అదుపుతప్పిన పాఠశాల బస్సు..
విద్యార్థులకు తప్పిన ముప్పు
– పెద్దవూర మండలం లింగపల్లి సమీపంలో ఘటన
పెద్దవూర
అదుపుతప్పి ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బండరాయిపై ఒరిగింది. విద్యార్థులకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు..అనుముల మండలం హాలియాకు చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు ప్రతి రోజు మండలంలోని పెద్దవూర, బట్టుగూడెం, ముసలమ్మచెట్టు, చింతపల్లిస్టేజీ, తెప్పలమడుగు, లింగంపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకుని బయల్దేరింది. ఈ క్రమంలో లింగంపల్లి గ్రామం దాటగానే పాఠశాల బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ బ్రేక్‌లు వేసే ప్రయత్నం చేసినా కుడివైపు దూసుకుపోయి రోడ్డు పక్కనున్న పెద్ద బండరాయిని తాకుతూ ఐదడుగుల గుంతలోకి వెళ్లింది. గుంతలోనూ పెద్ద బండరాయిని ఢీ కొని ఆగిపోయి మరో బండరాళ్ల గుట్టపై ఒరిగిపోయింది.
బండరాళ్లే కాపాడాయి..
అదుపుతప్పి రోడ్డు దిగి పంటపొలాలలోకి వెళ్తున్న బస్సు బోల్తా కొట్టకుండా రైతు తమ పొలంలోని బండరాళ్లను వేసినబండరాళ్లే కాపాడాయి. సుమారు ఐదడుగుల లోతులో ఉన్న గుంతలోకి దూసుకుపోయిన బస్సు బండరాళ్లను ఢీ కొని ఆగిపోవడమే గాక మరో రాళ్ల గుట్టపై ఒరిగిపోయింది. లేదంటే బస్సు రెండు, మూడు ఫల్టీలు కొట్టి పెను ప్రమాదమే జరిగి ఉండేది. కొంచెం ముందుకు వెళ్లి ఉంటే 33/11 కేవీ విద్యుత్ స్తంభానికి ఢీ కొనేది. అదే జరిగితే భారీగా ప్రాణనష్టం సంభవించేది. బండరాళ్లే దేవుడి రూపంలో తమ పిల్లల ప్రాణాలను కాపాడాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
బర్త్ డే సంబరాల్లో విద్యార్థులు
మండల కేంద్రానికి చెందిన కాటెపల్లి శ్రావణిది బుధవారం పుట్టినరోజు. దీంతో బస్సులోని విద్యార్థులందరికీ చాక్లెట్లు పంచిపెడుతోంది. విద్యార్థులంతా హ్యాపీ బర్త్‌డే టు యూ అంటూ సంబరాలు చేసుకుంటు చాక్లెట్లు తింటున్నారు. అంతలోనే స్టీరింగ్ రాడ్ విరిగిపోవడం బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బండరాయిని పెద్ద శబ్దంతో ఢీ కొడుతూ కిందికి దూసుకెళ్లటం గుంతలో మరో బండరాయిని ఢీ కొని ఒరిగిపోయి మరో రాళ్లగుట్టపై పడి ఒకరిపై ఒకరు పడటం క్షణాల్లో జరిగిపోయాయి. ఏం జరుగుతుందో బస్సులో ఉన్న విద్యార్థులకు తెలియని అయోమయ పరిస్థితి. ఒక్కసారిగా ఏడుపులు మిన్నంటాయి. డ్రైవర్ బస్సులోంచి బయటకు వచ్చి పిల్లలను బయటకు తీసే ప్రయత్నాలు చేశాడు. పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు, రోడ్డున వెళ్తున్న ప్రయాణికులు వచ్చి బస్సులో ఉన్న విద్యార్థులందరినీ బయటకు తీశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ద్విచక్రవాహనాలు, ఆటోలలోనూ సంఘటన స్థలానికి చేరుకుని ఏడుస్తున్న పిల్లలను దగ్గరకు తీసుకుని హత్తుకుని ఉద్వేగానికి గురయ్యారు. అంతా క్షేమంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్కడికి వచ్చిన పాఠశాల యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడటంతోనే ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు. 25 మంది విద్యార్థులను ఎక్కించాల్సిన బస్సులో 70 పైగా విద్యార్థులను ఎక్కించుకోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఎస్ఐ ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని బస్సులో ఉన్న విద్యార్థుల స్కూల్ బ్యాగ్స్, టిఫిన్ బాక్స్‌లను తీయించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.
ఫిట్నెస్ ఏమైంది
పాఠశాలల పునఃప్రారంభం సమయంలో ఆర్టీఏ అధికారులు బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండాలని లేని పక్షంలో సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేయటం పరిపాటిగా వస్తోంది. తూతూమంత్రంగా పాఠశాలల బస్సులను తనిఖీలు చేయటం చేస్తున్నారు. తనిఖీలు చేసి సర్టిఫికెట్ జారీ చేసి నెలరోజులు గడవకముందే బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
భయంతో ఒణికిపోయా–పవిత్ర, విద్యార్థిని, కృష్ణవేణి టాలెంట్ స్కూల్
బస్సు ఒక్కసారిగా గుంతలోకి పడిపోవడంతో అందులో మేము ఒకరిపై ఒకరం పడ్డాం. దీంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లు వచ్చి బస్సులో ఉన్న మమ్మల్ని అందులోంచి కిందికి దించారు. ఐదారుగిరికి చిన్న చిన్న గాయాలయ్యాయి. మా అమ్మనాన్న వాళ్లు వచ్చేదాకా భయంతో గడిపాము. ఆ సంఘటన తల్చుకుంటేనే భయమేస్తుంది.