లవ్ ఎటాక్
- ప్రేమోన్మాదుల ఘాతుకాలు
- యువతుల జీవితాలకు పెను ముప్పు
సాక్షి, విశాఖపట్నం : పవిత్ర ప్రేమను పైశాచిక కేళి కబళిస్తోంది. ప్రేమ పేరుతో నయ వంచనకు పాల్పడే మృగాళ్లు పెచ్చుమీరుతున్నారు.సినిమాలు, నెట్ ప్రభావంతో కొందరు యువకుల మనసులు వికృత పోకడలు పోతున్నాయి. ప్రేమకు నో అంటే తనకు నచ్చిన అమ్మాయి వేరొకరికి దక్కకూడదనే దురుద్దేశంతో వారిపై యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారు. కత్తులతో బెదిరిస్తున్నారు.. చివరకు ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమోన్మాద చేష్టల గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ తరహా మనో వికారాలకు స్వస్తి పలికి స్వచ్ఛమైన, ప్రేమమయ ప్రపంచాన్ని నేటి యువతరం ఆవిష్కరించాలన్నది అందరి ఆకాంక్ష.
ఏ వెలుగులకీ ప్రస్థానం... గాజువాకలో 2012 డిసెంబర్‌లో ఓ మేనమామ తను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో వివాహం చేస్తున్నారనే కారణంతో ఆమెను నిర్దాక్షిణ్యంగా నరికి చంపాడు. 2013 జులైలో నగరానికి చెందిన ఓ కాలేజీ విద్యార్థినిని ప్రేమికుడు వివాహం చేసుకుంటాననే పేరుతో తీసుకెళ్లి మధురవాడలో స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఇలా ప్రేమ పేరుతో నమ్మించడం, ఆనక వంచించడం పవిత్రప్రేమకు రక్తపు మరకలు అంటిస్తున్నాయి. నగరంలో ప్రేమపేరుతో అమ్మాయిల్ని బెదిరించే సంఘటనలు పెరిగిపోతున్నాయి. కాలేజీ ముగిసే సమయాల్లోనైనా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచకపోవడంతో వేధింపులు తట్టుకోలేక అమ్మాయిలు నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు ధైర్యంగా ఇంట్లో చెప్పి పోలీసు కేసులు పెడుతుంటే.. కొందరు మౌనంగానే భరిస్తున్నారు.
నగరంలో ప్రేమ పేరుతో వేధించే కేసులు పెరుగుతున్నాయి. నిర్భయ కేసుల్లో ఎక్కువగా అవే ఉంటున్నాయి. 2012లో నిర్భయ కేసులు 388 నమోదు కాగా అందులో ప్రేమ వేధింపు కేసులు 180. 2013లో నిర్భయ కేసులు 520 నమోదు కాగా అందులో ప్రేమ వేధింపు కేసులు 275.
పోలీసులు ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు, ఫోన్లో బెదిరింపులు, యాసిడ్‌తో దాడిచేసే సంఘటనలను నిర్భయ చట్టం కింద నమోదు చేస్తున్నారు.
ఇవికాక ఫేస్‌బుక్, మెయిల్, సెల్‌ఫోన్లో అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో అదేపనిగా ఎస్సెమ్మెస్‌లు పంపడం, ఫోన్లో బెదిరించిన సంఘటనలను సైబర్ క్రైం కింద నమోదు చేస్తున్నారు.
సున్నితత్వం పోయి తెగించేస్తున్నారు
ప్రేమ పేరుతో వేధించే ఆకతాయిలు చాలా సందర్భాల్లో వాస్తవికతకు, నైతికతకు దూరంగా ఆలోచిస్తారు. ఇలాంటివాళ్లు తమ కోరిక తీరకపోతే ఆవేశంతో ఎంతకైనా తెగిస్తుంటారు. గ్రామాలతో పోలిస్తే నగరాల్లో ఇలాంటి నేరస్తులను త్వరగా గుర్తించడం కష్టం. అందుకే తన కోరిక నెరవేరడానికి ఏం చేసినా బయటపడదనే ధోరణితో ముందుకు వెళ్తుంటారు. సినిమా, టీవీలు, ఇంటర్నెట్ ప్రపంచం కూడా మనిషిలోని ప్రగాఢ కోరికను ఏదో ఒక రూపంలో తక్షణమే బయటపెట్టేసుకోవాలనే ధోరణికి ఉసిగొల్పుతుంది.
- డాక్టర్ ఎన్.ఎన్.రాజు, ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్
వేధిస్తే కఠిన శిక్షలు ఖాయం
ప్రేమ పేరుతో యువతులను వేధించి, వారిని మానసిక క్షోభకు గురిచేసే వారిపై కఠిన చట్టాలు ప్రయోగిస్తున్నాం. ఇటీవల నిర్భయ చట్టాన్ని మరింత పటిష్టం చేశారు. కాలేజీలు, పనిచేసే ప్రాంతాల్లో ఆకతాయిలు, ప్రేమోన్మాదుల నుంచి ఇబ్బందులుంటే ఏమాత్రం ఉపేక్షించకూడదు. చాలామంది తమకు ఏమైనా అవుతుందేమోననే భయంతో ఇంట్లో తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వరు. అలాంటప్పుడే సమస్య ముదిరిపోతుంది. తక్షణమే ఇటువంటి విషయాలను షేర్ చేసుకోవాలి. మహిళల రక్షణకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లున్నాయి.
- శివధరరెడ్డి, నగర పోలీస్ కమిషనర్