న్యూఢిల్లీ: వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఏఐఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పరారీలో ఉన్నారా?. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా?. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం వెంటనే.. ఆమె దేశం విడిచి పారిపోయారా?.
ముందస్తు బెయిల్ విషయంలో పూజా ఖేద్కర్‌కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారని, ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్ తప్పదని ఆమె భావించారు.
వెంటనే తన లాయర్ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. పూజాను కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే..
జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు.
దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment