భారీగా ఉద్యోగాల కోత
ముంబై: దేశీయ అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. డిజిటైజేషన్ , మందగించిన వ్యాపారం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 11.2 శాతం కోత పెట్టింది. దాదాపు 14 వేల మందిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఎల్అండ్ టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రామన్ తెలిపారు.
మొత్తం 1.2 లక్షలమంది ఉద్యోగులు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 14 వేలమందిని తొలగించినట్టు రామన్ తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని పేర్కొన్నారు. మొత్తంగా వివిధ వ్యాపారాల్లో ఈ తొలగింపును చేపట్టిన సంస్థ ఎంతమంది ఉద్యోగుల పై వేటు వేయనుందీ ప్రకటించలేదు.
ఆయిల్ ధరల పతనం మధ్య-తూర్పు ప్రాంతంలో తమ వ్యాపారాన్ని దెబ్బతీసిందని , దీంతో రాబోయే నెలల్లో కూడా ఆర్థిక పరిస్థితి గడ్డుగానే ఉండనుందని ఎల్ అండ్ టీ అంచనా వేస్తోంది. దేశీయ మార్కెట్ లో పోటీ తీవ్రంగా ఉందని చెప్పింది. అయితే ఈ ఉద్యోగాల కోత దిద్దుబాటు చర్యల్లో భాగం తప్ప సీక్వెన్షియల్ తగ్గింపుగా చూడరాదని రామన్ కోరారు. తమ వ్యాపారం తిరిగి సాధారణ పరిస్థితికి పొందడానికి కొంత సమయం పడుతుందన్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల తొలగింపు అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా సుమారు రెండు లక్షల కోట్ల ఆదాయవృద్ధి అంచనాతో ఈ ఏడాది ఐదు సంవత్సరాల వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించింది. ఆ ప్లాన్ లో కొన్ని నిరర్థక వ్యాపారాలపై దృష్టి పెట్టింది. 18-24 నెలల్లో వీటిని తిరిగి తీసుకోవాలని యోచిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎల్ అండ్ టీ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది క్యూ2తో పోల్చితే నికర లాభంలో 84 శాతం వృద్ధి నమోదు చేయడంతో స్టాక్ లో భారీగా కొనుగోళ్ల ధోరణి నెలకొంది.