
ప్రియాంకాగాంధీ కుమారునికి చికిత్స
⇒ క్రికెట్ ఆడుతుండగా రెహాన్ కంటికి గాయం
⇒ ప్రత్యేక విమానంలో నగరానికి
⇒ ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రా కుమారుడు రెహాన్(16)కు శనివారం ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు చికిత్స అందజేశారు. గత వారం స్కూల్‌లో క్రికెట్ ఆడుతుండగా రెహాన్ కంటి కి బాల్ తగిలి తీవ్ర గాయమైంది. దీంతో అతనికి ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందజే శారు. ఎయిమ్స్ వైద్యుల సూచన మేరకు సెకండ్ ఒపీనియన్ తీసుకునేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంక దంపతులు కుమారుడు రెహాన్‌ను తీసుకుని ప్రత్యేక విమానంలో ఉదయం పది గంటలకు హైదరాబాద్ చేరుకు న్నారు. నేరుగా ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లారు.
రెహాన్‌కు వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి.. దెబ్బతిన్న భాగానికి చికిత్స అందజేశారు. అయితే గాయం తీవ్రత.. ఇతర వివరాలను వైద్యులు వెల్లడించలేదు. సాయంత్రం వరకు ప్రియాంక కుటుంబం ఆస్పత్రిలోనే ఉంది. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భద్రతను పెంచారు. రెహాన్‌కు కంటి ఆపరేషన్ పూర్తవగానే.. ఆస్పత్రి నుంచి ప్రియాంక, రాబర్ట్ వాద్రా తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ప్రియాంక దంపతుల రాకను అత్యంత గోప్యంగా ఉంచారు. కనీసం పార్టీ ముఖ్య నేతలకు కూడా విషయం తెలియనివ్వలేదు.