Low interest
-
Pre-Budget Meet: ప్రోత్సాహకాలు.. తక్కువ వడ్డీ రేటు కావాలి!
న్యూఢిల్లీ: దేశం నుంచి ఎగుమతుల పురోగతికి అలాగే ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్లో ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని ఎగుమతిదారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని, తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 5వ ప్రీ–బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె గురువారం ఎగుమతి సంఘాలు, సేవా రంగాల ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరిసహా ఆ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగుమతి రంగం ప్రతినిధులు చేసిన పలు విజ్ఞప్తుల్లో ముఖ్యాంశాలు... ► డాలర్ మారకంలో రూపాయి బలహీనత వల్ల ఎగుమతుల పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఎగుమతి సంఘాల భారత సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ ఎగుమతుల విలువ 460–470 బిలియన్ డాలర్ల వరకూ పురోగమించేందుకు (2021–22లో 400 బిలియన్ డాలర్లు) మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) కింద ప్రకటించిన రూ.200 కోట్లు సముద్రంలో నీటి బొట్టని కూడా సమాఖ్య పేర్కొంది. ‘కాబట్టి, పటిష్ట ఎగుమతుల మార్కెటింగ్ కోసం, గత సంవత్సరం ఎగుమతుల విలువలో కనీసం 0.5 శాతం కార్పస్‌తో ఎగుమతి అభివృద్ధి నిధిని సృష్టించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించింది. అలాగే సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ద్వారా ఎగుమతి చేసే వస్తువుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని సూచించింది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ), టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేయబడిన పన్ను) రద్దు ద్వారా విధానపరమైన సరళీకరణలు జరగాలని విజ్ఞప్తి చేసింది. దేశీ మార్కెటింగ్ కోసం ఎగుమతిదారులు చేసే వ్యయాలపై 200 శాతం పన్ను మినహాయింపు కోరింది. గ్లోబల్ ఇండియన్ షిప్పింగ్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలను పొడిగించాలని సూచించింది. ఎంఎస్ఎంఈకి పన్ను రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కీలక సూచనలు చేస్తూ, విమానాశ్రయంలో విదేశీ పర్యాటకులకు పన్ను రిఫండ్ చేయాలని కోరింది. దీనివల్ల పర్యాటకం రంగం పురోగతితోపాటు హస్తకళలు, తివాచీలు, ఖాదీ, తోలు వస్తువుల ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది. ► వెట్ బ్లూ క్రస్ట్, ఫినిష్డ్ లెదర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పునరుద్ధరించాలని సమావేశంలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ (సీఎల్ఈ) డిమాండ్ చేసింది. హ్యాండ్‌బ్యాగ్‌లు, వస్త్రాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఎగుమతిదారులు ప్రధానంగా ఇటువంటి తోలులను దిగుమతి చేసుకుంటారు. ఫినిష్డ్ లెదర్ డ్యూటీ–ఫ్రీ దిగుమతి తయారీదారుల పోటీ తత్వం మరింత మెరుగుపడ్డానికి ఈ చర్య దోహపదడుతుందని తెలిపింది. ► ముడి సిల్క్, సిల్క్ నూలు (15 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకం), ముడి పత్తి (సుంకం రహితం), రాగి ఖనిజాలు వంటి అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకాలను సవరించాలని ఎగుమతిదారులు సూచించారు, భారతదేశ ఎగుమతులు ప్రతికూల భూభాగంలోకి ప్రవేశించాయి. ► విస్తృత పన్ను రాయితీ ప్రయోజనాలతో డిమాండ్‌ను ప్రోత్సహించడం ద్వారా వినియోగాన్ని పెంచాలని పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కోరింది. ► ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎ శక్తివేల్సహా విప్రో లిమిటెడ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేఈపీసీ), తమిళనాడు, కలకత్తా, ఉత్తర అస్సోంకు చెందిన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌తో సహా పలు కంపెనీలు, వాణిజ్య, పరిశ్రమల సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఫేస్బుక్ లోన్లు.. హైదరాబాదీలకు అవకాశం
Small Business Loan Initiative: చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఫేస్బుక్ ముందుకు వచ్చింది. వీరికి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఆగస్టు 20 నుంచి ఈ లోన్లు ఇస్తామని ఫేస్బుక్ ఇండియా ప్రకటించింది. స్మాల్ బిజినెస్ లోన్ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై ఈ రోజు అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఫేస్బుక్. లక్షల కోట్ల రూపాయల సంపద ఈ రోజు ఫేస్బుక్ సొంతం. దీంతో తనలాగే ఎదుగుతోన్న స్టార్టప్‌లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పేరుతో గతేడాది 100 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది. ఇండియాఫై ద్వారా స్మాల్ బిజినెల్ లోన్ పథకం అమలు చేసేందుకు ఇండిఫై సంస్థతో ఫేస్బుక్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఇండిఫై సంస్థ చిరు వ్యాపారులకు లోన్లు అందించే సంస్థగా పని చేస్తోంది. ఫేస్బుక్ స్మాల్బిజినెస్ లోన్లు పొందాలనుకునేవారు ఇండియాఫై ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా స్మాల్ బిజినెస్ లోన్ పథకంలో భాగంగా ఇండియాకు 4 మిలియన్ డాలర్లు కేటాయించింది. వీటితో దేశంలో ఉన్న 200 పట్టణాల్లోని చిరు, మధ్యతరహా వ్యాపారులకు లోన్లు ఇవ్వనున్నారు. కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తారు. తొలివిడతగా ఆగస్టు 20వ తేది నుంచి ఈ పథకాన్ని హైదరాబాద్, న్యూఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరులలో అమలు చేయనున్నారు. కనీసం మూడు వేల మందికి అయినా లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ వడ్డీ ఫేస్బుక్లో ప్రకటనలు ఇవ్వడానికి వస్తున్న అనేక స్టార్టప్ కంపెనీలు పెట్టుబడి దొరక్క ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించాం. అందుకే వారికి అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పథకానికి శ్రీకారం చుట్టినట్టు ఫేస్బుక్ ఇండియా, వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మోహన్ అన్నారు. స్మాల్బిజినెస్ ద్వారా ఇచ్చే లోన్‌కి నామమాత్రపు వడ్డీ తీసుకుంటామన్నారు. ఇక మహిళా వ్యాపారులకయితే వడ్డీలో అదనంగా 0.20 శాతం రాయితీతో రుణాలు ఇస్తామన్నారు. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే -
స్త్రీపెన్నిధి
సంగారెడ్డిజోన్ : పేద, నిరుపేదలకు స్వల్పకాలంలో అతి తక్కువ వడ్డీతో అవసరానికి అప్పు అందించడానికి మహిళలకు పెన్నిధిలా స్త్రీనిధి చేయూతనిస్తోంది. దీన్ని మహిళా సంఘాల సభ్యుల కోసం 2011 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామీణ ప్రజలు వివిధ ఆర్థిక అవసరాలు, పెట్టుబడుల కోసం మైక్రో ఫైనాన్స్‌లను ఆశ్రయించి అధిక వడ్డీతో పాటు విలువైన ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్‌లను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నియంత్రించి మహిళలకు ఊరట కలిగించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011లో ఏడాదికి 12.5శాతం వడ్డీతో ఎలాంటి డాక్యుమెంట్లు, ఇతర ఖర్చులు లేకుండా రుణాలు నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అయ్యేలా స్త్రీ నిధి పథకం రూపొందించారు. సంఘంలోని సభ్యులు స్త్రీనిధి రుణం కోసం ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఫోన్ ద్వారా నేరుగా సమాచారం అందించిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో రుణం సొమ్ములు జమ అవుతాయి. ఈ వ్యవస్థలో నగదు లావాదేవీలు ఉండకపోవడం వల్ల అవినీతికి చోటులేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. ఈ ఏడాది స్త్రీ నిధి రుణాలు 60 నుంచి 70శాతం ఆదాయం ఉత్పత్తికి వాడాల్సిందిగా లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. రూ. 25 వేల వరకు ఫోన్ ద్వారా ఆపైన రూ. లక్ష వరకు ఎన్ఆర్ఎల్ఎం ద్వారా దరఖాస్తు చేసిన వారంలోగా రుణాలు అందిస్తారు. మన రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ఇటీవల 4వ సర్వసభ్య సమావేశం నిర్వహించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లాకు మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా అవార్డు అందజేశారు. జిల్లాలోని 26 మండలాల్లో, మూడు మున్సిపాలిటీల (సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్) పరిధిలో 21,309 ఎస్ఎన్జీ సంఘాలు నమోదు కాగా 2,32,115 మంది సభ్యులు ఉన్నారు. మొదటి ఏడాది స్త్రీ నిధి కింద సభ్యులకు రూ. లక్ష 50 వేల వరకు రుణం మంజూరు చేయగా వారు తిరిగి 24 నెలల గడువులో చెల్లించాల్సి ఉంటుంది. జీవనోపాధి పెంపుకోసం, వ్యాపారాల విస్తరణ కోసం సంఘంలోని మరో ఇద్దరు సభ్యులకు రూ.50 వేల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 2017 మార్చి 31 నాటికి రూ. 67.62 కోట్ల రుణాల వితరణ ప్రణాళిక లక్ష్యం కాగా రూ. 64.21 కోట్లను సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. వీటి వల్ల 6వేల 6 సంఘాలకు లబ్ది చేకూరింది. అత్యధికంగా నారాయణఖేడ్, హత్నూర, గుమ్మడిదల, కొండాపూర్ మండలాల పరిధిలోని ఎస్‌హెచ్‌జీ సంఘాలు స్త్రీ నిధి రుణాలు లక్ష్యాన్ని అధిగమించి పొందగా అత్యల్పంగా మొగుడంపల్లి, కల్హెర్, నాగల్గిద్ద మండలాలు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయాయి. మూడో స్థానంతో సరి.. జిల్లా గతంలో రుణాల పంపిణీ, రికవరీలో ప్రథమ, ద్వితీయస్థానంలో ఉండేది. కానీ వెనుకబడిన ప్రాంతాల్లో సకాలంలో రుణాల రికవరీని ఆన్లైన్లో అప్లోడ్ చేయలేకపోయారు. దీంతో నిర్ధేశించిన సమయానికి రికవరీలో వెనుకబడడం వల్ల సాంకేతికంగా జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమన్వయంతో సాధించాం కలెక్టర్, డీఆర్డీఓ, క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ సమీక్షలు నిర్వహించాం. క్లస్టర్లవారీగా డీపీఎంలతో కలిసి సమావేశాలు, ఆర్ఎం అనంతకిశోర్ ప్రోత్సాహం వల్ల రుణాల పంపిణీ, రికవరీలోనూ మెరుగైన ఫలితాలను సాధించాం. గతంలో ఉన్న నంబర్ వన్ స్థానానికి చేరుకునేలా మరింత కృషి చేస్తాం. – ఏపీడీ సిద్ధారెడ్డి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడతాయి స్త్రీనిధి రుణాలు సకాలంలో అందించడంతోపాటు తిరిగి రికవరీ చేయడంలో సిబ్బంది, సభ్యుల పాత్ర చాలా కీలకమైంది. ఈ రుణాలను ఆదాయ ఉత్పత్తికి వినియోగిస్తే కుటుంబాలు పురోభివృద్ధి సాధిస్తాయి. నిరుపేదలు, పేదలు, గేదెలు, పశువులు, మేకల కొనుగోలుకు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. – చంద్రకళ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
నమ్మించి.. మోసగించారు
ప్రొద్దుటూరు క్రైం : తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మబలకడంతో రూ.4 వేలు చొప్పున డబ్బు చెల్లించి పలువురు మహిళలు మోసపోయారు. జిల్లాలోని ఖాజీపేటతో పాటు పలు ప్రాంతాల్లో వందలాది మంది మహిళలు మోసపోయిన సంగతి తెలిసిందే. తాము మోసపోయామని తెలుసుకున్న మ హిళలు ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ఫిర్యా దు చేస్తున్నారు. తాజాగా ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్రాంతంలో ఉన్న సుమా రు 60 మందికి పైగా మహిళలు త్రీ టౌన్ పోలీస్‌స్టేష్‌లో ఫిర్యాదు చేశారు. బొల్లవరంలోని పెద్దమ్మ చెట్టు, క్రిస్టియన్ కాలనీ, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో, సాయికుటీర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పలువురు మహిళలు డబ్బు కట్టిన వారిలో ఉన్నారు. కుక్కర్‌ను ఎరగా వేసి.. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఒక వ్యక్తి బొల్లవరానికి వచ్చాడు. తమది పెద్ద సంస్థ అని, ప్రధాన కార్యాలయం గుంటూరులో ఉందని మహిళలతో అన్నా డు. మైదుకూరులో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లాలోని పేద మహిళలకు రుణాలు ఇస్తున్నామని చెప్పాడు. ఒక్క రూపాయి వడ్డీకే రూ.40వేలు ఇస్తామని, ఈ మొత్తాన్ని నెలకు రూ.2వేలు చొప్పున రెండేళ్లు చెల్లించాలని వారితో అన్నాడు. ‘మీరు సక్రమంగా డబ్బు చెల్లిస్తారో లేదో మాకు నమ్మకం కలగాలంటే వారానికి రూ.వెయ్యి చొప్పున నాలుగు వారాలకు రూ.4వేలు కట్టాలని, ఐదో వారంలో రూ.40వేలు ఇస్తానని’ అతను మహిళలను నమ్మిం చాడు. ఇందుకు గాను ఉచితంగా ముందుగానే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇస్తామని అతను తెలిపాడు. బొల్లవరంలోని అందరి పేర్లు రాసుకొని వెళ్లిన ఆ కేటుగాడు వారం తర్వాత కుక్కర్లను తీసుకొని వచ్చాడు. వారం రోజుల తర్వాత మళ్లీ వస్తామని మొదటి వారం కంతు కింద రూ.వెయ్యి ఇవ్వాలని చెప్పడంతో మహిళలు సరేనని చెప్పి కుక్కర్లు తీసుకున్నారు. ఈ క్రమంలో అతను నాలుగు వారాలు తిరిగి మహిళల వద్ద రూ.4వేలు చొప్పున వసూలు చేసుకున్నాడు. చివరి కంతు డిసెంబర్ 28న తీసుకొని, జనవరి 6న రూ.40 వేలు ఇస్తామని మహిళలతో నమ్మబలికాడు. అయితే జనవరి 6 దాటినా డబ్బు తీసుకొని రాకపోవడంతో మోసపోయినట్లు మహిళలు గ్రహించారు. లబో దిబోమంటున్న మహిళలు.. తక్కువ వడ్డీకి రుణం వస్తుందనే ఆశతో చాలా మంది మహిళలు ఇళ్లలో తమ భర్తలకు తెలియకుండా డబ్బు చెల్లించారు. బొల్లవరంలోని సునీత అనే మహిళ తన ఇంట్లో ఉన్న ఐదుగురి పేరుతో రూ.20 వేలు కట్టింది. అధిక వడ్డీకి తీసుకున్న అప్పు చెల్లించాలనే ఉద్దేశంతో, వడ్డీకి తీసుకొని ఈ డబ్బు కట్టినట్లు ఆమె చెబుతోంది. అయితే ఇప్పుడు మోసపోయానని తెలియడంతో ఆమె ఆందోళన చెందసాగింది. డ్వాక్రా డబ్బు కట్టడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ఆమె వాపోయింది. ప్రొద్దుటూరులోని చాలా ప్రాంతాల్లో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రాచమల్లు దృష్టికి.. బొల్లవరానికి చెందిన పలువురు మోసపోయిన మహిళలు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని కలిశారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పడంతో ఆశ పడి మోసపోయామని వారు ఎమ్మెల్యేతో అన్నారు. రూ.4 వేలు చొప్పున చెల్లించి మోసపోయామన్నారు. అందరూ పేద వారేనని, పనికి వెళ్తేగానీ సంసారాలు జరగవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘భగీరథ’కు తక్కువ వడ్డీ రుణాలు: ఎస్పీ సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం తక్కువ వడ్డీకే రుణాలిచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకు రావడం శుభపరిణామమని పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. శనివారం బ్యాంకుల ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలో కొన్ని జాతీయ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రూ.6,500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించగా, తాజాగా మరికొన్ని వాణిజ్య బ్యాంకులు రూ.3,200 కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. కెనరా బ్యాంక్ రూ. 2వేల కోట్లు, విజయా బ్యాంక్, ఎస్బీహెచ్ బ్యాంకులు రూ.600 కోట్ల చొప్పున రుణమిచ్చే విషయమై ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. ఆయా బ్యాంకులిచ్చిన రుణాలను సెగ్మెంట్ల వారీగా ఖర్చు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించాక సెగ్మెంట్లకు ఇవ్వాల్సిన రుణాల విషయమై బ్యాంకులు నిర్ణయం తీసుకోనున్నాయని పేర్కొన్నారు. సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ, శ్రీధర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెక్యూరిటీ లేని ‘మోసం’!
సాక్షి, హైదరాబాద్: తక్కువ వడ్డీకే రుణం.. ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు.. షరతులు అసలే లేవు.. ఇవే మాటలతో వందలాది మందిని మోసగించిందో ముఠా. నగరవాసి ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి రావడంతో గుర్గావ్, ఢిల్లీకి చెందిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. గుర్గావ్కు చెందిన మహిపాల్‌సింగ్ యాదవ్, ఢిల్లీ వాసులు విమల్ అరోరా, శాంతనూ కుమార్‌లను శనివారం గుర్గావ్లో అరెస్ట్ చేసి.. ట్రాన్సిట్ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. మరో ఇద్దరు నిందితులు సందీప్ జునేజా, రాకేశ్ శర్మ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఖుతుబుద్దీన్ రుణం పేరిట ఆరు లక్షల వరకు మోసపోయానని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం సీపీ మహేందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మహిపాల్‌సింగ్ 2005 నుంచి 2012 వరకు వివిధ కాల్ సెంటర్లలో వివిధ స్థాయిల్లో పనిచేశాడు. 2013 జూలైలో మై ఇన్వెస్ట్మెంట్ గురూజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను రాకేశ్ శర్మతో కలసి ప్రారంభించాడు. తొలినాళ్లలో సందీప్ జునేజాకు చెందిన వాల్యూ అడెడ్ కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాల్యూ అడెడ్ కార్డ్స్ విక్రయించేవాడు. ఈ వ్యాపారం సక్సెస్ కాకపోవడంతో రుణాల పేరిట ప్రజలను మోసగించాలని జునేజాతో కలసి మహిపాల్ స్కెచ్ వేశాడు. సెక్యూరిటీ, నిబంధనలు లేకుండా తక్కువ వడ్డీకే రుణమిస్తామని మై ఇన్వెస్ట్మెంట్ గురూజీ సర్వీసెస్ ద్వారా తతంగం నడిపించాడు. ఓకే అనుకున్న కస్టమర్‌కు ముందుగా అప్లికేషన్ పంపి.. ఆధార్, పాన్ కార్డ్ తదితర జిరాక్స్‌లు పంపాలని పోస్టల్ అడ్రస్ ఇచ్చేవారు. ఆ తర్వాత వాల్యూ ఫిన్వెస్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి లోన్ అప్రూవల్ అయిందనే సందేశాన్ని పంపేవారు. