భిన్న సంస్కృతుల సమ్మేళనం మన మహా నగరం. విభిన్న సంప్రదాయాల సంగమం మన హైదరాబాద్. ‘భాగ్య’నగరమే ప్రేమ పునాదిగా వెలసిందని కొందరి నమ్మకం. ఆ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి కొన్ని జంటలు. నగరంలోని కొన్ని ప్రాంతాలు. ప్రేమ అనే రెండు పదాలు మదిలో నాటుకున్న తర్వాత అవి వేద మంత్రాలై పెళ్లికి దారి తీస్తాయి.
వివాహంతో ఒక్కటవుతాయి. కష్ట సుఖాలను పంచుకుంటాయి. నీతోటిదే లోకమంటూ కలకలం సాగుతాయి. ఇలాంటి ప్రేమలు కొన్ని అయితే.. మరికొన్ని పగతో రగులుతున్నవీ ఉన్నాయి. క్షణికావేశమో, పక్కా ప్లాన్‌తోనే ప్రేమనే అంతమోందించిన ఘటనలు ఉన్నాయి. మంగళవారం వలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు.
పెళ్లి చేసుకోమన్నందుకు..
ఓల్డ్ అల్వాల్ సాయిబాబానగర్‌కు చెందిన సరస్వతి, భూదేవి నగర్‌కు చెందిన దీపక్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె అతడిపై ఒత్తిడి తెస్తోంది. కొన్నాళ్లు దాటవేత ధోరణి ప్రదర్శించిన అతగాడు చివరకు ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. స్నేహితులకు ఫోన్ చేసి చెప్పి మరీ ఆమెను చంపేశాడు.
పెళ్లికి నిరాకరించినందుకు..
తనను ప్రేమించి పెళ్లి వద్దన్నందుకు యాప్రాల్ ప్రాంతానికి చెందిన గిరీష్ బాపూజీనగర్‌కు చెందిన చామంతిపై హత్యాయత్నం చేసి, తానూ ఆత్మహత్యకు యతి్నంచాడు. సదరు యువతిని వేధించిన కేసులో అతడు న్యాయ స్థానంలో జరిమానా చెల్లించడం గమనార్హం.
ప్రేమించి మోసం చేసిందని...
వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ బీఈడీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ సరూర్‌నగర్‌లో నివసిస్తున్నాడు. చదువుకునే రోజుల్లో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నా ఇటీవల ఆమె ఇతడిని దూరం పెట్టింది. దీంతో తనను మోసం చేసిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమ పేరుతో ఉన్మాదం పేట్రేగి ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు..లైంగిక వేధింపులతో వెంటపడుతూ చేస్తున్న అఘాయిత్యాలు, ప్రేమ విఫలమైందనే కారణంగా ఆత్మహత్యలు నగరంలో జరుగుతూనే ఉన్నాయి. పదును లేని చట్టాలంటే పట్టని ఉన్మాదులు దాడులతో తెగపడుతున్నారు. అధికారిక గణాంకాల అటుంచితే పరువు, ప్రతిష్టలకు భయపడి జరిగిన అన్యాయంపై బాధితులు ఫిర్యాదు చేయని సందర్భాలు ఎన్నో.
ప్రేమ నేపథ్యంలో జరుగుతున్న ఆత్మహత్యలు సైతం అనేకం ఉంటున్నాయి. అపరిపక్వతే ఈ దురాగతాలకు ప్రధాన కారణంగా మారుతోంది. సమాజంలో మహిళలకు సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందినదే జాతీయ యువజన విధానం.
మహిళల పట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏళ్ల క్రితం నాటి ఈ విధానం లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిగా రెండు గ్రూపులుగా యువజన విధానంలో విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మధ్య వయస్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు.
ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు అవగాహన కల్పించడంలో, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ చేయడంలో కానీ ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment