లార్డ్ ఆఫ్ ది ఆస్కార్స్
లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్
బి. విఠలాచార్య తెలుసా? మాయలు, మంత్రాలు, కత్తులు, బాణాల ఫైటింగులకు క్రేజ్ తెచ్చిన దర్శక మొనగాడు. హాలీవుడ్ చిత్రం ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ చూస్తుంటే, అచ్చంగా మనకు బ్లాక్ అండ్ వైట్ విఠలాచార్య సినిమాలు గుర్తుకురాకపోతే ఒట్టు!
అందుకే, పిల్లల నుంచి పెద్దల దాకా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది - ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’. ఇది మొత్తం మూడు భాగాల సిరీస్. వాటిలో మూడోదీ, ఆఖరుదీ ఈ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’. పుష్కరకాలం క్రితం విడుదలైన ఈ థర్డ్ పార్ట్ది అరుదైన రికార్డ్! అకాడమీ అవార్డులు ఆరంభమైన తరువాత అత్యధిక సంఖ్యలో (11) ఆస్కార్ అవార్డులు అందుకున్న సినిమాలు - ‘బెన్హర్’ (1959), ‘టైటానిక్’ (1997). ఆ తరువాత మళ్ళీ ఇదే. ‘ఉత్తమ చిత్రం’తో సహా నామినేటైన 11 కేటగిరీల్లోనూ ఆస్కార్ అవార్డుల్ని స్వీప్ చేసింది.
ఇది మామూలుగా ఆస్కార్స వచ్చే చిత్రాలకు భిన్నమైన సినిమా. మరుగుజ్జులు, మనుషులలానే కనిపిస్తూ పాదాలకు జుట్టుండే మూడడుగుల మనుషులైన వారి హాబి ట్లు, అతీతశక్తులుండే చిట్టి పొట్టి జంతువులు, మ్యాజిక్ రింగులతో నిండిన ఫ్యాంటసీ. నటీనటులు కూడా జనానికి తెలిసినవాళ్ళేమీ కాదు. లో-బడ్జెట్ హార్రర్ చిత్రాలు తీసే ఫిల్మ్ మేకరేమో (పీటర్ జాక్సన్) దర్శకుడు. పైగా, సినిమాలకు అవార్డులొచ్చే లాస్ ఏంజెల్స్‌కు దూరంగా రచన, చిత్రీకరణ, ఎడిటింగ్ - మొత్తం న్యూజిలాండ్‌లో జరిగాయి. అయినాసరే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఆస్కార్లు గెలుచుకుంది.
నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాపీలు అమ్ముడైన నవలల్లో ఒకటి -‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’. జాన్ రొనాల్డ్ రూయెల్ టోల్కిన్ మొత్తం మూడు సంపుటాలుగా ఈ నవల రాశారు. ఈ నవలను సినిమా కన్నా ముందే రేడియాలో, రంగస్థలం మీద వేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1937 నుంచి 1949 మధ్య ఈ రచన సాగింది.
మిడిల్ ఎర్త్ ప్రాంతంలో... ఎల్విష్ భాష మాట్లాడే కొన్ని జాతుల మధ్య జరిగినట్లుగా టోల్కిన్ ఈ కాల్పనిక కథను అల్లారు. నవలా రచయిత టోల్కిన్కు ఒక అలవాటుంది. ప్రపంచంలో కనుమరుగైపోతున్న భాషలను దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం ఉన్న భాషల ప్రాథమిక సూత్రాలనూ, మాండలికాలనూ వాడుకుంటూ, వాటికి తన ఆలోచన జోడించి, సరికొత్త భాషలో కవితలు, పాటలు రాయడం ఆయన హాబీ. ఈ నవలలో యువరాణి ఆర్వెన్ పాత్రధారిణి మాట్లాడేది - ఎల్విష్ భాష. షూటింగ్లో ఆ పాత్రధారిణికి ఈ భాష నేర్పడానికి సెట్స్ మీదే ఒక కోచ్‌ను పెట్టారు. వాళ్ళిద్దరికీ అర్థం కానిది ఏమైనా ఉంటే వివరించడానికి ఒక నిపుణుణ్ణి అమెరికాలో సిద్ధంగా ఉంచారు.
అసలీ ప్రసిద్ధ నవలను సినిమాగా తీయాలని 1969లోనే హక్కులు తీసుకున్నారు. అప్పటికే సైన్స్ ఫిక్షన్ సినిమా ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’తో దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్ ఒక సంచలనం. ఆయనతో ఈ నవలను తెరకెక్కించాలనుకున్నారు. కానీ, బోలెడన్ని పాత్రలు, చాంతాడంత కథ ఉన్న ఇంత నవలను చిన్న సినిమాగా కుదించలేమంటూ నో చెప్పారట. మంచికో, చెడుకో అలా ఆగిన ఆ వెండితెర కల 30 ఏళ్ళ తరువాత పీటర్ జాక్సన్ దర్శకత్వంలో నిజమైంది.
‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ మూడు పార్ట్‌లుగా వచ్చినా, తీయడం మాత్రం అన్నీ ఒకేసారి తీసేశారు. ఏణ్ణర్ధం పాటు ఏకధాటిగా షూటింగ్ జరిపారు. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ, ఒక్కో పార్ట్‌గా రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏమో - ‘ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్’. రెండో పార్టేమో - ‘ది టు టవర్స్’. నవలలోని రెండు, మూడు సంపుటాలను కలిపి ఈ మూడో పార్ట్ సినిమా ‘ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ తీశారు. న్యూజిలాండ్‌లో వందకు పైగా వేర్వేరు లొకేషన్స్... 350కి పైగా సెట్స్ వాడారు. ఈ లొకేషన్స్‌కు యాక్టర్లనీ, టెక్నీషియన్లనీ హెలికాప్టర్లో తరలించేవారు.
సుదీర్ఘంగా సాగిన షూటింగ్లో, యుద్ధ సన్నివేశాల్లో దెబ్బలు తగలనివాళ్ళంటూ లేరు. కిందపడ్డారు. కాళ్ళు మెలికపడ్డాయి. వేళ్ళు విరిగాయి. కండరాలు పట్టేశాయి. వాపులు... గాయాలు... రక్తాలు... అయినా సరే ఆగకుండా సినిమా చేశారు. ఆ కష్టం వృథా కాలేదు. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఫస్ట్ పార్ట్ ప్రీమియర్ షో వేశారు. జనంలోకి సినిమా వెళ్ళీవెళ్ళగానే ఆ చిత్రంలోని ప్రధాన పాత్రధారులందరూ రాత్రికి రాత్రికి జనంలో సూపర్స్టార్లైపోయారు.
‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సిరీస్‌లో మూడు సినిమాలూ గొప్పగా ఉంటాయి. మూడింటికీ బోలెడన్ని అవార్డులు వచ్చాయి. ఈ సినిమాల కోసం కాస్ట్యూమ్, మేకప్ బృందాలు వెయ్యి యుద్ధ కాస్ట్యూమ్‌లు చేశాయి. ముఖానికి 10 వేల ప్రోస్థెటిక్స్ చేశారు. ఏకంగా 1800 హాబిట్ పాదాల తయారీ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’కు ఎక్కింది.
ఒక్క మూడో పార్ట్‌లో దాదాపు 1500 విజువల్ ఎఫెక్ట్ షాట్స్ ఉన్నాయి. ఒక్కో పార్ట్ రిలీజైన కొద్దీ ఈ సిరీస్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. 2003 చివరలో మూడో పార్ట్ వచ్చింది. ప్రపంచ సినీ చరిత్రలో 100 కోట్ల డాలర్లు వసూలు చేసిన రెండో సినిమా ఇదే. మూడో పార్ట్‌లో 1700 మందికి పైగా పేర్లు రోలింగ్ టైటిల్స్‌లో వస్తాయి. ఆ టైటిల్స్ నిడివే - తొమ్మిదిన్నర నిమిషాలు. అంత మంది శ్రమకు ఫలితమైన ఈ సినిమా ఇవాళ చూసినా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. వీలుంటే చూడండి. సమ్మర్లో 3 పార్ట్‌లూ ఒక దాని తరువాత ఒకటిగా పిల్లలకూ డి.వి.డి.లో చూపెట్టండి.
- రెంటాల