అనాథ శరణాలయంపై 'లవ్ అటాక్'..
► తుపాకితో గార్డును బెదిరించి పరారైన ప్రేమికులు
► అదనుగా భావించి తప్పించుకున్న మరో 20 మంది మహిళలు
మథుర: కారాగారంలో ఉంటున్న తమవాళ్లను విడిపించుకునేందుకు తాలిబన్లు ఏకంగా జైళ్లనే బద్దలుకొట్టిన సంఘటనలు అఫ్ఘానిస్థాన్లో తరచూ జరుగుతుండటం తెలిసిందే. ఆ రేంజ్లో కాకున్నా ప్రేమించిన అమ్మాయిలను తమతో తీసుకెళ్లేందుకు ఏకంగా అనాథ శరణాలయం గేట్లను బద్దలుకొట్టింది ఓ ప్రేమికుల గ్యాంగ్. వివరాల్లోకి వెళితే..
మథుర పట్టణంలోని నారి నికేతన్ అనే అనాథ శరణాలయంలో దాదాపు 30 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అన్ని వయస్కుల వారూ ఉన్నారు. గురువారం రాత్రి సమయంలో ముసుగులు ధరించిన కొందరు యువకులు తుపాకులతో అక్కడికి చేరుకుని, గార్డుపై కాల్పులు జరిపి గేట్లను బద్దలుకొట్టారు. శరణాలయంలోకి ప్రవేశించి గాలిలోకి కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతలకు గురిచేశారు. సీన్ కట్ చేస్తే..
నిర్వహకులు అందించిన సమాచారంతో పది నిమిషాల తర్వాత శరణాలయానికి చేరుకున్న పోలీసులు.. మొత్తం 22 మంది మహిళలు తప్పించుకున్నట్లు గుర్తించారు. అప్పటికప్పుడే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపుచర్యలను ముమ్మరం చేశారు. కొద్ది గంటల్లోనే 19 మంది మహిళలు పోలీసులకు చిక్కారు. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇంకా పరారీలోనే ఉన్న పూజ, శిల్ప అనే యువతుల కోసమే శరణాలయంపై దాడి జరిగినట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.
శరణాలయంలో సౌకర్యాలు కల్పించడంతో సదరు యువతులకు బయటికి వెళ్లే అవకాశం ఉండదని, అందుకే వారి ప్రేమికులు దాడి చేసి మరీ పూజ, శిల్పలను తీసుకెళ్లారని, సందట్లో సడేమియాలా మరో 19 మంది పారిపోయారని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఆ ఇద్దరి వెంట ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు శరణాలయం ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం లవ్ అటాకేనా లేక దీని వెనుక మహిళల అక్రమరవాణా ముఠాల హస్తమేమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.