తక్కువ వడ్డీకి రుణాలంటూ దగా | Low interest runalantu dishonesty | Sakshi
Sakshi News home page

తక్కువ వడ్డీకి రుణాలంటూ దగా

Published Sun, Oct 13 2013 4:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Low interest runalantu dishonesty

అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు కాజేసిన మోసగాడ్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, రూ. 12 లక్షల స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఎల్‌కేవీ రంగారావు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన దొడ్డ శ్రీనివాస్ గతంలో కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇప్పించే సంస్థలో పని చేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేసిన ఇతను తక్కువ వడ్డీకే పరిశ్రమలకు రుణాలు ఇప్పిస్తానని, ఫైనాన్సర్ నరేందర్ పేరిట  ఓ ఆంగ్లపత్రికలో ప్రకటన ఇచ్చాడు.

ఈ ప్రకటనను చూసిన తాండూరుకు చెందిన పెట్రోల్ బంక్ యజమాని మహ్మద్ హబీబ్‌ఖాన్ తాను సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నానని, తనకు రూ. 5 కోట్లు రుణం ఇప్పించాలని ఫోన్ ద్వారా నరేందర్ (శ్రీనివాస్)ను సంప్రదించాడు.  సికింద్రాబాద్  సిక్‌విలేజ్‌లోని తమ కార్యాలయానికి వస్తే లోన్ గురించి మాట్లాడుకుందామని చెప్పడంతో హబీబ్‌ఖాన్ వచ్చారు.  పరిశ్రమలకు తక్కువ వడ్డీకి(7.5 శాతం) రూ.30 కోట్ల వరకు రుణాలను ఇప్పిస్తానని నమ్మబలికాడు.

ముందుగానే ఖాళీ ట్రంక్ పెట్టెలో కిందభాగంలో తెల్లని కాగితాలు, పైన రూ.500, రూ.1000 నోట్లతో అమర్చిన పెట్టెను అతనికి చూపించి ఓ పారిశ్రామికవేత్తకు రూ.50 కోట్ల రుణం డెలీవరీకి సిద్ధంగా ఉందని చెప్పాడు. అదే సమయంలో అక్కడికి మీర్ హుస్సేన్ అలీ అనే వ్యక్తి వచ్చి.. తాను దుబాయ్‌కు చెందిన ఫైనాన్సర్‌నని పరిచయం చేసుకున్నాడు.  తమ సంస్థకు హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయని, దీంతో తక్కువ వడ్డీకే రుణాలిస్తున్నామని చెప్పాడు.

రూ.5 కోట్ల రుణానికి అడ్వాన్సుగా హబీబ్ నుంచి రూ.21 లక్షలు తీసుకుని, వారం రోజుల్లో రుణం మంజూరవుతుందని చెప్పారు.  వారం తర్వాత హబీబ్‌ఖాన్ అక్కడికి వెళ్లగా కార్యాలయం తాళం వేసి ఉంది. ఆందోళనకు గురైన ఆయన నరేందర్ (శ్రీనివాస్)కు ఫోన్ చేయగా స్వీచ్చాప్ వచ్చింది.  మోసపోయానని గ్రహించిన బాధితుడు జులై 23న  సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు  అప్పటి నుంచి పరారీలో ఉన్న శ్రీనివాస్ విజయవాడ నుంచి నగరానికి రాగా అరెస్టు చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement