదుర్గంలో తముళ్ల రుబాబు మరీ ఎక్కువైంది. మద్యం దుకాణాలలో భాగస్వామ్య వాటాల కోసం టీడీపీ ముఖ్య నేత అనుచరులు ఏకంగా బెదిరింపులకు దిగారు. వాటాలు ఇవ్వకపోతే వ్యాపారాల చేయకూడదంటూ మద్యం దుకాణాలకు తాళాలు వేశారు.
కళ్యాణదుర్గం పట్టణంలో ఆరు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో మూడు దుకాణాలు టీడీపీకి కోటరీకే దక్కాయి. మరొక దుకాణం టీడీపీ మాజీ ప్రజాప్రతినిధికి దక్కింది. మిగిలిన రెండు దుకాణాలను ఇతరులు టెండర్లలో దక్కించుకున్నారు. అయితే ఈ రెండు దూకాణాల్లో వాటా ఇవ్వాలంటూ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత అనుచరులు బెదరింపులకు దిగుతున్నారు. అనంతపురం రహదారిలోని దుకాణంలో 50 శాతం వాటా ఇవ్వాలని సదరు టీడీపీ నేతలు దుకాణం దక్కించుకున్న వ్యక్తికి వర్తమానం పంపారు. వాటా ఇవ్వకపోతే దుకాణం నడుపుకోలేరని హెచ్చరించారు.
అయితే వాటా ఇచ్చేందుకు దుకాణం నిర్వాహకుడు విముఖత వ్యక్తం చేయడంతో ఏకంగా దుకాణానికి తాళాలు వేశారు. తమకు వాటా ఇచ్చేదాకా వ్యాపారం చేసుకోనివ్వబోమని హెచ్చరించారు. అంతేకాదు ముఖ్యనేత ద్వారా ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి చేయించి..మద్యం దుకాణం పాఠశాలకు దగ్గరలో ఉందని పదే పదే కొలతలు తీయిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లలో రెండో రోజులు ఎక్సైజ్ సీఐ సృజన్బాబు, ఎస్ఐ ఫరూక్లు పదే పదే కొలతలు తీసి విసిగిపోయారు. అధికార పార్టీ నేతను ఒప్పించలేక, మరో వైపు టెండర్లలో దుకాణం దక్కించుకున్న వ్యక్తికి సహాయం చేయలేక సతమతమవుతున్నారు. చివరికి సోమవారం అనంతపురం రహదారిలోని దుకాణానికి సంబంధించిన నివేదకను పెనుకొండ ఎక్సైజ్ అధికారులకు పంపించారు.
అదే విధంగా పాత బస్టాండ్ ముఖద్వారంలోని ఎడమ వైపు ఉన్న మద్యం దుకాణం యజమానికి కూడా ఇలాంటి బెదిరింపులే ఎదురైనట్లు సమాచారం. ఇక్కడ కూడా 50 శాతం వాటా కోసం ముఖ్యనేత అనుచరులు హూకూం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో సదరు దుకాణ యజమానులు దారికి రాకపోవడంతో మద్యం దుకాణం పాఠశాలలకు సమీపంలో ఉందని ఎక్సైజ్ అధికారుల చేత కొలతలు వేయిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో సదరు రెండు దుకాణాల యజమానులు రెండు రోజులుగా వ్యాపారాలు ప్రారంభించలేదు.
అదేవిధంగా శెట్టూరులో కూడా టీడీపీ ముఖ్య నేతలు మద్యం దుకాణంలో వాటా కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలించకపోవడంతో నిబంధనల పేరుతో అక్కడి మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని తహసీల్దార్ వాణిశ్రీపై ఒత్తిళ్లు తెచ్చారు. ఈమేరకు ఓ ఫిర్యాదు కూడా ఆమెకు అందజేశారు. టీడీపీ నేతల బరితెగింపు దౌర్జన్యాలను చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు.