మొబైల్ పోయిందని.. మైనర్లపై పాశవికం!
లోని: పేరుమోసిన రాజకీయ నాయకుడి తమ్ముడొకడు మైనర్ల పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. ముగ్గురినీ కొట్టంలో బంధించి, బర్రెలకు వాడే సిరంజిలతో మర్మాయవాల్లోకి పెట్రోల్ ను ఇంజెక్ట్ చేశాడు. వాట్పప్ ప్రచారంతో వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా లోని పట్టణ మాజీ అధ్యక్షుడు, సమాజ్ వాది పార్టీకి చెందిన హజి ఎహసాన్ షురేషీకి స్థానికంగా పెద్ద సంఖ్యలో పశువుల దొడ్లు ఉన్నాయి. అతని తమ్ముడు రిజ్వాన్ ఖురేషి వాటిని నిర్వహిస్తూఉంటాడు. కొద్ది రోజుల కిందట రిజ్వాన్ ఖరీదైన మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. ఈ ఘటన జరిగిన సమయంలో గొడ్ల కొట్టం సమీపంలో తచ్చాడుతూ కనిపించిన తొమ్మిది మందిని రిజ్వాన్, అతని అనుచరులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిపై(16, 17 ఏళ్ల మైనర్లు ఇద్దరు, 24 ఏళ్ల మరో యువకుడు) అనుమానం బలపడటంతో చిత్రహింసలకు హింసలకు గురిచేశారు. మొబైల్ దొంగతనాన్ని ఒప్పుకోవాలంటూ వాళ్ల మలద్వారం గుండా పెట్రోల్ ను ఇంజెక్ట్ చేశారు. బర్రెలకు వినియోగించే సిరంజిలతో సున్నితమైన భాగంలో పెట్రోల్ ఎక్కించడంతో ఆ ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాధితుల్లో ఒకరి బంధువు ఈ ఘాతుకాన్ని వాట్సప్ ద్వారా వెలుగులోకి తెచ్చాడు. లోని ప్రాంతమంతా దీనికి సంబంధించిన వీడియోలు షేర్ అయ్యాయి. అలా సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో మైనర్లిద్దరూ చికిత్స పొందుతుండగా, మరో యువకుడు లోనిలోని ఆసుపత్రిలో చేరాడు. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పెట్రోల్ ప్రభావం వల్ల మలద్వారం వద్ద శాశ్వత సమస్యలు ఏర్పడతాయని డాక్టర్లు చెప్పారు.
బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రిజ్వాన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని రిజ్వాన్ అన్న హజీ ఎహసాన్ ఖురేషీ ఆరోపిస్తున్నారు. మొబైల్ పొయిన తర్వాత తమ్ముడు(రిజ్వాన్) ఆ ముగ్గురినీ పిలిపించింది వాస్తవమే, చెప్పదెబ్బో, బెత్తంతోనో కొట్టి ఉండొచ్చు తప్ప పెట్రోల్ ఇంజెక్ట్ చేయలేదు. మొబైల్ దొంగిలించినట్లు ఒప్పుకున్న తర్వాత ఆ ముగ్గురిని విడిచిపెట్టారు. ఇది జరిగిన తర్వాతి రోజు ప్రతిపక్షాలు కలుగజేసుకుని కావాలని విషయాన్ని పెద్దది చేశాయని ఎహసాన్ అంటున్నారు.