రోడ్డుపై బైఠాయించిన ప్రేమజంట
సాక్షి, చైన్నె: కులాంతర వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ జంట ధర్మపురి ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగింది. తమను పరువు హత్య చేయడానికి కుటుంబ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ధర్మపురి జిల్లా హనుమంతపురానికి చెందిన కలయరసి(23), కృష్ణగిరికి చెందిన వెంకటేష్ (25) గత కొన్నేళ్లుగా ప్రేమిస్తూ వచ్చారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు వ్యతిరేకించారు.
గతవారం కలయరసి ఇంటి నుంచి పారి పోయింది. తమ కుమార్తె కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేశారంటూ కలయరసి తల్లిదండ్రులు కారమంగళం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రేమజంట రెండు రోజుల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి కోసం ఇరు కుటుంబాల పెద్దలు గాలింపు మొదలెట్టారు. దీంతో ఆందోళనతో ఈ జంట తమకు రక్షణ కల్పించాలని తొలుత కార మంగళం పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. కలయరసి కుటుంబంతో ఢీకొట్టే సాహసం చేయలేక అక్కడి పోలీసులు చేతులెత్తేశారు.
తాము భద్రత కల్పించలేమని స్పష్టం చేయడంతో ఈ జంట ప్రాణ భయంతో ధర్మపురి జిల్లా కేంద్రానికి శుక్రవారం ఉదయం చేరుకుంది. ఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైటాయించింది. తమకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో తమను పరువు హత్య చేస్తారని ఆందోళన వ్యక్త ంచేశారు. ఈసమయంలో అక్కడ ఎస్పీ లేకపోవడంతో భద్రతలో ఉన్న సిబ్బంది ఆ జంటను బుజ్జగించారు. తాము ఉన్నామని భరోసా ఇస్తూ, ఆందోళను విరమింప చేశారు. ఆ జంటను భద్రత నడుమ ఎస్పీ కార్యాలయంలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment