వేతన జీవుల అవస్థలు
ఎస్ఎస్ఏ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులకు 'ఎల్పీసీ' అడ్డంకి
ఐదు నెలలుగా జీతాలకు బ్రేక్
అనంతపురం ఎడ్యుకేషన్ :
నెల రోజులు పనిచేసి ఒకటో తేదీన జీతం కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తారు. కానీ డిప్యూటేషన్‌పై సర్వశిక్ష అభియాన్‌లో పనిచేసి తిరిగి మాతృశాఖ, ఇతర శాఖలకు వెళ్లిన ఉద్యోగులు మాత్రం ఐదు నెలలుగా జీతాలందక అవస్థలు పడుతున్నారు. జీతాలు ఎందుకు ఆపారో తెలియక, 'ఎల్పీసీ' (లాస్ట్ పే సర్టిఫికెట్) ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు ఇలా.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా డిప్యూటేషన్‌లో పని చేస్తూ మరోశాఖకు బదిలీ అయితే అతనికి సంబంధించి 15 రోజుల్లో ఎల్పీసీ ఇవ్వాలి. నెల జీతం బ్రేక్ పడకుండా చూడాలి. పని చేస్తున్న చోటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెండింగ్ ఉన్నా...ఎల్‌పీసీకి కొర్రీ వేయరాదు. బదిలీపై వెళ్లిన శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి వాటిని రాబట్టుకోవాలి. తప్ప పెండింగ్ పెట్టరాదు.
ఎస్ఎస్ఏలో జరిగిందిలా... డీఈగా పని చేసిన బాలాజీనాయక్ జూలై మొదటివారంలో, ఇన్చార్జ్ ఈఈగా పని చేసిన వెంకటస్వామి అదేనెల చివరివారంలో బదిలీపై వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన సూర్యనారాయణరెడ్డి మేలో, ఇక్బాల్ జూన్‌లో, ఎఫ్ఏఓ పార్వతి, అలెస్కోగా పని చేసిన వెంకటరమణనాయక్ అక్టోబర్‌లో ఇక్కడి ఎస్ఎస్ఏ నుంచి ఇతర శాఖలకు వెళ్లారు. అప్పటి నుంచి వీరు ఎల్పీసీల కోసం తిరుగుతున్నా..పట్టించుకునే నాథుడే లేరు. డబ్బు లేక అల్లాడుతున్నానంటూ ఓ ఉద్యోగి వాపోయాడు. కాగా వీరిలో ఎఫ్ఏఓ పార్వతి, సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్, అలెస్కో వెంకటరమణనాయక్‌కు ఇటీవల ఎల్పీసీ ఇచ్చారు. మిగిలిన వారికి ఇంకా ఇవ్వలేదు.
ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే... – దశరథరామయ్య, ఎస్ఎస్ఏ పీఓ
ఆర్థికపరమైన వ్యవహారాల వల్ల ఎల్పీసీలు ఇవ్వడం కొద్దిగా ఆలస్యమవుతోంది. కోట్లాది రూపాయలు చేసిన పనులు, అడ్వాన్స్‌లకు లెక్కలు చెప్పకుండా, వివరాలు ఇవ్వకుండా వెళ్తే రేప్పొద్దున ఆడిట్ ఇబ్బందులు వస్తాయి. వాటిని క్లియర్ చేయాలని అందరికీ సూచించాం. కొందరు ఉద్యోగులు ఖాళీ చెక్కులు ఇష్యూ చేశారు, ఓ ఉద్యోగి కీలకమైన ఫైళ్లు గల్లంతు చేశారు. వీటన్నంటినీ క్లియర్ చేయాలని చెప్పాం. క్లియర్ చేసిన కొందరికి ఎల్పీసీలు ఇచ్చేశాం. తక్కిన వారికి కూడా సిద్ధం చేస్తున్నాం.