Lorries seized
-
ఇసుక స్థావరాలపై దాడులు
చిన్నకోడూరు(సిద్దిపేట) : అక్రమ ఇసుక స్థావరాలపై ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 3లారీలను, ఒక ట్రాక్టర్, ఒక టిప్పర్‌ను సీజ్ చేశారు. మండల పరిధిలోని అల్లీపూర్ శివారులో రహస్య ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమచారం అందుకున్న సిద్దిపేట రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్‌లు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. ఇసుక డంప్‌లు నిర్వహిస్తున్న నిర్వాహకులు అనిల్, సంతోష్, బాలయ్య, తిరుపతిరెడ్డి, మహేందర్‌లపై కేసునమోదు చేశారు. అనిల్‌కు సంబంధించిన టిప్పర్ సీజ్ చేశారు. అలాగే సిరిసిల్ల రాజన్న జిల్లా కొదురుపాక క్వారీ నుంచి హైదరాబాద్ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3లారీలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్‌లు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా ఇసుక నిల్వలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే అక్రమ వ్యాపారాలు కొనసాగించినా వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. -
రెండు టిప్పర్లు, పొక్లెయినర్ సీజ్
జూలూరుపాడు : మట్టి అక్రమ తవ్వకాలపై జూలూరుపాడు తహసీల్దార్ వి.సురేష్‌కుమార్ కొరడా ఝుళిపించారు. కాకర్ల రెవిన్యూ గ్రామంలోని పాలగుట్ట సమీపంలో శనివారం అర్థరాత్రి పొక్లెయినర్‌తో అక్రమంగా తవ్వకాలు జరుపుతూ టిప్పర్లతో మట్టిని తరలిస్తుండగా తహసీల్దార్ వి.సురేష్‌కుమార్, రెవిన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి అడ్డుకున్నారు. కాకర్ల రెవిన్యూ గ్రామంలో 82 సర్వే నంబర్‌లోగల ప్రభుత్వ సీలింగ్ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు పొక్లెయినర్‌తో మట్టి తవ్వి, చండ్రుగొండ మండలంలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి తరలిస్తున్నారు. ప్రభుత్వ సీలింగ్ భూమిలో సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల విషయం తెలుసుకున్న తహసీల్దార్ అక్కడకు వెళ్లారు. తవ్వకాలను అడ్డుకున్నారు. పొక్లెయినర్, రెండు టిప్పర్లు స్వాధీనపర్చుకుని సీజ్ చేశారు. పొక్లెయినర్‌ను తరలించే అవకాశం లేకపోవడంతో దానిని కాకర్ల గ్రామంలో నిలిపేశారు. టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేయాలని ఎస్సై ఇళ్ల రాజేష్‌తో చెప్పారు. -
ఏలూరులో 14 ఇసుక లారీలు సీజ్
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలోని తూర్పు లాకుల వద్ద 14 ఇసుక లారీలను పోలీసులు శనివారం ఉదయం సీజ్ చేశారు. గత కొద్ది రోజులుగా తూర్పు లాకుల వద్ద నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ముందస్తు సమాచారంతో ఏలూరు పట్టణ సీఐ నాగమురళి తన సిబ్బందితో శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా14 ఇసుక లారీలు సీజ్ చేశారు. -
రూ.కోటి విలువైన ఎర్రచందం పట్టివేత
చిత్తూరు జిల్లా శేషాచల కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులపై దాడి చేసిన నేపథ్యంలో వారి ఆట కట్టించేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగారు. అందులోభాగంగా రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో పలు చెక్‌పోస్ట్‌లు, జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తు, దాడులు చేస్తున్నారు. అందులోభాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట సమీపంలో అక్రమంగా రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అనంతరం స్మగ్లర్లతోపాటు లారీలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి, లారీలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ. కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో 10 ఎర్రచందనం దుంగలను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.