సాక్షి, సిటీబ్యూరో: గతేడాది అమీన్‌పూర్ గుట్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని చాందినిజైన్.. లాలాగూడ ప్రాంతంలో సంధ్యారాణి. గత నెలలో కూకట్‌పల్లిలో జానకి.. ప్రేమోన్మాదానికి బలయ్యారు. అనుబంధ వారధిగా ఉండాల్సిన ప్రేమ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తోంది. ప్రేమ ముసుగులో మగాళ్ల ఉన్మాదం రంకెలు వేస్తోంటే... అభంశుభం తెలియని అభాగినులు అసువులు బాస్తున్నారు.
పరిపక్వత లేని ప్రేమలే ఈ దారుణాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జీవితం అంటే ఏమిటి? దాని విలువల ఏమిటి? అనేవి పూర్తిగా అవగతం కాని పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పుట్టే ఆకర్షణే దారుణాలకు దారి తీస్తోంది. తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణ, వ్యామోహంలో పడి దాన్నే ప్రేమగా భావిస్తున్నారు. తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు అసలు విషయాన్ని గుర్తించి జాగ్రత్తపడితే... రెండోవాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడమో, లేదంటే హత్యకు తెగబడడమో జరుగుతోంది. ఒక్కో సందర్భంలో బెదిరింపులు, బ్లాక్ మెయిల్, దాడులకు పాల్పడి కటకటాల్లోకీ చేరి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ధోరణి ఎక్కువగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల్లోనే కనిపిస్తోంది.
తేలికైన పరిచయాలు...
ఇటీవల కాలంలో వ్యక్తిగత ఫోన్లు, సోషల్ మీడియాల కారణంగా పరిచయం తేలికవుతోంది. ఒకప్పుడు కేవలం బంధువులు, స్నేహితులు లేదా పరిచయస్తుల ద్వారా మాత్రమే కొత్తవారు పరిచయం అయ్యేవారు. అలా కాదంటే విద్యాసంస్థలు, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనే పరిచయాలు ఏర్పడేవి. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఏమాత్రం సంబంధం లేనివాళ్లు స్నేహితులుగా మారిపోతున్నారు. కొన్నాళ్లకు ఇదే ప్రేమగా మారి ఆపై ‘దెబ్బతింటోంది’.
అటకెక్కిన యువజన విధానం...
సమాజంలో మహిళలకున్న సమున్నత స్థానం, వారి హక్కులను యువతకు క్షుణ్నంగా బోధించాలన్న ఉద్దేశంతో కొన్నేళ్ల క్రితం రూపొందినదే జాతీయ యువజన వి«ధానం. మహిళలపై యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయసుల వారీగా రెండు గ్రూపులుగా విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మధ్య వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికున్న హక్కులపై మగపిల్లలకు అవగాహన కల్పించడంలో గానీ, మహిళల విషయంలో గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ ఇవ్వడంలో గానీ ప్రభుత్వాలు ఎంతటి ‘చిత్తశుద్ధిని’ చూపిస్తున్నాయో తెలుస్తూనే ఉంది.
తల్లిదండ్రులూ మారాలి...
ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోవడం వెనక పరోక్షంగా తల్లిదండ్రుల పాత్ర సైతం ఉంటుందని ప్రముఖ మానసిక నిపుణులు రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ‘యుక్తవయసు పిల్లల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం యాంత్రిక జీవితంలో పిల్లలపై శ్రద్ధ తగ్గింది. ఫలితంగా యూత్ పెడదారి పడుతోంది. సినిమా, టీవీల ప్రభావంతో ఒక్కోసారి హద్దులు మీరి ఇలాంటి ఉదంతాలకు పాల్పడుతున్నారు. మరోవైపు యువతీ యువకులు మాట్లాడుకుంటే అపార్థం చేసుకోవడమూ.. వారిలో లేని ఆలోచనలు రేకెత్తించినట్టే. పిల్లలను చేరదీసి జీవితం, భవిష్యత్తు విలువలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటే ఇలాంటి ఉదంతాలు పునరావృతం కావ’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment