love attack
-
ప్రేమోన్మాదానికి మరో అబల సంధ్య బలైంది...
సాక్షి, చైన్నె : ప్రేమోన్మాదానికి మరో అబల సంధ్య బలైంది. ఆమెను అతి కిరాతకంగా ప్రేమోన్మాది నరికి చంపేశాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన తిరునల్వేలిలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరునల్వేలి జిల్లా తిరుపతి కరసల్ప్రాంతానికి చెందిన మారి ముత్తు మూడో కుమార్తె సంధ్య. ఈమె తిరునల్వేలి టౌన్ కీళ రథం వీధిలోని ఓ ఫ్యాన్సీ షోరూమ్‌లో పనిచేస్తోంది. మధ్యాహ్నం అమ్మన్ వీధిలోని గోడౌన్‌కు కొన్నిఫ్యాన్సీ సామాన్లు తెచ్చేందుకు వెళ్లిన సంధ్య ఎంతకు రాలేదు. దీంతో ఆ షోరూమ్‌లో ఉన్న ఇతర సిబ్బంది గోడౌన్‌కు వెళ్లి చూశారు. అక్కడ ఆమె రక్తపు ముడుగులో పడి ఉండటంతో ఆందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పరీక్షించగా ఆమె మృతి చెందినట్టు గుర్తించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా ప్రాథమిక విచారణలో తేలింది. సంధ్యను తరచూ ఓ యువకుడు వెంబడించే వాడని, ప్రేమ పేరిట వేధించే వాడని విచారణలో తేలింది. కొంతకాలం వీరు చెట్టాపట్టలు వేసుకుని తిరిగి తర్వాత కొద్దిరోజులకు ఆమె దూరం పెట్టడంతో అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు వెలుగు చూసింది. దీంతో ఆ ప్రేమోన్మాది ఎవరో అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సంధ్య మృత దేహాన్ని పాళయంకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంగా ప్రేమోన్మాదుల చేతిలో యువతులు బలి అవుతున్న సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతోండడం ఆందోళనకరంగా మారింది. -
ఎమ్మెల్యే కూతురిపై దాడి
ప్రేమించాలంటూ ఎమ్మెల్యే కూతురిపై దాడి పూణే(మహారాష్ట్ర): ఎన్ని నెలలుగా వెంటబడుతున్నా, ఎన్నిసార్లు ప్రాధేయపడినా తనను ప్రేమించటం లేదంటూ ఓయువకుడు ఎమ్మెల్యే కూతురిపై దాడికి పాల్పడ్డాడు. యావత్మాల్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె(22) వాకాడ్‌లోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుకుంటోంది. హర్యానాకు చెందిన యువకుడు(25) కూడా అదే కళాశాలలో చదువుకుంటున్నాడు. గత కొన్ని నెలలుగా ఆమె వెంటబడుతున్నాడు. ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అయితే, ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. దానిని మనస్సులో పెట్టుకున్న ఆ యువకుడు సోమవారం ఉదయం కళాశాల బయట ఆమెను అడ్డగించాడు. ప్రేమించటం లేదంటూ కత్తితో దాడికి దిగాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని పట్టుకుని, పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి చేతులకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. -
అనాథ శరణాలయంపై 'లవ్ అటాక్'..
► తుపాకితో గార్డును బెదిరించి పరారైన ప్రేమికులు ► అదనుగా భావించి తప్పించుకున్న మరో 20 మంది మహిళలు మథుర: కారాగారంలో ఉంటున్న తమవాళ్లను విడిపించుకునేందుకు తాలిబన్లు ఏకంగా జైళ్లనే బద్దలుకొట్టిన సంఘటనలు అఫ్ఘానిస్థాన్‌లో తరచూ జరుగుతుండటం తెలిసిందే. ఆ రేంజ్లో కాకున్నా ప్రేమించిన అమ్మాయిలను తమతో తీసుకెళ్లేందుకు ఏకంగా అనాథ శరణాలయం గేట్లను బద్దలుకొట్టింది ఓ ప్రేమికుల గ్యాంగ్. వివరాల్లోకి వెళితే.. మథుర పట్టణంలోని నారి నికేతన్ అనే అనాథ శరణాలయంలో దాదాపు 30 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అన్ని వయస్కుల వారూ ఉన్నారు. గురువారం రాత్రి సమయంలో ముసుగులు ధరించిన కొందరు యువకులు తుపాకులతో అక్కడికి చేరుకుని, గార్డుపై కాల్పులు జరిపి గేట్లను బద్దలుకొట్టారు. శరణాలయంలోకి ప్రవేశించి గాలిలోకి కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతలకు గురిచేశారు. సీన్ కట్ చేస్తే.. నిర్వహకులు అందించిన సమాచారంతో పది నిమిషాల తర్వాత శరణాలయానికి చేరుకున్న పోలీసులు.. మొత్తం 22 మంది మహిళలు తప్పించుకున్నట్లు గుర్తించారు. అప్పటికప్పుడే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపుచర్యలను ముమ్మరం చేశారు. కొద్ది గంటల్లోనే 19 మంది మహిళలు పోలీసులకు చిక్కారు. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇంకా పరారీలోనే ఉన్న పూజ, శిల్ప అనే యువతుల కోసమే శరణాలయంపై దాడి జరిగినట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. శరణాలయంలో సౌకర్యాలు కల్పించడంతో సదరు యువతులకు బయటికి వెళ్లే అవకాశం ఉండదని, అందుకే వారి ప్రేమికులు దాడి చేసి మరీ పూజ, శిల్పలను తీసుకెళ్లారని, సందట్లో సడేమియాలా మరో 19 మంది పారిపోయారని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఆ ఇద్దరి వెంట ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు శరణాలయం ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం లవ్ అటాకేనా లేక దీని వెనుక మహిళల అక్రమరవాణా ముఠాల హస్తమేమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లవ్ ఎటాక్
ప్రేమోన్మాదుల ఘాతుకాలు యువతుల జీవితాలకు పెను ముప్పు సాక్షి, విశాఖపట్నం : పవిత్ర ప్రేమను పైశాచిక కేళి కబళిస్తోంది. ప్రేమ పేరుతో నయ వంచనకు పాల్పడే మృగాళ్లు పెచ్చుమీరుతున్నారు.సినిమాలు, నెట్ ప్రభావంతో కొందరు యువకుల మనసులు వికృత పోకడలు పోతున్నాయి. ప్రేమకు నో అంటే తనకు నచ్చిన అమ్మాయి వేరొకరికి దక్కకూడదనే దురుద్దేశంతో వారిపై యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారు. కత్తులతో బెదిరిస్తున్నారు.. చివరకు ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమోన్మాద చేష్టల గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ తరహా మనో వికారాలకు స్వస్తి పలికి స్వచ్ఛమైన, ప్రేమమయ ప్రపంచాన్ని నేటి యువతరం ఆవిష్కరించాలన్నది అందరి ఆకాంక్ష. ఏ వెలుగులకీ ప్రస్థానం... గాజువాకలో 2012 డిసెంబర్లో ఓ మేనమామ తను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో వివాహం చేస్తున్నారనే కారణంతో ఆమెను నిర్దాక్షిణ్యంగా నరికి చంపాడు. 2013 జులైలో నగరానికి చెందిన ఓ కాలేజీ విద్యార్థినిని ప్రేమికుడు వివాహం చేసుకుంటాననే పేరుతో తీసుకెళ్లి మధురవాడలో స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఇలా ప్రేమ పేరుతో నమ్మించడం, ఆనక వంచించడం పవిత్రప్రేమకు రక్తపు మరకలు అంటిస్తున్నాయి. నగరంలో ప్రేమపేరుతో అమ్మాయిల్ని బెదిరించే సంఘటనలు పెరిగిపోతున్నాయి. కాలేజీ ముగిసే సమయాల్లోనైనా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచకపోవడంతో వేధింపులు తట్టుకోలేక అమ్మాయిలు నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు ధైర్యంగా ఇంట్లో చెప్పి పోలీసు కేసులు పెడుతుంటే.. కొందరు మౌనంగానే భరిస్తున్నారు. నగరంలో ప్రేమ పేరుతో వేధించే కేసులు పెరుగుతున్నాయి. నిర్భయ కేసుల్లో ఎక్కువగా అవే ఉంటున్నాయి. 2012లో నిర్భయ కేసులు 388 నమోదు కాగా అందులో ప్రేమ వేధింపు కేసులు 180. 2013లో నిర్భయ కేసులు 520 నమోదు కాగా అందులో ప్రేమ వేధింపు కేసులు 275. పోలీసులు ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు, ఫోన్లో బెదిరింపులు, యాసిడ్‌తో దాడిచేసే సంఘటనలను నిర్భయ చట్టం కింద నమోదు చేస్తున్నారు. ఇవికాక ఫేస్బుక్, మెయిల్, సెల్ఫోన్లో అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో అదేపనిగా ఎస్సెమ్మెస్‌లు పంపడం, ఫోన్లో బెదిరించిన సంఘటనలను సైబర్ క్రైం కింద నమోదు చేస్తున్నారు. సున్నితత్వం పోయి తెగించేస్తున్నారు ప్రేమ పేరుతో వేధించే ఆకతాయిలు చాలా సందర్భాల్లో వాస్తవికతకు, నైతికతకు దూరంగా ఆలోచిస్తారు. ఇలాంటివాళ్లు తమ కోరిక తీరకపోతే ఆవేశంతో ఎంతకైనా తెగిస్తుంటారు. గ్రామాలతో పోలిస్తే నగరాల్లో ఇలాంటి నేరస్తులను త్వరగా గుర్తించడం కష్టం. అందుకే తన కోరిక నెరవేరడానికి ఏం చేసినా బయటపడదనే ధోరణితో ముందుకు వెళ్తుంటారు. సినిమా, టీవీలు, ఇంటర్నెట్ ప్రపంచం కూడా మనిషిలోని ప్రగాఢ కోరికను ఏదో ఒక రూపంలో తక్షణమే బయటపెట్టేసుకోవాలనే ధోరణికి ఉసిగొల్పుతుంది. - డాక్టర్ ఎన్.ఎన్.రాజు, ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ వేధిస్తే కఠిన శిక్షలు ఖాయం ప్రేమ పేరుతో యువతులను వేధించి, వారిని మానసిక క్షోభకు గురిచేసే వారిపై కఠిన చట్టాలు ప్రయోగిస్తున్నాం. ఇటీవల నిర్భయ చట్టాన్ని మరింత పటిష్టం చేశారు. కాలేజీలు, పనిచేసే ప్రాంతాల్లో ఆకతాయిలు, ప్రేమోన్మాదుల నుంచి ఇబ్బందులుంటే ఏమాత్రం ఉపేక్షించకూడదు. చాలామంది తమకు ఏమైనా అవుతుందేమోననే భయంతో ఇంట్లో తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వరు. అలాంటప్పుడే సమస్య ముదిరిపోతుంది. తక్షణమే ఇటువంటి విషయాలను షేర్ చేసుకోవాలి. మహిళల రక్షణకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లున్నాయి. - శివధరరెడ్డి, నగర పోలీస్ కమిషనర్