అరుణగ్రహంపై ఇప్పుడూ నీటి ప్రవాహం?
వాషింగ్టన్: అంగారకుడిపై గతంలోనే కాదు.. ఇప్పుడు కూడా నీటి ప్రవాహం ఉందట! కాకపోతే స్వచ్ఛమైన మంచినీరు కాకుండా ప్రస్తుతం ఉప్పు నీరు ప్రవహిస్తోందట. నాసాకు చెందిన వ్యోమనౌక తీసిన అత్యంత నాణ్యమైన ఫొటోలను అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసిందని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధక విద్యార్థి లుజేంద్ర ఓఝా అంటున్నారు. మార్స్ చుట్టూ తిరుగుతూ ఆ గ్రహాన్ని పరిశీలిస్తున్న మార్స్ రికన్నాయిసెన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలపై పరిశోధించిన తాము ఈ విషయం గుర్తించామని ఓఝా వెల్లడించారు. పరిశోధనలో భాగంగా.. అంగారకుడిపై కొన్ని చోట్ల పర్వత ప్రాంతాల్లో కిందికి జాలువారుతున్నట్లు చేతి వేళ్ల మాదిరిగా, నల్లగా ఉన్న చారలను గుర్తించారు.
తర్వాత పరిశీలించగా అవి సీజన్ల వారీగా ముఖ్యంగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడే ఏర్పడుతున్నట్లు తేలింది. దీంతో ఉప్పునీటి ప్రవాహం వల్లే ఇలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందని, మార్స్‌పై ఆయా ప్రదేశాల్లో గడ్డకట్టిన స్థితిలో ఉప్పునీరు ఉండవచ్చని అంచనా వేశారు. ఆ ఉప్పునీటిలో ఫెర్రిక్ సల్ఫేట్ వంటి ఇనుప ఖనిజం పాళ్లు ఎక్కువగా ఉండే పదార్థం ఉండవచ్చని, ఇనుప ఖనిజంలో సీజన్లవారీగా మార్పులు జరుగుతాయి కాబట్టి.. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఉప్పునీరు ద్రవరూపంలోకి మారి కిందికి ప్రవహిస్తుండవచ్చని చెబుతున్నారు. అయితే మార్స్‌పై నీరు ఉందనేందుకు ఇవి ఆధారాలే అయినా.. వంద శాతం నిజమని చెప్పలేమని, దీనిపై నాసా మరింత పరిశోధన చేపట్టనుందని ఓఝా తెలిపారు.