lover died
-
ప్రియుడి ఆత్యహత్య.. అతడి బాటలోనే ప్రియురాలు
తూర్పు గోదావరి: ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి తనువు చాలించారు. ఈ ఘటనతో యానాంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక(22)కు ఓ అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది. రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలోఉంది. గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం రూ.500 అడిగితే.. తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అప్పట్నుంచి మౌనిక కళాశాలకు వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ.. మానసిక కుంగుబాటుతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై ఎస్సై నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Valentine's Day: ప్రేమ పేరుతో ఉన్మాదం.. ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు
భిన్న సంస్కృతుల సమ్మేళనం మన మహా నగరం. విభిన్న సంప్రదాయాల సంగమం మన హైదరాబాద్. ‘భాగ్య’నగరమే ప్రేమ పునాదిగా వెలసిందని కొందరి నమ్మకం. ఆ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి కొన్ని జంటలు. నగరంలోని కొన్ని ప్రాంతాలు. ప్రేమ అనే రెండు పదాలు మదిలో నాటుకున్న తర్వాత అవి వేద మంత్రాలై పెళ్లికి దారి తీస్తాయి. వివాహంతో ఒక్కటవుతాయి. కష్ట సుఖాలను పంచుకుంటాయి. నీతోటిదే లోకమంటూ కలకలం సాగుతాయి. ఇలాంటి ప్రేమలు కొన్ని అయితే.. మరికొన్ని పగతో రగులుతున్నవీ ఉన్నాయి. క్షణికావేశమో, పక్కా ప్లాన్‌తోనే ప్రేమనే అంతమోందించిన ఘటనలు ఉన్నాయి. మంగళవారం వలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు. పెళ్లి చేసుకోమన్నందుకు.. ఓల్డ్ అల్వాల్ సాయిబాబానగర్‌కు చెందిన సరస్వతి, భూదేవి నగర్‌కు చెందిన దీపక్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె అతడిపై ఒత్తిడి తెస్తోంది. కొన్నాళ్లు దాటవేత ధోరణి ప్రదర్శించిన అతగాడు చివరకు ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. స్నేహితులకు ఫోన్ చేసి చెప్పి మరీ ఆమెను చంపేశాడు. పెళ్లికి నిరాకరించినందుకు.. తనను ప్రేమించి పెళ్లి వద్దన్నందుకు యాప్రాల్ ప్రాంతానికి చెందిన గిరీష్ బాపూజీనగర్‌కు చెందిన చామంతిపై హత్యాయత్నం చేసి, తానూ ఆత్మహత్యకు యతి్నంచాడు. సదరు యువతిని వేధించిన కేసులో అతడు న్యాయ స్థానంలో జరిమానా చెల్లించడం గమనార్హం. ప్రేమించి మోసం చేసిందని... వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ బీఈడీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ సరూర్‌నగర్‌లో నివసిస్తున్నాడు. చదువుకునే రోజుల్లో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నా ఇటీవల ఆమె ఇతడిని దూరం పెట్టింది. దీంతో తనను మోసం చేసిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ పేరుతో ఉన్మాదం పేట్రేగి ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు..లైంగిక వేధింపులతో వెంటపడుతూ చేస్తున్న అఘాయిత్యాలు, ప్రేమ విఫలమైందనే కారణంగా ఆత్మహత్యలు నగరంలో జరుగుతూనే ఉన్నాయి. పదును లేని చట్టాలంటే పట్టని ఉన్మాదులు దాడులతో తెగపడుతున్నారు. అధికారిక గణాంకాల అటుంచితే పరువు, ప్రతిష్టలకు భయపడి జరిగిన అన్యాయంపై బాధితులు ఫిర్యాదు చేయని సందర్భాలు ఎన్నో. ప్రేమ నేపథ్యంలో జరుగుతున్న ఆత్మహత్యలు సైతం అనేకం ఉంటున్నాయి. అపరిపక్వతే ఈ దురాగతాలకు ప్రధాన కారణంగా మారుతోంది. సమాజంలో మహిళలకు సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందినదే జాతీయ యువజన విధానం. మహిళల పట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏళ్ల క్రితం నాటి ఈ విధానం లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిగా రెండు గ్రూపులుగా యువజన విధానంలో విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మధ్య వయస్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు అవగాహన కల్పించడంలో, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ చేయడంలో కానీ ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు. -
ప్రియుడు ఆత్మహత్య.. నువ్వు లేని జీవితం నాకొద్దు
పీలేరు రూరల్ : ‘నువ్వు లేని జీవితం నాకొద్దు’ అని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక కడప మార్గంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. రొంపిచెర్ల మండలం గానుగచింతకు చెందిన పాలమంద కృష్ణయ్య కుమారుడు పి.శివశంకర్ (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసేవాడు. అదే పంచాయతీ లోకవారిపల్లెకు చెందిన అబ్బునాయక్ కుమార్తె శిల్ప, శివశంకర్ పరస్పరం ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించినా కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన శిల్ప ఐదునెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే వర్క్ ఫ్రం హోంలో ఉన్న శివశంకర్ ఈ ఘటనపై తీవ్రంగా కుంగిపోయాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని తిరుపతిలోని తమ కుమార్తె ఇంటికి నెలక్రితం పంపారు. అంతేకాకుండా శిల్ప జ్ఞాపకాల నుంచి దూరం చేయాలని తలచి వివాహం చేస్తామని చెప్పడంతో తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న తిరుపతిలోని తన అక్క ఇంటి నుంచి శివశంకర్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా హలో అని..ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. ఈ పరిణామాల క్రమంలో పీలేరు–కడప మార్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ చింత చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు బలవన్మరణం చెంది ఉండటం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, శిల్పలేని జీవితం తనకు వద్దు.. అని తన వివరాలతో శివశంకర్ రాసి ఉన్న లేఖ అతడి జేబులో లభించింది. పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో..
సాక్షి, కర్నూలు: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో దాడిచేశాడు. ఈ ఘటనలో భార్య ప్రియుడు మృతి చెందగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గొనెగండ్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు అనే వ్యక్తి భార్య ఉరుకుందమ్మ గత కొన్నాళ్లుగా బజారీ అనే వ్యాక్తితో సహజీవనం చేస్తోంది. దీంతో కోపం పెంచుకున్న నాగరాజు వారిద్దరిపై కత్తి, బండరాళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బజారీ అక్కడికక్కడే మృతి చెందగా, ఉరుకుందమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు అక్రమ సంబంధమే కారణం అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడు నాగరాజు కోసం గాలిస్తున్నారు. చదవండి: వైఎస్సార్ కడప: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం: ప్రియురాలి మృతి
కర్నూలు: తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే మనస్ధాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ప్రియురాలు చనిపోగా, ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వహీదా, మధు ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో ఇద్దరూ తమ ఇళ్లలోనే శుక్రవారం రాత్రి పురుగుమందు తాగారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులు చూసేసరికి వహీదా మృతి చెందింది. మధును తల్లిదండ్రులు బనగానిపల్లె ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. -
ప్రియురాలి కోసం వెళ్లి...
తెనాలిరూరల్(గుంటూరు): ప్రేయసిని కలుసుకునేందుకు వెళ్లిన ఓ ప్రేమికుడు మృత్యుఒడికి చేరాడు. ప్రేయసిని కలిసేందుకు కర్ణాటక వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రియురాలి కుటుంబసభ్యులే హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రులు గౌరీ మహాలక్ష్మి, నాగేశ్వరరావు, సోదరుడు పురుషోత్తం శనివారం సాయంత్రం న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాలివీ.. తెనాలి గంగానమ్మపేటకు చెందిన కరప మధు(24)కు రెండేళ్ల క్రితం ఇక్కడి బోస్రోడ్డులోని ఓ కోచింగ్ సెంటరులో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన శ్వేతకుమారి అలియస్ సోని పరిచయమైంది. కొన్నాళ్లకు వీరి స్నేహం ప్రేమగా మారింది. పోస్టల్ శాఖ పరీక్షలకు తెనాలిలో కోచింగ్ తీసుకుంటున్న సోని అప్పట్లో మధు ఇంటికి వెళ్లి తాము ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని అతని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే మధు ప్రభుత్వోద్యోగం సంపాదించాలని చెప్పడంతో అప్పటి వరకు పోస్టల్ కోచింగ్ తీసుకుంటూ సెల్ఫోన్ల షోరూంలో పని చేస్తున్న అతను ఉద్యోగాన్ని వదిలేసి విజయవాడలోని మరో కోచింగ్ సెంటరులో శిక్షణకు చేరాడు. శ్వేత అతనితో పాటే విజయవాడలో శిక్షణకు వెళ్లింది. ఏడు నెలల క్రితం పోస్టల్ శాఖలో ఉద్యోగం నిమిత్తం శ్వేత సొంతూరుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెను కలిసేందుకు సెప్టెంబర్ 25వ తేదీన మధు అక్కడికి వెళ్లాడు. 27వ తేదీన తండ్రికి ఫోను చేసి శ్వేతను కలిశానని, సోమవారం వచ్చేస్తున్నట్టు చెప్పాడు. అయితే, 28వ తేదీన కర్ణాటక మానవి పోలీసులు ఫోను చేసి మధు హత్యకు గురయ్యాడని అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మధు మృతదేహం కాలిపోయి ఉండటాన్ని చూసిన అతని తల్లిదండ్రులు, తమను కూడా చంపేస్తారనే భయంతో పోలీసులకు ఏమీ చెప్పకుండా తిరిగి వచ్చేశారు. మధును శ్వేతకుమారి కుటుంబసభ్యులే హత్య చేశారని గౌరిమహాలక్ష్మి, నాగేశ్వరరావు శనివారం నాడు ఆరోపించారు. బంధువులు, పెద్దలు ధైర్యం చెప్పడంతో ఇదే విషయాన్ని మానవి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : ప్రియుడి మృతి
గోదావరిఖని (కరీంనగర్) : కడ వరకూ ఒకరికి ఒకరు తోడుందామని ఊసుల బాసలు చెప్పుకున్న ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా, ప్రియురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలోని గోదావరి వంతెన వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖనిలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన రహీం(28) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలానికి చెందిన అలేఖ్య(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నా.. అప్పటికే రహీంకు పెళ్లి కావడంతో.. ఏం చేయాలో అర్ధంకాని ప్రేమ జంట శనివారం అర్ధరాత్రి వంతెనపై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యాయత్నానికి ముందే తాము ఈ లోకాన్ని వీడి వెళ్లిపోతున్నామని రహీం తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో అతని స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే రహీం మృతిచెందాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అలేఖ్యను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. రహీం భార్య నిండు గర్భవతి అని తెలిసింది.