తూర్పు గోదావరి: ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి తనువు చాలించారు. ఈ ఘటనతో యానాంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక(22)కు ఓ అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది.
రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలోఉంది. గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం రూ.500 అడిగితే.. తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
అప్పట్నుంచి మౌనిక కళాశాలకు వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ.. మానసిక కుంగుబాటుతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై ఎస్సై నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment