ఢిల్లీలో తప్పక చూడాల్సిన ఐదు పర్యాటక ప్రాంతాలివే!
దేశ రాజధాని ఢిల్లీ చరిత్ర వందేళ్ల నాటిది. ఇక్కడ సందర్శించడానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని తిలకించేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ఢిల్లీలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షరధామ్
ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని స్వామినారాయణ దేవాలయం అని కూడా అంటారు. స్వామి నారాయణ్ శాఖకు చెందిన ఈ ఆలయం హిందూ ధర్మం, దాని ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. 2005, నవంబర్ 6న ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్ 8 నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించారు. ఈ ఆలయ ప్రాంగణంలో బోట్ రైడ్, లైట్ షో, థియేటర్ ఉన్నాయి. ఆలయంలో తరచూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
ఇండియా గేట్
కర్తవ్యపథ్‌లోని ఇండియా గేట్ భారతదేశంలోని ప్రధాన చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకుల రద్దీ ఉంటుంది. ఇండియా గేట్ 1931-1933 మధ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇండియా గేట్ ఎత్తు సుమారు 42 మీటర్లు. వారాంతాల్లో పర్యాటకులతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది.
కుతుబ్ మినార్
ఢిల్లీలోని అందమైన ప్రదేశాలలో కుతుబ్ మినార్ కూడా ఒకటి. 73 మీటర్ల ఎత్తయిన ఈ టవర్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా చేరింది. దీనిని చూసేందుకు దేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు.
ఎర్రకోట
మొఘల్ చక్రవర్తుల రాజధాని ఢిల్లీ. ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638- 1648 మధ్య కాలంలో నిర్మించారు. ఇక్కడి మ్యూజియంలో సాంప్రదాయ హస్తకళలకు సంబంధించిన అనేక విశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి ఎరుపు రంగు గోడల కారణంగా సాయంత్రం వేళల్లో ఎర్రకోట మరింత కనువిందు చేస్తుంది.
లోటస్ టెంపుల్
లోటస్ టెంపుల్ కలువ పూవు ఆకృతిని కలిగివుంటుంది. ఆలయం పాలరాయితో నిర్మితమయ్యింది. 1986లో దీనిని నిర్మించారు. లోటస్ టెంపుల్‌ను ‘బహాయి దేవాలయం’ అని కూడా అంటారు. దీనిని ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల ఒపెరా హౌస్‌తో పోలుస్తుంటారు. ఇక్కడ చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఏ దేవుని విగ్రహం కూడా ఉండదు. ఇక్కడి వాతావరణం మానసిక ప్రశాంతతను అందిస్తుంది.