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 15 వేల నుంచి రూ. లక్ష వరకు.. ఆర్బీఐ, ఐటీ అధికారులను మేనేజ్ చేసేందుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు, వ్యాపారంలో నష్టం వస్తే ఇన్సూరెన్స్ కింద లక్ష.. ఇలా వివిధ రూపాల్లో రూ. ఐదు లక్షల వరకు డబ్బులు పిండుకునేవారు. ఇందుకోసం వివిధ బ్యాంక్ ఖాతాలు ఇచ్చేవారు. 30 బ్యాంక్ ఖాతాలు వీరి కంపెనీల పేరిట ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వాటిలో ఉన్న రూ. 1,51,49,675లను ఫ్రీజ్ చేశారు. కాగా, ఏపీ, తెలంగాణలో 118 మందితో కలిపి మూడు నెలల్లో 522 మంది బాధితులు ఉన్నట్టు నిం దితుల నుంచి సేకరించిన డాటా ప్రకారం పోలీసులు గుర్తించారు. ఈ సంఖ్య వేలల్లో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
తక్కువ వడ్డీకి రుణాలంటూ దగా
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు కాజేసిన మోసగాడ్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, రూ. 12 లక్షల స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఎల్‌కేవీ రంగారావు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన దొడ్డ శ్రీనివాస్ గతంలో కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇప్పించే సంస్థలో పని చేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేసిన ఇతను తక్కువ వడ్డీకే పరిశ్రమలకు రుణాలు ఇప్పిస్తానని, ఫైనాన్సర్ నరేందర్ పేరిట ఓ ఆంగ్లపత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటనను చూసిన తాండూరుకు చెందిన పెట్రోల్ బంక్ యజమాని మహ్మద్ హబీబ్‌ఖాన్ తాను సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నానని, తనకు రూ. 5 కోట్లు రుణం ఇప్పించాలని ఫోన్ ద్వారా నరేందర్ (శ్రీనివాస్)ను సంప్రదించాడు. సికింద్రాబాద్ సిక్విలేజ్లోని తమ కార్యాలయానికి వస్తే లోన్ గురించి మాట్లాడుకుందామని చెప్పడంతో హబీబ్‌ఖాన్ వచ్చారు. పరిశ్రమలకు తక్కువ వడ్డీకి(7.5 శాతం) రూ.30 కోట్ల వరకు రుణాలను ఇప్పిస్తానని నమ్మబలికాడు. ముందుగానే ఖాళీ ట్రంక్ పెట్టెలో కిందభాగంలో తెల్లని కాగితాలు, పైన రూ.500, రూ.1000 నోట్లతో అమర్చిన పెట్టెను అతనికి చూపించి ఓ పారిశ్రామికవేత్తకు రూ.50 కోట్ల రుణం డెలీవరీకి సిద్ధంగా ఉందని చెప్పాడు. అదే సమయంలో అక్కడికి మీర్ హుస్సేన్ అలీ అనే వ్యక్తి వచ్చి.. తాను దుబాయ్‌కు చెందిన ఫైనాన్సర్నని పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థకు హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయని, దీంతో తక్కువ వడ్డీకే రుణాలిస్తున్నామని చెప్పాడు. రూ.5 కోట్ల రుణానికి అడ్వాన్సుగా హబీబ్ నుంచి రూ.21 లక్షలు తీసుకుని, వారం రోజుల్లో రుణం మంజూరవుతుందని చెప్పారు. వారం తర్వాత హబీబ్‌ఖాన్ అక్కడికి వెళ్లగా కార్యాలయం తాళం వేసి ఉంది. ఆందోళనకు గురైన ఆయన నరేందర్ (శ్రీనివాస్)కు ఫోన్ చేయగా స్వీచ్చాప్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు జులై 23న సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పటి నుంచి పరారీలో ఉన్న శ్రీనివాస్ విజయవాడ నుంచి నగరానికి రాగా అరెస్టు చేశారు.