న్యూఢిల్లీ, పుణె: దేశ రాజధాని ఢిల్లీ, పుణెలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో దాదాపు 1,100 కిలోల నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్(ఎండీ)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా మ్యావ్ మ్యావ్ అని పిలువబడే దీని విలువ రూ. 2,500 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలో ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 700 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నిందితుల విచారణ అనంతరం ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో దాడులు నిర్వహించి 400 కిలోల సింథటిక్ ఉద్దీపనను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పుణెలోని కుర్‌కుంభ ఎమ్‌ఐడీసీ ప్రాంతంలో ని ఓ ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌లో 700 కిలోల డ్రగ్‌ను సీజ్ చేశారు.
కాగా మహారాష్ట్రలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి. అంతేగాక దేశంలోనే అత్యంత ముఖ్యమైన డ్రగ్స్ బస్ట్‌లలో ఒకటి. ఈ ఘటనపై పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. వీరిలో ముగ్గురు కొరియర్ బాయ్స్‌తోపాటు మరో ఇద్దరు ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు తెలిపారు.
ఫార్మా ప్లాంట్ ఓనర్‌ను అరెస్టు చేశామని, భీంజీ అలియాస్ అనిల్ పరశురాం, కెమికల్ ఇంజినీర్ యువరాజ్ బబన్ భుజ్‌భాయ్‌కు దీంతో సంబంధం ఉందని పేర్కొన్నారు. పుణె బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రాకెట్‌లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు తాము గుర్తించామని చెప్పారు. డగ్స్‌ను ప్యాక్ చేయడానికి నిందితులు ఉప్పు గోదాములను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఇక మెఫెడ్రిన్ తయారీ, విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment