ఆమె అతన్ని గాఢంగా ప్రేమించింది. ఫోన్ చేస్తే అతను ఎత్తలేదు.. దీంతో ఆమె..
ఆమె వయసు 18 ఏళ్లు. గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆమె ‘లవ్ బ్రెయిన్’ బారిన పడి ఆస్పత్రిలో చేరింది.
లవ్ బ్రెయిన్(Love Brain).. మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఒక జబ్బు. అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు గుర్తించారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది.
గ్జియాయూ(18) కాలేజీ స్టూడెంట్.గతకొంతకాలంగా తన ప్రియుడి మీదే ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎప్పుడూ తనతో కాంటాక్ట్‌లో ఉండాలని, ఆ యువకుడు తాను ఎప్పుడు.. ఎక్కడ ఉంటున్నాడనే విషయం చెబుతూ ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు.
ఒకరోజు వందకిపైగా ఫోన్ కాల్స్ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆమె అతనికి పలు సందేశాలు పంపింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురి చేసింది. చివరకు.. ఎలాగోలా ఆమెను నిలువరించి పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్ బ్రెయిన్ సోకిందని వైద్యులు నిర్ధారించుకున్నారు.
ఎవరికి సోకుతుందంటే..
ప్రేమలో, రొమాంటిక్ రిలేషన్స్‌లో ఉన్నవాళ్లు ఈ లవ్‌బ్రెయిన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు.. వాళ్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్ బ్రెయిన్ జబ్బులోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒకస్థాయి దాటి పోతుంటారు దీని బారిన పడ్డవాళ్లు. ఇది బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని.. చివరకు బైపోలార్ డిజార్డర్ బారినపడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కారణాలు..
లవ్ బ్రెయిన్ ఎక్కువ కేసుల ఆధారంగా.. తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు.. చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు.. ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావొచ్చని వైద్య నిపుణులు గుర్తించారు. మానసికంగా.. భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రేమ ఒక రోగం.. అందునా అతిప్రేమ కూడా ఒక రోగమనేది దీంతో తేలిపోయిందన్నమాట!.
Comments
Please login to add a commentAdd a comment