ప్రియుల కోసం యువతుల పరుగు..
సాక్షి, ప్రత్యేకం: ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న వస్తుంది. కానీ, చైనా కుర్రకారు మాత్రం ఆగష్టు 28న 'ప్రేమ' రోజును అద్భుతంగా జరుపుకుంటారు. క్విగ్జి పండుగగా చైనా ప్రేమికుల రోజు ప్రఖ్యాతి చెందింది. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. దాని వెనుక 2 వేల ఏళ్ల చరిత్ర కూడా ఉంది. ఓ పశువుల కాపరి, అతని భార్యల మధ్య ఉన్న అనురాగానికి గుర్తుగా దశాబ్దం నుంచి క్విగ్జి పండుగను జరుపుకోవడం చైనాలో ఆనవాయితీగా మారింది.
తెలియక చేసిన పొరబాటుకు కారణంగా పశువుల కాపరి, అతని భార్య విడిపోవాల్సి వస్తుంది. కళ్ల ఎదుటే ప్రేయసి/ప్రేమికుడు కనిపిస్తున్నా.. దరి చేరేందుకు ఇద్దరి మధ్యా ఓ నది ఉండేలా శాపం పెడతాడో ముని. ప్రతి ఏడాది ఏడో పౌర్ణమి రోజున మాత్రం ఇరువురూ కలుసుకోవడానికి వీలు పడుతుందని చెప్తాడు. దీంతో చేసేది లేక ఇరువురు ప్రేమికులు ఏడాదంతా ఆ ఒక్క రోజు కోసం ఎదురుచూస్తూ జీవితాన్ని గడిపేస్తారు. ఈ కథలో ఉన్న నదిని ముద్దుగా 'సిల్వర్ రివర్' అని కూడా పిలుచుకుంటారు.
క్విగ్జి పండుగ సందర్భంగా చైనా ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పెళ్లి కోసం యువతులు పరుగులు తీస్తున్న ఫొటోనే ఇది. క్విగ్జి పండుగను చేసుకోవడం చైనా ప్రభుత్వం తాము చరిత్రకు ఇస్తున్న గౌరవంగా భావిస్తోంది.