love and care
-
ప్రియుడు ఫోన్ ఎత్తలేదని.. ఈ కొత్త జబ్బు గురించి తెలుసా?
ఆమె వయసు 18 ఏళ్లు. గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆమె ‘లవ్ బ్రెయిన్’ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. లవ్ బ్రెయిన్(Love Brain).. మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఒక జబ్బు. అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు గుర్తించారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది.గ్జియాయూ(18) కాలేజీ స్టూడెంట్.గతకొంతకాలంగా తన ప్రియుడి మీదే ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎప్పుడూ తనతో కాంటాక్ట్‌లో ఉండాలని, ఆ యువకుడు తాను ఎప్పుడు.. ఎక్కడ ఉంటున్నాడనే విషయం చెబుతూ ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఒకరోజు వందకిపైగా ఫోన్ కాల్స్ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆమె అతనికి పలు సందేశాలు పంపింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురి చేసింది. చివరకు.. ఎలాగోలా ఆమెను నిలువరించి పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్ బ్రెయిన్ సోకిందని వైద్యులు నిర్ధారించుకున్నారు. ఎవరికి సోకుతుందంటే..ప్రేమలో, రొమాంటిక్ రిలేషన్స్‌లో ఉన్నవాళ్లు ఈ లవ్బ్రెయిన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు.. వాళ్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్ బ్రెయిన్ జబ్బులోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒకస్థాయి దాటి పోతుంటారు దీని బారిన పడ్డవాళ్లు. ఇది బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని.. చివరకు బైపోలార్ డిజార్డర్ బారినపడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కారణాలు.. లవ్ బ్రెయిన్ ఎక్కువ కేసుల ఆధారంగా.. తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు.. చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు.. ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావొచ్చని వైద్య నిపుణులు గుర్తించారు. మానసికంగా.. భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రేమ ఒక రోగం.. అందునా అతిప్రేమ కూడా ఒక రోగమనేది దీంతో తేలిపోయిందన్నమాట!. -
నా భర్త అతి ప్రేమతో చచ్చిపోతున్నా..
అబుదాబి: సాధారణంగా భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు. అభిప్రాయబేధాలు వస్తేనో, వేధింపులు తట్టుకోలేకనో.. భార్యనో, భర్తనో మరో వ్యక్తితో సంబంధాలు పెట్టుకున్న సందర్భాల్లో విడిపోవాలని అనుకుంటారు. అయితే టెక్నాలజీ పెరిగాక వింత వింత కారణాలతో విడిపోతున్న జంటల సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరో విడాకులు వివాదం అందర్ని తెగ ఆకర్షిస్తోంది. భర్త అతి ప్రేమతో తనకు ఊపిరాడటం లేదని.. విడాకులు ఇప్పించాలంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వింత సంఘటన యూఏఈలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. యూఏఈ లోని షరియత్ కోర్టుకు ఒక విడాకుల కేసు వచ్చింది. అయితే ఆ కేసు వివరాలు చదివి ఆశ్చర్యపోవడం జడ్జి వంతయ్యింది. తన భర్త అతి మంచితనం వల్ల తాను సరిగా కాపురం చేయలేకపోతున్నానని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భార్య కోర్టులో కేసు వేసింది. తాను చెప్పిన పనేకాక చెప్పని పని కూడా చేస్తూ విసుగు తెప్పిస్తున్నాడని భర్తపై ఆరోపణలు చేసింది. దాంతో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని జడ్జి ప్రశ్నించారు. అందుకు ఆమె ‘అసలు నా భర్త ఏ విషయంలోనూ నాతో గొడవపడడు. ఇంటిని సరిగా ఉంచకపోయినా, వంట బాగా చేయకపోయినా ఏమి అనడు. పైగా అప్పడప్పుడు తనే నాకు వండి పెడుతుంటాడు. ఇంటిని కూడా శుభ్రం చేస్తాడు, అంట్లు కడుగుతాడు, బట్టలు కూడా తానే వాషింగ్ మెషిన్లో వేసి ఆరేస్తాడు. నాకు పనేం చెప్పకపోగా బహుమతులతో నన్ను ముంచెత్తుతాడు. నాకు మా ఆయనతో గొడవ పడాలని, వాదించాలని ఉంటుంది. కానీ నేనేం చేసినా సరే తను ప్రేమతో క్షమిస్తూ ఉంటాడు. ఆయన అతి ప్రేమతో నాకు ఊపిరాడటం లేదు. అసలు గొడవలు లేకుండా జీవించడం నాకు నరకంలా ఉంది. ఇలాంటి జీవితం నాకు వద్దు. విడాకులు ఇప్పించండి’ అని పేర్కొంది. భార్య ఆరోపణలపై భర్తను ప్రశ్నించగా.. తనకు తన భార్యంటే చాలా ప్రేమని, ఆమెను కష్టపెట్టడం ఇష్టం ఉండదని బదులిచ్చాడు. తనతో నేను గొడవ పడలేనని అన్నాడు. గతంలో ఒక సారి తన భార్య తనను బరువు తగ్గమని చెప్పిందని.. వెంటనే కఠినమైన డైట్ ఫాలో అయి సన్నగా అయ్యానని చెప్పుకొచ్చాడు. భార్యతో గొడవపడటం తన వల్ల కాదని సదరు భర్త తేల్చి చెప్పాడు. వీరిద్దరి వాదనలు విన్న జడ్జి.. ఇది కోర్టులో విచారించదగిన కేసు కాదని.. దంపతులిద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ప్రస్తుతానికి కేసును వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కొడుకు ప్రేమ తగ్గిందంటూ పోలీసులకు ఫిర్యాదు
బంజారాహిల్స్ (హైదరాబాద్) : తనకు కొడుకు ప్రేమ కావాలంటూ వృద్ధాప్యంలో ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని శ్రీ వెంకటేశ్వర నగర్లో నివసించే లక్ష్మీబాయి అనే మహిళకు ఇద్దరు కుమారులు. ఆరు నెలల క్రితం చిన్న కుమారుడి పెళ్లి జరిగింది. అయితే ఆ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు రావడంతో... తనపై కుమారుడికి ప్రేమ తగ్గిందందని, అతడి ప్రేమ కావాలంటూ లక్ష్మీబాయి సోమవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె ముందే కుమారుడిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరిని పంపించేశారు. అయినా ఆ తల్లి సంతృప్తి చెందకపోవడం గమనార్హం.