బిర బిరా.. లాభాలు
ఏడాదంతా సాగు
ఏడాది పొడవునా ఈ పంటను సాగు చేయవచ్చు.
విత్తిన మూడు వారాలకే కాతకు రావడం దీని విశిష్టత.
కాయలు తెంపడం, మార్కెట్కు తరలించడం తేలికగా ఉంటుంది.
దీనివల్ల ఎక్కువ మంది కూలీల అవసరం ఉండదు. ఫలితంగా ఖర్చు కలిసొస్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తి అయ్యే బీరకాయలపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే తీగజాతి కూరగాయల పంటలకు తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి.
వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు.
డ్రిప్ పద్ధతిలో పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
విత్తన రకాలు..
పలు కంపెనీలకు చెందిన హైబ్రిడ్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
రెండు వరుసల మధ్య దూరం ఒకటిన్నర నుంచి రెండున్నర మీటర్లు, రెండు పాదుల మధ్య దూరం 0.6 నుంచి 0.9మీటర్లు ఉండేలా చూసుకోవాలి.
ఎకరాకు ఒకటిన్నర కిలోల నుంచి రెండు కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది.
విత్తనశుద్ధి
కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరం, ఐదు గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
ఎరువులు విత్తే ముందు ఎకరాకు 6నుంచి 8టన్నుల పశవుల ఎరువు, 40కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను గుంతల్లో వేసుకోవాలి.
విత్తిన 25 రోజులకు పూత, పిందె దశలో 40 కిలోల నత్రజని ఎరువులు వేసుకోవాలి.
మొక్కకు దగ్గరగా ఎరువులు వేయకూడదు. ఒకవేళ వేసినట్లయితే వెంటనే నీటి తడి అందించాలి.
కలుపు నివారణ
పంటల సాగులో కలుపు మొక్కల నివారణ అతిముఖ్యమైన అంశం.
బీర తోటలోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి.
విత్తనం నాటిన మరుసటి రోజున తేలిక నేలల్లో లీటరు మెటాక్లోర్ (డ్యుయల్) మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. బరువు నేలల్లో1.5 లీటర్ల చొప్పున స్ప్రే చేసుకోవాలి.
మొక్కలు రెండు, నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ పౌడర్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే పూత ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది.
రెండుమూడు తడులు అందించిన తర్వాత మట్టిని గుళ్ల చేయాలి.
నీటి యాజమాన్యం
పాదు చుట్టూ 3-5సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి.
వారానికో తడి అందిస్తే పంట ఆరోగ్యవంతంగా ఉంటుంది.
నీరు ఎక్కువకాలం పాదు చుట్టూ నిల్వకుండా జాగ్రత్తపడాలి.
తెగుళ్లు
తీగజాతి రకం పంటలపై తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలున్నాయి.
వీటిలో ముఖ్యమైనవి బూజు తెగులు, బూడిద తెగులు, వేరు కుళ్లు తెగులు, పక్షికన్ను తెగులు ప్రధానమైనవి.
వీటిని సకాలంలో గుర్తించి వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు తగిన మందులు పిచికారీ చేయాలి.
సస్యరక్షణ చర్యలు
ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి.
పంటమార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి.
కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వంద గ్రాముల విత్తనానికి రెండు గ్రాముల డెర్మా విరిడి మందును వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి.
అల్లి రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి.
పెరుగుదల దశ నుంచి పూతకు వచ్చే వరకు వేపగింజల కషాయాన్ని తగిన మోతాదులో 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.