హిమాయత్‌నగర్: సోషల్ మీడియా వేదికగా సింథటిక్, ఎండీఎంఏ డ్రగ్ దందా చేస్తున్న పెడ్లర్‌లను హెచ్‌న్యూ టీం గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన 40 గ్రాముల సింథటిక్, 30 గ్రాముల ఎండీఏంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నైజీరియాకు చెందిన మహమద్ టొయిరూ బకారీ 2013లో ముంబైకి టూరిస్ట్ వీసాపై వచ్చాడు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ స్థానికుడైన అపూర్వ మటప్రసాద్ ఉపాధ్యాయతో కలిసి పుణేలో డ్రగ్స్ రవాణా, సరఫరా చేస్తున్నాడు. వీరు కొకైన్ (సింథటిక్) అమ్ముతున్న విషయాన్ని అక్కడి నార్కోటిక్ బృందం పసిగట్టి 2019లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2020లో రిలీజైన ఈ ఇద్దరూ ముంబైకి చెందిన మరో వ్యక్తి అజయ్‌కుమార్ చౌపల్‌ను జతకలుపుకున్నారు.
పుణే నుంచి వీరు సిటీకి సింథటిక్ డ్రగ్‌ను రవాణా చేస్తూ పంజగుట్ట పరిధిలో విక్రయిస్తున్నట్లు హెచ్‌న్యూ టీం గుర్తించి కొద్దిరోజుల క్రితం అపూర్వ మటప్రసాద్ ఉపాధ్యాయ, అజయ్‌కుమార్ చౌపల్‌లను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం మహమద్ టొయిరూ బకారీని అరెస్ట్ చేసి ఇతని వద్ద ఉన్న 40 గ్రాముల కొకైన్(సింథటిక్), 8 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో..యూపీలోని గయాస్‌పుర్‌కు చెందిన మహ్మద్ అలీంఖాన్ నగరానికి చెందిన కొందరి కాంటాక్టస్‌ను సేకరించి వీరికి ఇన్‌స్ట్రాగామ్ వేదికగా సరఫరా చేసేందుకు గోల్కొండ పీఎస్ పరిధిలో ఉండగా..హెచ్‌న్యూ టీం పట్టుకుని అరెస్ట్ చేసింది. ఇతని వద్ద నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, ఒక మొబైల్, రూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ దందాపై ఏదైనా సమాచారం తెలిస్తే ప్రజలు 8712661601 నంబర్‌లో ఫిర్యాదు చేయాలని జోయిల్ డేవిస్ కోరారు. సమావేశంలో హెచ్‌న్యూటీం డీసీపీ గుమ్మి చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment