అబుదాబి: సాధారణంగా భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు. అభిప్రాయబేధాలు వస్తేనో, వేధింపులు తట్టుకోలేకనో.. భార్యనో, భర్తనో మరో వ్యక్తితో సంబంధాలు పెట్టుకున్న సందర్భాల్లో విడిపోవాలని అనుకుంటారు. అయితే టెక్నాలజీ పెరిగాక వింత వింత కారణాలతో విడిపోతున్న జంటల సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరో విడాకులు వివాదం అందర్ని తెగ ఆకర్షిస్తోంది. భర్త అతి ప్రేమతో తనకు ఊపిరాడటం లేదని.. విడాకులు ఇప్పించాలంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వింత సంఘటన యూఏఈలో చోటు చేసుకుంది.
ఆ వివరాలు.. యూఏఈ లోని షరియత్ కోర్టుకు ఒక విడాకుల కేసు వచ్చింది. అయితే ఆ కేసు వివరాలు చదివి ఆశ్చర్యపోవడం జడ్జి వంతయ్యింది. తన భర్త అతి మంచితనం వల్ల తాను సరిగా కాపురం చేయలేకపోతున్నానని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భార్య కోర్టులో కేసు వేసింది. తాను చెప్పిన పనేకాక చెప్పని పని కూడా చేస్తూ విసుగు తెప్పిస్తున్నాడని భర్తపై ఆరోపణలు చేసింది. దాంతో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని జడ్జి ప్రశ్నించారు.
అందుకు ఆమె ‘అసలు నా భర్త ఏ విషయంలోనూ నాతో గొడవపడడు. ఇంటిని సరిగా ఉంచకపోయినా, వంట బాగా చేయకపోయినా ఏమి అనడు. పైగా అప్పడప్పుడు తనే నాకు వండి పెడుతుంటాడు. ఇంటిని కూడా శుభ్రం చేస్తాడు, అంట్లు కడుగుతాడు, బట్టలు కూడా తానే వాషింగ్ మెషిన్లో వేసి ఆరేస్తాడు. నాకు పనేం చెప్పకపోగా బహుమతులతో నన్ను ముంచెత్తుతాడు. నాకు మా ఆయనతో గొడవ పడాలని, వాదించాలని ఉంటుంది. కానీ నేనేం చేసినా సరే తను ప్రేమతో క్షమిస్తూ ఉంటాడు. ఆయన అతి ప్రేమతో నాకు ఊపిరాడటం లేదు. అసలు గొడవలు లేకుండా జీవించడం నాకు నరకంలా ఉంది. ఇలాంటి జీవితం నాకు వద్దు. విడాకులు ఇప్పించండి’ అని పేర్కొంది.
భార్య ఆరోపణలపై భర్తను ప్రశ్నించగా.. తనకు తన భార్యంటే చాలా ప్రేమని, ఆమెను కష్టపెట్టడం ఇష్టం ఉండదని బదులిచ్చాడు. తనతో నేను గొడవ పడలేనని అన్నాడు. గతంలో ఒక సారి తన భార్య తనను బరువు తగ్గమని చెప్పిందని.. వెంటనే కఠినమైన డైట్ ఫాలో అయి సన్నగా అయ్యానని చెప్పుకొచ్చాడు. భార్యతో గొడవపడటం తన వల్ల కాదని సదరు భర్త తేల్చి చెప్పాడు. వీరిద్దరి వాదనలు విన్న జడ్జి.. ఇది కోర్టులో విచారించదగిన కేసు కాదని.. దంపతులిద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ప్రస్తుతానికి కేసును వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment