lovers couple
-
ప్రియురాలు పిలిచింది.. మొత్తం దోచేసింది
బనశంకరి: ప్రేమ అనే పదానికి మచ్చ తెచ్చేలా ఆ ప్రియురాలు వ్యవహరించింది. ప్రియున్ని అపహరించి దోపిడీకి పాల్పడి చివరకు కటకటాల పాలైంది. ఏపీలోని నెల్లూరుకు చెందిన ప్రేమ జంట వ్యవహారం బెంగళూరులో రచ్చయింది. పెనుకొండకు పిలిపించి.. కోరమంగళ పోలీసులు తెలిపిన ప్రకారం... నెల్లూరుకు చెందిన శివ, మోనిక అనే యువతీ యువకులు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అతడు నెల్లూరులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. శివతో బాగా డబ్బు, బంగారం ఉన్నట్లు భావించిన మోనికలో దుర్బుద్ధి పుట్టింది. అతనిని కిడ్నాప్ చేసి బాగా వసూలు చేయాలని తనకు తెలిసినవారితో కుట్ర పన్నింది. ఆ ప్రకారం 4 రోజుల కిందట శివకు ఫోన్ చేసింది, నిన్ను నా స్నేహితులు చూడాలని, బంగారు నగలు ధరించి ఇన్నోవా కారులో రావాలని ఫోన్లో తెలిపింది. మోనిక మాటలను నమ్మిన శివ 60 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇన్నోవా కారులో పుట్టపర్తి జిల్లా హిందూపురం వద్ద పెనుకొండకు వచ్చాడు. అక్కడ మోనిక అనుచరులు శివను కారులోనే అపహరించి బంగారు ఆభరణాలు దోచుకుని పావగడకు తీసుకెళ్లి ఓ హోటల్లో బంధించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివ తన స్నేహితులతో మాట్లాడి తన బ్యాంక్ ఖాతాలోకి రూ.5 లక్షలు జమ చేయించాడు. ఏటీఎం కార్డు తెప్పించి.. డబ్బు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు లేదు, దీంతో నెల్లూరులో ఇంటి నుంచి బెంగళూరు మెజిస్టిక్ అడ్రస్‌కు కొరియర్ చేయించుకుని శనివారం రాత్రి బెంగళూరులోని కోరమంగలలో నగదు డ్రా చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో కిడ్నాపర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. గస్తీలో ఉన్న ఎస్ఐ మాదేశ్ అనుమానంతో వారిని విచారించగా కిడ్నాప్ కథ వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు మోనిక, హరీశ్, హరికృష్ణ, నరేశ్, రాజ్‌కుమార్, నరసింహ, అంజనీల్ అనే ఏడుమందిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లు కూడా నెల్లూరుకు చెందినవారని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. నిందితుల్లో ఇద్దరిపై 5 కు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రియురాలే దోపిడీకి సూత్రదారి అని తెలుసుకుని ప్రియుడు షాక్‌కు గురయ్యాడు. కేసు విచారణలో ఉందని డీసీపీ తెలిపారు. -
ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో....
శంషాబాద్: ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుమన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కొత్వాల్‌గూడకు చెందిన సిద్దాంతి చంద్రయ్య కుమారుడు సిద్దాంతి శివ (23) ఆటో డ్రైవర్. అదే బస్తీకి చెందిన యువతిని ప్రేమించాడు. ఇటీవల యువతికి వారి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం చేయడంతో పాటు తాంబులాలు మార్చుకున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు మూడురోజుల కిందట శివ ఫోన్‌ను తీసుకుని అందులో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో పాటు అమ్మాయి జోలికి రావొద్దని హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి ఆటోతో బయలుదేరిన శివ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. చెన్నమ్మ హోటల్ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబానికి అండగా ఉన్న కుమారుడు చనిపోయాడని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. యువతి కుటుంబ సభ్యుల బెదిరింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఇంటి ముందు బైఠాయింపు కాగా శివ ఆత్మహత్య ఘటన కొత్వాల్‌గూడలో ఉద్రిక్తతకు దారితీసింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, బస్తీవాసులు సిద్దాంతి శివ మృతదేహాన్ని యువతి ఇంటి ముందు పెట్టి బైఠాయించారు. అక్కడే గోతి తవ్వి పూడ్చివేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. యువతి కుటుంబ సభ్యులే శివ మృతికి కారణమని నినాదాలు చేశారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ శ్రీనివాస్, ఏసీపీ భాస్కర్లు గ్రామానికి చేరుకుని బాధితులు, బస్తీ వాసులను సముదాయించారు. మృతదేహాన్ని తీసుకెళ్లినప్పటికీ రాత్రి 9.30 గంటలకు ఖననం చేయలేదు. శివ శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు ఊ రుకునేది లేదన్నారు. రాత్రి వరకు కూడా పోలీసులు సముదాయించినప్పటికీ కొత్వాల్‌గూడలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. -
రక్షణ కల్పించండి
సాక్షి, చైన్నె: కులాంతర వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ జంట ధర్మపురి ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగింది. తమను పరువు హత్య చేయడానికి కుటుంబ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ధర్మపురి జిల్లా హనుమంతపురానికి చెందిన కలయరసి(23), కృష్ణగిరికి చెందిన వెంకటేష్ (25) గత కొన్నేళ్లుగా ప్రేమిస్తూ వచ్చారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. గతవారం కలయరసి ఇంటి నుంచి పారి పోయింది. తమ కుమార్తె కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేశారంటూ కలయరసి తల్లిదండ్రులు కారమంగళం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రేమజంట రెండు రోజుల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి కోసం ఇరు కుటుంబాల పెద్దలు గాలింపు మొదలెట్టారు. దీంతో ఆందోళనతో ఈ జంట తమకు రక్షణ కల్పించాలని తొలుత కార మంగళం పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. కలయరసి కుటుంబంతో ఢీకొట్టే సాహసం చేయలేక అక్కడి పోలీసులు చేతులెత్తేశారు. తాము భద్రత కల్పించలేమని స్పష్టం చేయడంతో ఈ జంట ప్రాణ భయంతో ధర్మపురి జిల్లా కేంద్రానికి శుక్రవారం ఉదయం చేరుకుంది. ఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైటాయించింది. తమకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో తమను పరువు హత్య చేస్తారని ఆందోళన వ్యక్త ంచేశారు. ఈసమయంలో అక్కడ ఎస్పీ లేకపోవడంతో భద్రతలో ఉన్న సిబ్బంది ఆ జంటను బుజ్జగించారు. తాము ఉన్నామని భరోసా ఇస్తూ, ఆందోళను విరమింప చేశారు. ఆ జంటను భద్రత నడుమ ఎస్పీ కార్యాలయంలో ఉంచారు. -
ప్రేమజంట ఆత్మహత్య.. కారణం అదేనా..?
కొరాపుట్: ఒకే చెట్టు కొమ్మకు ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన నబరంగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని డాబుగాం పోలీస్‌స్టేషన్ పరిధి పపడాహండి సమితి జబాగుడ గ్రామ సమీపంలోని జీడితోటలో అదే గ్రామానికి చెందిన తిలై హరిజన్(18), దమాపల్లి గ్రామానికి చెందిన డోంబురు హరిజన్(19)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ మంగళవారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో గ్రామస్తులు తీవ్రంగా గాలించారు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించారు. మృతురాలి అన్న మృతుడి అక్కను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బంధువులు అయినప్పటికీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) ఇది కూడా చదవండి: మీరు నాకు నచ్చారు.. పెళ్లి చేసుకుందాం.. చివరికి ఊహించని ట్విస్ట్ -
ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన
శ్రీరాంపూర్(మంచిర్యాల): తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి ప్రియుడి ఇంటిఎదుట ఆదివారం ఆందోళన చేపట్టింది. శ్రీరాంపూర్ అరుణక్కనగర్‌కు చెందిన ఈద సంధ్యారాణి అదే ప్రాంతానికి చెందిన దాట్ల రోహిత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొదట్లో వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వాపోయింది. అతని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ తప్పించుకుంటున్నాడని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలిపింది. రోహిత్ కుటుంబం తనకు న్యాయం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తానని పేర్కొంది. సంధ్యారాణి తండ్రి నర్సయ్య గతంలోనే చనిపోగా తల్లి విజయ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఓ చెల్లి కూడా ఉంది. కుటుంబంలో పెద్దదిక్కులేని తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది. -
నిన్న ప్రేమ పెళ్లి... నేడు ఆత్మహత్య
-
పెళ్లి చేసుకోమంటే నిప్పు పెట్టాడు!
బాధితురాలు బీటెక్ విద్యార్థిని, పరిస్థితి విషమం సాక్షి, నల్లగొండ: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రేమికురాలిపై కిరోసిన్‌పోసి నిప్పంటిం చాడో ఘనుడు. ఈ ఘటన మంగళవారం నల్లగొండలో జరిగింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ నిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇదే మండల పరిధిలోని దర్వేశిపురానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నకిరేకంటి సైదులు, అరుణ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌లో ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. అప్పటికే వివాహం జరిగిన సైదులుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని అరుణ కొంతకాలంగా అడుగుతూ వస్తోంది. ఈ క్రమంలో సైదులు తన కార్యాలయంలోకి మధ్యాహ్నం సమయంలో ఆమెను పిలిచాడు. ఒక్కసారిగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అరుణకు 95 శాతానికిపైగా గాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రేమజంటకు పోలీసుల కౌన్సెలింగ్
కామేపల్లి, న్యూస్‌లైన్: తాము ప్రేమించుకున్నామని, వివాహం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించిన ఓ ప్రేమ జంటకు కామేపల్లి ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గోవింద్రాలకు చెంది న లకావత్ గీత, రఘునాధపాలెం మండలం బూడిదెంపాడుకు చెందిన కేలోత్ రమేష్ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరు కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో రమేష్ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని గీత తండ్రి లాల్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమజంట పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రేమజంటకు, వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ తనకు ఒకరోజు గడువు కావాలని రమేష్ అడుగడంతో వివాహం నిలిచిపోయింది. ఇద్దరు మేజర్లు కావడంతో తప్పని సరిగా వివాహం చేసుకోవాలని లేకుంటే కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు