శంషాబాద్: ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుమన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కొత్వాల్‌గూడకు చెందిన సిద్దాంతి చంద్రయ్య కుమారుడు సిద్దాంతి శివ (23) ఆటో డ్రైవర్. అదే బస్తీకి చెందిన యువతిని ప్రేమించాడు. ఇటీవల యువతికి వారి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం చేయడంతో పాటు తాంబులాలు మార్చుకున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు మూడురోజుల కిందట శివ ఫోన్‌ను తీసుకుని అందులో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో పాటు అమ్మాయి జోలికి రావొద్దని హెచ్చరించారు.
మంగళవారం రాత్రి ఇంటి నుంచి ఆటోతో బయలుదేరిన శివ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. చెన్నమ్మ హోటల్ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబానికి అండగా ఉన్న కుమారుడు చనిపోయాడని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. యువతి కుటుంబ సభ్యుల బెదిరింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువతి ఇంటి ముందు బైఠాయింపు
కాగా శివ ఆత్మహత్య ఘటన కొత్వాల్‌గూడలో ఉద్రిక్తతకు దారితీసింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, బస్తీవాసులు సిద్దాంతి శివ మృతదేహాన్ని యువతి ఇంటి ముందు పెట్టి బైఠాయించారు. అక్కడే గోతి తవ్వి పూడ్చివేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. యువతి కుటుంబ సభ్యులే శివ మృతికి కారణమని నినాదాలు చేశారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
సీఐ శ్రీనివాస్, ఏసీపీ భాస్కర్‌లు గ్రామానికి చేరుకుని బాధితులు, బస్తీ వాసులను సముదాయించారు. మృతదేహాన్ని తీసుకెళ్లినప్పటికీ రాత్రి 9.30 గంటలకు ఖననం చేయలేదు. శివ శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు ఊ రుకునేది లేదన్నారు. రాత్రి వరకు కూడా పోలీసులు సముదాయించినప్పటికీ కొత్వాల్‌గూడలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment