తిరువళ్లూరు: ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొట్టయూర్ గ్రామానికి చెందిన పార్థసారథి కుమార్తె తులసీ(29). తల్లిదండ్రులిద్దరూ దివ్యాంగులు.
కాగా, తులసీ అదే ప్రాంతానికి చెందిన తన మామ బాలకృష్ణన్ కుమారుడు సతీష్‌కుమార్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి రెండు నెలల నుంచి కోరుతోంది. అడిగిన ప్రతిసారి యువకుడు వివిధ కారణాల చెబుతూ వచ్చాడు. ఆమె ఒత్తిడి చేయడంతో తన వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని.. తీసుకొస్తే ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ నెల 4న యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరారు.
నిరాకరించిన యువకుడి తల్లిదండ్రులు 50 సవర్ల బంగారు నగలు, కారు కట్నంగా ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపం చెందిన యువతి తనకు జరిగిన అన్యాయంపై తిరువళ్లూరు కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీయ, ఎస్పీ ఫకెర్లా సెఫాస్ కల్యాన్, తిరువళ్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగకపోవడంతో గురువారం ఉదయం యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న మప్పేడు ఎస్‌ఐ శక్తివేల్ సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించింది. కాగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో సతీష్‌కుమార్ కుటుంబ సభ్యులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment