కరప మధు, శ్వేతకుమారి(ఫైల్)
తెనాలిరూరల్(గుంటూరు): ప్రేయసిని కలుసుకునేందుకు వెళ్లిన ఓ ప్రేమికుడు మృత్యుఒడికి చేరాడు. ప్రేయసిని కలిసేందుకు కర్ణాటక వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రియురాలి కుటుంబసభ్యులే హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రులు గౌరీ మహాలక్ష్మి, నాగేశ్వరరావు, సోదరుడు పురుషోత్తం శనివారం సాయంత్రం న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాలివీ..
తెనాలి గంగానమ్మపేటకు చెందిన కరప మధు(24)కు రెండేళ్ల క్రితం ఇక్కడి బోస్‌రోడ్డులోని ఓ కోచింగ్ సెంటరులో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన శ్వేతకుమారి అలియస్ సోని పరిచయమైంది. కొన్నాళ్లకు వీరి స్నేహం ప్రేమగా మారింది. పోస్టల్ శాఖ పరీక్షలకు తెనాలిలో కోచింగ్ తీసుకుంటున్న సోని అప్పట్లో మధు ఇంటికి వెళ్లి తాము ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని అతని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే మధు ప్రభుత్వోద్యోగం సంపాదించాలని చెప్పడంతో అప్పటి వరకు పోస్టల్ కోచింగ్ తీసుకుంటూ సెల్‌ఫోన్ల షోరూంలో పని చేస్తున్న అతను ఉద్యోగాన్ని వదిలేసి విజయవాడలోని మరో కోచింగ్ సెంటరులో శిక్షణకు చేరాడు. శ్వేత అతనితో పాటే విజయవాడలో శిక్షణకు వెళ్లింది.
ఏడు నెలల క్రితం పోస్టల్ శాఖలో ఉద్యోగం నిమిత్తం శ్వేత సొంతూరుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెను కలిసేందుకు సెప్టెంబర్ 25వ తేదీన మధు అక్కడికి వెళ్లాడు. 27వ తేదీన తండ్రికి ఫోను చేసి శ్వేతను కలిశానని, సోమవారం వచ్చేస్తున్నట్టు చెప్పాడు. అయితే, 28వ తేదీన కర్ణాటక మానవి పోలీసులు ఫోను చేసి మధు హత్యకు గురయ్యాడని అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
మధు మృతదేహం కాలిపోయి ఉండటాన్ని చూసిన అతని తల్లిదండ్రులు, తమను కూడా చంపేస్తారనే భయంతో పోలీసులకు ఏమీ చెప్పకుండా తిరిగి వచ్చేశారు. మధును శ్వేతకుమారి కుటుంబసభ్యులే హత్య చేశారని గౌరిమహాలక్ష్మి, నాగేశ్వరరావు శనివారం నాడు ఆరోపించారు. బంధువులు, పెద్దలు ధైర్యం చెప్పడంతో ఇదే విషయాన్ని మానవి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు.