Small Business Loan Initiative: చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఫేస్‌బుక్ ముందుకు వచ్చింది. వీరికి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఆగస్టు 20 నుంచి ఈ లోన్లు ఇస్తామని ఫేస్‌బుక్ ఇండియా ప్రకటించింది.
స్మాల్ బిజినెస్ లోన్
స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై ఈ రోజు అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఫేస్‌బుక్. లక్షల కోట్ల రూపాయల సంపద ఈ రోజు ఫేస్‌బుక్ సొంతం. దీంతో తనలాగే ఎదుగుతోన్న స్టార్టప్‌లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పేరుతో గతేడాది 100 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్‌బుక్ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది.
ఇండియాఫై ద్వారా
స్మాల్ బిజినెల్ లోన్ పథకం అమలు చేసేందుకు ఇండిఫై సంస్థతో ఫేస్‌బుక్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఇండిఫై సంస్థ చిరు వ్యాపారులకు లోన్లు అందించే సంస్థగా పని చేస్తోంది. ఫేస్‌బుక్ స్మాల్‌బిజినెస్ లోన్లు పొందాలనుకునేవారు ఇండియాఫై ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌లో కూడా
స్మాల్ బిజినెస్ లోన్ పథకంలో భాగంగా ఇండియాకు 4 మిలియన్ డాలర్లు కేటాయించింది. వీటితో దేశంలో ఉన్న 200 పట్టణాల్లోని చిరు, మధ్యతరహా వ్యాపారులకు లోన్లు ఇవ్వనున్నారు. కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తారు. తొలివిడతగా ఆగస్టు 20వ తేది నుంచి ఈ పథకాన్ని హైదరాబాద్, న్యూఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరులలో అమలు చేయనున్నారు. కనీసం మూడు వేల మందికి అయినా లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తక్కువ వడ్డీ
ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వడానికి వస్తున్న అనేక స్టార్టప్ కంపెనీలు పెట్టుబడి దొరక్క ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించాం. అందుకే వారికి అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పథకానికి శ్రీకారం చుట్టినట్టు ఫేస్‌బుక్ ఇండియా, వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మోహన్ అన్నారు. స్మాల్‌బిజినెస్ ద్వారా ఇచ్చే లోన్‌కి నామమాత్రపు వడ్డీ తీసుకుంటామన్నారు. ఇక మహిళా వ్యాపారులకయితే వడ్డీలో అదనంగా 0.20 శాతం రాయితీతో రుణాలు ఇస్తామన్నారు.
- సాక్షి, వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment