నిరంజన్ కుటుంబానికి కేరళ రూ.50లక్షల సాయం
కొచ్చి: పంజాబ్‌లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన లెప్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం బుధవారం రూ.50 లక్షల సాయం ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా నిరంజన్ కుటుంబానికి 30 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళలోని పాలక్కడ్ జిల్లా ఎలాంబస్సెర్ట్ గ్రామానికి చెందిన నిరంజన్‌కుమార్ 2004లో సైన్యంలో చేరారు.
ఎస్‌ఎస్‌జీలో చేరడానికి ముందు మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ ఆఫ్ ఆర్మీలో పనిచేశారు. పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేయడంలో నిపుణుడైన నిరంజన్ బాంబు నిర్వీర్యక విభాగం అధికారిగా ఇటీవలే పదోన్నతి పొందారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేస్తుండగా అది పేలి దుర్మరణం చెందారు. కల్నల్ నిరంజన్‌కు భార్య రాధిక, రెండేళ్ల కుమార్తె విస్మయ ఉన్నారు. ఆయన కుటుంబం ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడింది.