ప్రియాంకతో కలిసి సుమిత్ర ఇంటికి సోనియా..
న్యూఢిల్లీ: మరో పది రోజుల్లో పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇంటికి విశిష్ట అతిథి వేంచేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. సోమవారం రాత్రి స్పీకర్ అధికార నివాసం లెటర్స్ రెసిడెంట్ కు వెళ్లి సుమిత్రా మహాజన్ ను కలుసుకున్నారు. సోనియా వెంట ఆమె కూతురు ప్రియాంకా వాద్రా రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని లెటర్స్ రెసిడెన్స్ వర్గాలు ప్రకటించాయి.
నవంబర్ 26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభకానుండటంతో స్పీకర్ తో సోనియా గాంధీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై ఫిర్యాదు చేసేందుకు సోనియా.. ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన సంగతి తెలిసిందే. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం ఒక్కరోజు కూడా సభజరగనీయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ ఈ సారి మరిన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దాద్రి ఘటన, రచయితలు, శాస్త్రవేత్తలు, సినీ దిగ్గజాల అవార్డు వాపసీలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.