lv prasad hospital
-
తండ్రి కొడుకుల హత్య కేసు: మరణాంతరం నేత్ర దానం
ఉప్పల్: ఉప్పల్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైన తండ్రీ కొడుకులు నర్సింహ శర్మ, శ్రీనివాస్‌ల నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పతికి దానం చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరసింహ శర్మ కుమారుడు, కూతుళ్లు పేర్కొన్నారు. (చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం) -
8 మంది కంటి వెలుగు బాధితుల డిశ్చార్జి
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు ఆపరేషన్ వికటించి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది మందిని సోమవారం డిశ్చార్జి చేశారు. పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన 19 మంది కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోగా, వారికి వరంగల్ జయ నర్సింగ్ హోమ్‌లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. అందులో 17 మందికి ఆపరేషన్ వికటించిన సంగతి తెలిసిందే. వారికి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అందులో కోలుకున్న 8 మందిని డిశ్చార్జి చేసినట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. మిగిలిన వారికి చికిత్స అందుతోందని, ఎవరికీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేదని పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన వారిలో గోరంట్ల సుజాత (55), అజ్మీర మేఘ్య (70), గోపరాజు బుచ్చమ్మ (65), భగవాన్ (70), ఎం.శాంతమ్మ (58), ఎం.రాజయ్య (70), బోలె సరోజన (45), కె.సరోజన (48) ఉన్నారు. పూర్తిగా నయం కాకుండానే డిశ్చార్జి! డిశ్చార్జి అయిన 8 మందిలో ఇద్దరు మాత్రం తమకు పూర్తిగా నయం కాలేదని ఆరోపించారు. కె.సరోజన కుమారుడు హరిప్రసాద్ మాట్లాడుతూ.. తన తల్లి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. ఆమెకు కళ్లు కనిపించడం లేదన్నారు. డిశ్చార్జి అయిన అందరి పరిస్థితీ అలాగే ఉందని తెలిపారు. డాక్టర్లను అడిగితే సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. తన తల్లికి సగమే నయమైందని గోపరాజు బుచ్చమ్మ కుమారుడు కుమారస్వామి అన్నారు. 8 మందికి నయం కాలేదన్న ప్రచారాన్ని డాక్టర్ శ్రీనివాసరావు ఖం డించారు. నయం కానప్పుడు అందరినీ కాకుండా 8 మందినే ఎందుకు డిశ్చార్జి చేస్తామని ప్రశ్నించారు. ఈ సంఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. ఆపరేషన్ వికటించి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రతిపక్షాల నేతలు రెండు రోజులుగా పరామర్శిస్తున్నారు. -
పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స.!
సాక్షి, సినిమా: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొంత కాలంగా కంటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ సమస్య పెరగిపోవడంతో పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే పది రోజుల క్రితమే పవన్ కల్యాణ్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించారు. వారు పవన్ కంటిని పరీక్షించి, ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించారు. శస్త్రచికిత్సతోనే కురుపును తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం వైద్యులు పవన్ కంటికి శస్త్ర చికిత్స చేశారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు. గురువారం సాయంత్రం పవన్‌ని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. పవన్‌కు వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తొంది. ఆ మధ్య కొన్ని రోజుల పాటు పవన్ నల్ల కళ్లద్దాల్ని వాడారు. తన కంటి సమస్య గురించి పవన్ తొలిసారిగా రంగస్థలం సక్సెస్ మీట్లో వెల్లడించారు. కానీ ఆ సమస్య ఏమిటన్నది అప్పుడు చెప్పలేదు. ఆ కార్యక్రమంకు ఆయన నల్ల కళ్లద్దాలు పెట్టుకొని వచ్చి, కంటి సమస్యతోనే కళ్లజోడు పెట్టుకున్నానని తెలిపారు. -
భర్త రాసినట్లుగానే లేఖలు రాసి..
బంజారాహిల్స్: భార్యా, భర్తల మధ్య విభేదాలు సృష్టించి ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోవాలని, ఇందుకోసం తన క్రిమినల్ బ్రెయిన్‌తో ఓ వివాహిత జీవితంతో చెలగాటమాడిన నిందితుడు మాల్యాద్రిని మరింత సమాచారం కోసం కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు గురువారం తిరిగి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్, వెంకటేశ్వరనగర్‌కు చెందిన మాల్యాద్రి అపో ఆస్పత్రిలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన మాల్యాద్రి వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసిన అతను భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ ముఠాకు సుపారీ ఇచ్చాడు. ఆమెపై భర్తకు అనుమానం కలిగేలా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట బోగస్ అపాయింట్మెంట్ లెటర్ సృష్టించాడు. ఎల్వీ ప్రసాద్ హెచ్ఆర్ మాట్లాడుతున్నట్లుగా తానే ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఆమె భర్త రాసినట్లుగా కొన్ని లేఖలు రాసి ఆమె క్యారెక్టర్‌పై అనుమానాలు రేకెత్తించాడు. అపోలో ఆస్పత్రికి కూడా లేఖలు రాసి తనకు సంబంధాలు ఉన్నాయంటూ ఆమె భర్త రాసినట్లుగానే లేఖలు రాసి ఇద్దరి మధ్య చిచ్చుపెట్టాడు. దానిని తనకు అనుకూలంగా మార్చుకొని భర్త ఆమెను వెళ్లగొడితే తనతో పాటు ఉంచుకోవాలని పక్కా పథకం వేశాడు. అయితే చివరకు పోలీసులకు చిక్కాడు. అపోలో, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, భర్త రాసినట్లుగా లేఖలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న నిందితుడిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నాడు. ఆమెను దక్కించుకునేందుకే సదరు వివాహిత భర్తను హత్య చేయాలని సుపారి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. బోగస్ పత్రాలు సృష్టించినట్లు అంగీకరించాడు. -
ఏడాదిలో 2,043 కార్నియా మార్పిడులు
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి అరుదైన ఘనత: చైర్మన్ గుళ్లపల్లి హైదరాబాద్: ఏడాది వ్యవధిలో 2,043 కార్నియా మార్పిడులు చేసి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సరికొత్త రికార్డు సృష్టించిందని సంస్థ చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 24 వేల కార్నియా మార్పిడులు చేసినట్లు వెల్లడించారు. గత 27 ఏళ్లుగా కార్నియాల సేకరణ, మార్పిడి, కార్నియా వ్యాధులకు స్టెమ్‌సెల్ ఆధారిత చికిత్స తదితర విధానాల్లో తమ సంస్థ అహర్నిశలు శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. అలాగే సంస్థకు భారీ విరాళాలు అందజేసిన దాత తేజ్ కోహ్లీని ఆయన ప్రశంసించారు. -
ప్రియాంకాగాంధీ కుమారునికి చికిత్స
⇒ క్రికెట్ ఆడుతుండగా రెహాన్ కంటికి గాయం ⇒ ప్రత్యేక విమానంలో నగరానికి ⇒ ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రా కుమారుడు రెహాన్(16)కు శనివారం ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు చికిత్స అందజేశారు. గత వారం స్కూల్లో క్రికెట్ ఆడుతుండగా రెహాన్ కంటి కి బాల్ తగిలి తీవ్ర గాయమైంది. దీంతో అతనికి ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందజే శారు. ఎయిమ్స్ వైద్యుల సూచన మేరకు సెకండ్ ఒపీనియన్ తీసుకునేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంక దంపతులు కుమారుడు రెహాన్‌ను తీసుకుని ప్రత్యేక విమానంలో ఉదయం పది గంటలకు హైదరాబాద్ చేరుకు న్నారు. నేరుగా ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లారు. రెహాన్‌కు వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి.. దెబ్బతిన్న భాగానికి చికిత్స అందజేశారు. అయితే గాయం తీవ్రత.. ఇతర వివరాలను వైద్యులు వెల్లడించలేదు. సాయంత్రం వరకు ప్రియాంక కుటుంబం ఆస్పత్రిలోనే ఉంది. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భద్రతను పెంచారు. రెహాన్‌కు కంటి ఆపరేషన్ పూర్తవగానే.. ఆస్పత్రి నుంచి ప్రియాంక, రాబర్ట్ వాద్రా తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ప్రియాంక దంపతుల రాకను అత్యంత గోప్యంగా ఉంచారు. కనీసం పార్టీ ముఖ్య నేతలకు కూడా విషయం తెలియనివ్వలేదు. -
మద్యం మత్తులో విద్యార్థినుల హల్ చల్
హైదరాబాద్: మద్యం మత్తులో విద్యార్థినులు హల్ చల్ చేశారు. సోమవారం రాత్రి పీకలదాక తాగిన విద్యార్థినులు రోడ్డు పై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా ముందుకు పోయారు. దీంతో బైక్‌పై ఉన్న యువకులు కారును వెంబడించి జూబ్లిహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వద్ద వారిని అడ్డుకున్నారు. ఆ సమయానికి మద్యం సేవిస్తున్న గ్లాసులు కూడా కారులోనే ఉన్నాయి. అంతేకాకుండా డోర్లు కూడా తెరవకుండా విద్యార్థినులు కారులోనే ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేత్రదానానికి ఆ గ్రామస్తులు అంగీకారం
చేవెళ్లరూరల్: చనిపోయిన తర్వాత కూడా మరొకరికి చూపును ప్రసాదించాలనే సదుద్దేశంతో ఆ గ్రామస్తులంతా ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడ గ్రామస్తుల ముందుచూపు ఇది. గ్రామంలో దాదాపు 80 కుటుంబాలు, 480 మంది జనాభా ఉంది. అంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నెల రోజుల నుంచి గ్రామంలోని వివేకానంద యువజన సంఘం సభ్యులు నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. యువకుల మాటలకు గ్రామస్తులంతా సరేనన్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి వారితో మాట్లాడి ఆదివారం గ్రామంలోనే 480 మంది నేత్రాలను దానం చేస్తూ అంగీకారపత్రాలను అందజేసేందుకు సిద్ధమయ్యారు. -
కార్పోరేట్ వైద్యం అందరికీ అందాలి: గవర్నర్
హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ ఆసుప్రతులు మెట్రో నగరాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ వైద్యసేవలను అందించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కార్పోరేట్ వైద్యం అన్నివర్గాల వారికి అందేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నరసింహన్ సూచించారు. ఇరవై వేల కార్నియా మార్పిడిలతో రికార్డు సృష్టించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన బృందాన్ని గవర్నర్ సన్మానించారు. కంటికి చికిత్స చేసి చూపునివ్వడం అంటే ప్రపంచానికి వెలుగునివ్వటమే అని ఆయన అన్నారు. -
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఉదయ్ కిరణ్ కళ్లు దానం
-
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఉదయ్ కిరణ్ కళ్లు దానం
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న సినినటుడు ఉదయ్ కిరణ్ నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు సోమవారం ఉదయం ఉదయ్ కిరణ్ నేత్రాలలోని రెటీనాను సేకరించారు. మరోవైపు ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అపోలో ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అర్థాంతరంగా తనువు చాలించిన ఉదయ్ కిరణ్... తన కళ్లు మాత్రం వేరొకరికి చూపునిచ్చేలా సజీవంగా నిలిచాడు.