Love Attraction
-
ప్రేమించింది బావనే కదా అని దగ్గరైంది.. ప్రైవసీ ఫొటోలు తీసి..
తిరువళ్లూరు: ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొట్టయూర్ గ్రామానికి చెందిన పార్థసారథి కుమార్తె తులసీ(29). తల్లిదండ్రులిద్దరూ దివ్యాంగులు. కాగా, తులసీ అదే ప్రాంతానికి చెందిన తన మామ బాలకృష్ణన్ కుమారుడు సతీష్‌కుమార్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి రెండు నెలల నుంచి కోరుతోంది. అడిగిన ప్రతిసారి యువకుడు వివిధ కారణాల చెబుతూ వచ్చాడు. ఆమె ఒత్తిడి చేయడంతో తన వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని.. తీసుకొస్తే ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ నెల 4న యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరారు. నిరాకరించిన యువకుడి తల్లిదండ్రులు 50 సవర్ల బంగారు నగలు, కారు కట్నంగా ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపం చెందిన యువతి తనకు జరిగిన అన్యాయంపై తిరువళ్లూరు కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీయ, ఎస్పీ ఫకెర్లా సెఫాస్ కల్యాన్, తిరువళ్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగకపోవడంతో గురువారం ఉదయం యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న మప్పేడు ఎస్ఐ శక్తివేల్ సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించింది. కాగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో సతీష్‌కుమార్ కుటుంబ సభ్యులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఆకర్షణ.. వ్యామోహం..ప్రేమ పేరుతో ఉన్మాదం
సాక్షి, సిటీబ్యూరో: గతేడాది అమీన్పూర్ గుట్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని చాందినిజైన్.. లాలాగూడ ప్రాంతంలో సంధ్యారాణి. గత నెలలో కూకట్‌పల్లిలో జానకి.. ప్రేమోన్మాదానికి బలయ్యారు. అనుబంధ వారధిగా ఉండాల్సిన ప్రేమ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తోంది. ప్రేమ ముసుగులో మగాళ్ల ఉన్మాదం రంకెలు వేస్తోంటే... అభంశుభం తెలియని అభాగినులు అసువులు బాస్తున్నారు. పరిపక్వత లేని ప్రేమలే ఈ దారుణాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జీవితం అంటే ఏమిటి? దాని విలువల ఏమిటి? అనేవి పూర్తిగా అవగతం కాని పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పుట్టే ఆకర్షణే దారుణాలకు దారి తీస్తోంది. తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణ, వ్యామోహంలో పడి దాన్నే ప్రేమగా భావిస్తున్నారు. తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు అసలు విషయాన్ని గుర్తించి జాగ్రత్తపడితే... రెండోవాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడమో, లేదంటే హత్యకు తెగబడడమో జరుగుతోంది. ఒక్కో సందర్భంలో బెదిరింపులు, బ్లాక్ మెయిల్, దాడులకు పాల్పడి కటకటాల్లోకీ చేరి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ధోరణి ఎక్కువగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల్లోనే కనిపిస్తోంది. తేలికైన పరిచయాలు... ఇటీవల కాలంలో వ్యక్తిగత ఫోన్లు, సోషల్ మీడియాల కారణంగా పరిచయం తేలికవుతోంది. ఒకప్పుడు కేవలం బంధువులు, స్నేహితులు లేదా పరిచయస్తుల ద్వారా మాత్రమే కొత్తవారు పరిచయం అయ్యేవారు. అలా కాదంటే విద్యాసంస్థలు, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనే పరిచయాలు ఏర్పడేవి. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఏమాత్రం సంబంధం లేనివాళ్లు స్నేహితులుగా మారిపోతున్నారు. కొన్నాళ్లకు ఇదే ప్రేమగా మారి ఆపై ‘దెబ్బతింటోంది’. అటకెక్కిన యువజన విధానం... సమాజంలో మహిళలకున్న సమున్నత స్థానం, వారి హక్కులను యువతకు క్షుణ్నంగా బోధించాలన్న ఉద్దేశంతో కొన్నేళ్ల క్రితం రూపొందినదే జాతీయ యువజన వి«ధానం. మహిళలపై యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయసుల వారీగా రెండు గ్రూపులుగా విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మధ్య వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికున్న హక్కులపై మగపిల్లలకు అవగాహన కల్పించడంలో గానీ, మహిళల విషయంలో గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ ఇవ్వడంలో గానీ ప్రభుత్వాలు ఎంతటి ‘చిత్తశుద్ధిని’ చూపిస్తున్నాయో తెలుస్తూనే ఉంది. తల్లిదండ్రులూ మారాలి... ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోవడం వెనక పరోక్షంగా తల్లిదండ్రుల పాత్ర సైతం ఉంటుందని ప్రముఖ మానసిక నిపుణులు రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ‘యుక్తవయసు పిల్లల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం యాంత్రిక జీవితంలో పిల్లలపై శ్రద్ధ తగ్గింది. ఫలితంగా యూత్ పెడదారి పడుతోంది. సినిమా, టీవీల ప్రభావంతో ఒక్కోసారి హద్దులు మీరి ఇలాంటి ఉదంతాలకు పాల్పడుతున్నారు. మరోవైపు యువతీ యువకులు మాట్లాడుకుంటే అపార్థం చేసుకోవడమూ.. వారిలో లేని ఆలోచనలు రేకెత్తించినట్టే. పిల్లలను చేరదీసి జీవితం, భవిష్యత్తు విలువలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటే ఇలాంటి ఉదంతాలు పునరావృతం కావ’ని అన్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్ నా పేరు రాజు. నేను ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నేను టూ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా ఉండే వాళ్లం. కానీ నా బిహేవియర్ వల్ల తను దూరమైపోయింది. నేను తనని ఎప్పుడూ తిడుతూ ఉండే వాడిని. ఒకరోజు తను నాతో సరిగా మాట్లాడలేదని పెద్ద గొడవ చేశాను. దాంతో ఆ అమ్మాయి వాళ్ల అక్క, బావతో కలిసి మా నాన్న దగ్గరకు వచ్చి ‘అంకుల్ వీడు మారతాడని ఇన్నిరోజులు భరించాను. కానీ వీడు మారడు. వీడు నాకు వద్దు’ అని చెప్పివెళ్లిపోయింది. అదే రోజు వాళ్ల నాన్నగారు చనిపోయారు. నా వల్లే వాళ్ల నాన్నను చివరి చూపు కూడా చూసుకోలేకపోయానని నా మీద కోపం పెంచుకున్నట్లు తెలిసింది. తను నా నుండి వెళ్లిపోయాక తన విలువ తెలిసింది. తను లేకుండా ఉండలేకపోతున్నా. ‘నన్ను క్షమించు, నేను మారాను’ అని చాలాసార్లు చెప్పాను. కానీ యూజ్ లేదు. నా లవ్‌లో నేనే ప్రాబ్లమ్. ప్లీజ్ రామ్ గారు.. తను నాకు దక్కుతుందా? నేను ఏం చేయాలో నాకు అర్థం కావడంలేదు. తను లేకుండా నేను బతుకలేను. ప్లీజ్ సర్ ఏమైనా చెప్పండి. – రాజు ప్రేమ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో నిండి ఉంటుంది. ప్రేమలో కారం ఉంటుంది... గారం ఉంటుంది... ప్రేమలో ఉప్పు ఉంటుంది... నిప్పు ఉంటుంది... ప్రేమలో వగరు ఉంటుంది... బెరుకు ఉంటుంది... ప్రేమలో పులుపు ఉంటుంది... తలపు ఉంటుంది... ప్రేమలో చేదు ఉంటుంది... నిజం ఉంటుంది... ప్రేమలో స్వీటు ఉంటుంది... బట్.. వై? ఆఖిర్ క్యూం, ఆనా ఎదుక్కు... స్వీట్ల చోటులో తిట్లు ఏంటిరా రాజు...? ప్రేమలో షడ్రుచులు, ఫైనల్లీ ఏడడుగులు వేయించాలి. అబౌట్ టర్న్‌లు వేయించకూడదు. పోయి లెంపలేసుకుని కాళ్ల మీద పడు. వాళ్ల నాన్న కంటే బాగా చూసుకుంటానని వేడుకో. నమ్మితే వొళ్లు దగ్గర పెట్టుకుని అమ్మాయికి పూజ చేస్తూ బతుకు. లేకపోతే తిట్లు మాని, నెక్ట్స్ అమ్మాయికి.... ‘స్వీట్లు పంచాలి కదా సార్ ’ అంటూ నీలాంబరి ఉగాది పచ్చడిలోకి అరటిపండు ముక్కలు తరిగేసి ఇచ్చింది. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com