నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
నా పేరు రాజు. నేను ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నేను టూ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా ఉండే వాళ్లం. కానీ నా బిహేవియర్ వల్ల తను దూరమైపోయింది. నేను తనని ఎప్పుడూ తిడుతూ ఉండే వాడిని. ఒకరోజు తను నాతో సరిగా మాట్లాడలేదని పెద్ద గొడవ చేశాను. దాంతో ఆ అమ్మాయి వాళ్ల అక్క, బావతో కలిసి మా నాన్న దగ్గరకు వచ్చి ‘అంకుల్ వీడు మారతాడని ఇన్నిరోజులు భరించాను.
కానీ వీడు మారడు. వీడు నాకు వద్దు’ అని చెప్పివెళ్లిపోయింది. అదే రోజు వాళ్ల నాన్నగారు చనిపోయారు. నా వల్లే వాళ్ల నాన్నను చివరి చూపు కూడా చూసుకోలేకపోయానని నా మీద కోపం పెంచుకున్నట్లు తెలిసింది. తను నా నుండి వెళ్లిపోయాక తన విలువ తెలిసింది. తను లేకుండా ఉండలేకపోతున్నా. ‘నన్ను క్షమించు, నేను మారాను’ అని చాలాసార్లు చెప్పాను. కానీ యూజ్ లేదు. నా లవ్‌లో నేనే ప్రాబ్లమ్. ప్లీజ్ రామ్ గారు.. తను నాకు దక్కుతుందా? నేను ఏం చేయాలో నాకు అర్థం కావడంలేదు. తను లేకుండా నేను బతుకలేను. ప్లీజ్ సర్ ఏమైనా చెప్పండి. – రాజు
ప్రేమ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో నిండి ఉంటుంది. ప్రేమలో కారం ఉంటుంది... గారం ఉంటుంది... ప్రేమలో ఉప్పు ఉంటుంది... నిప్పు ఉంటుంది... ప్రేమలో వగరు ఉంటుంది... బెరుకు ఉంటుంది... ప్రేమలో పులుపు ఉంటుంది... తలపు ఉంటుంది... ప్రేమలో చేదు ఉంటుంది... నిజం ఉంటుంది... ప్రేమలో స్వీటు ఉంటుంది... బట్.. వై? ఆఖిర్ క్యూం, ఆనా ఎదుక్కు... స్వీట్ల చోటులో తిట్లు ఏంటిరా రాజు...?
ప్రేమలో షడ్రుచులు, ఫైనల్లీ ఏడడుగులు వేయించాలి. అబౌట్ టర్న్‌లు వేయించకూడదు. పోయి లెంపలేసుకుని కాళ్ల మీద పడు. వాళ్ల నాన్న కంటే బాగా చూసుకుంటానని వేడుకో. నమ్మితే వొళ్లు దగ్గర పెట్టుకుని అమ్మాయికి పూజ చేస్తూ బతుకు. లేకపోతే తిట్లు మాని, నెక్ట్స్ అమ్మాయికి.... ‘స్వీట్లు పంచాలి కదా సార్ ’ అంటూ నీలాంబరి ఉగాది పచ్చడిలోకి అరటిపండు ముక్కలు తరిగేసి ఇచ్చింది.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com