ఉగ్రవాదిని సీక్రెట్‌గా బొందపెట్టాడు
లండన్: బ్రిటన్‌లోని ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిపై వాహనంతో మారణకాండకు పాల్పడిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఉగ్రవాది ఖుర్రం షాద్ బట్‌ను రహస్యంగా ఖననం చేశారు. లండన్‌లోని ఏ స్మశాన వాటిక కూడా అతడిని ఖననం చేసేందుకు అనుమతించకపోవడంతో చివరకు అతడి బంధువు అయిన ఓ 27 ఏళ్ల వ్యక్తి చివరకు అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి తూర్పులండన్‌లోని అతడి ఇంటికి సమీపంలోని ఓ స్మశానవాటికకు రహస్యంగా తీసుకెళ్లి ఎలాంటి హడావుడి, అంత్యక్రియలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు లేకుండా చకచకా పూడ్చిపెట్టినట్లు సండే మిర్రర్ తెలిపింది.
అయితే, ఉగ్రవాదిగా అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులు తీవ్రంగా చిరాకు పడటంతో వాళ్లెవరూ కూడా అంత్యక్రియలకు హాజరుకాలేదట. అంతేకాకుండా, ఎలాంటి ఆడంబరంగా అతడి అంత్యక్రియలు నిర్వహించినా మిగితా వారి దృష్టిలో తమ కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఇలా చేయాల్సి వచ్చిందని కూడా ఆ పత్రిక వివరించింది. పూడ్చిపెట్టిన వ్యక్తికి తప్ప ఎవరికీ కూడా అతడి సమాధి ఎక్కడుందో తెలియదట.